వాషింగ్టన్: యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ సమీక్షిస్తున్న నేపథ్యంలో, గత 24 గంటల్లో టెహ్రాన్‌తో వాషింగ్టన్ “చాలా మంచి చర్చలు” జరిపిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. “మేము ఒక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని” ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో అగ్రరాజ్యాధినేత చెప్పారు.
“ఇరాన్‌తో చర్చల్లో మంచి పురోగతి ఉంది. చాలా సజావుగా సాగుతోంది, ఏం జరుగుతుందో చూద్దాం. వారు ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు, వారు చర్చలు జరపాలనుకుంటున్నారని” ట్రంప్ జోడించారు.
యుద్ధాన్ని ముగించి, హర్ముజ్ జలసంధిని తెరవడమే లక్ష్యంగా చర్చలను పునఃప్రారంభించేందుకు ఇరాన్, అమెరికా ప్రస్తుతం మధ్యవర్తులతో కలిసి ఒక ఫ్రేమ్‌వర్క్‌పై పనిచేస్తున్నాయని, వచ్చే వారం ఇస్లామాబాద్‌లో చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
ఇరాన్‌తో కుదిరే ఒప్పందం “ఒక వారంలోనే” ఖరారు కావచ్చని తాను నమ్ముతున్నట్లు ట్రంప్… ఫాక్స్ న్యూస్‌కు చెందిన బ్రెట్ బేయర్‌తో కూడా చెప్పారు.
“కొద్దిసేపటి క్రితం నేను అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడాను, ఆయన ఈ ఒప్పందం, ఈ అవగాహన ఒప్పందం పట్ల ఆశాభావంతో ఉన్నారు, ఇది మంచి ఫలితాలనిస్తుందని భావిస్తున్నారు.
“ఆయన ఆశాభావంతో ఉన్నారని చెప్పాలి… దీనికి ఎంత సమయం పడుతుందని నేను ఆయన్ని అడిగాను, అంతా పూర్తి చేయడానికి ఒక వారం పడుతుందని ఆయన చెప్పారు,” అని బైయర్ ఒక ప్రత్యక్ష వార్తా ప్రసారంలో అన్నారు.
నౌకాయాన స్వేచ్ఛ
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేయడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగాయి. దీనికి ప్రతిగా టెహ్రాన్, ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలపై దాడులు చేయడంతో పాటు, హర్ముజ్ జలసంధిని కూడా మూసివేశారు.
పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ 8న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది, కానీ ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు శాశ్వత ఒప్పందానికి దారితీయలేదు. ఆ తర్వాత ట్రంప్ ఎటువంటి గడువు విధించకుండా ఈ సంధిని పొడిగించారు.
ఏప్రిల్ 13 నుండి, అమెరికా లక్ష్యంగా నౌకాదళ దిగ్బంధనాన్ని అమలు చేస్తోంది. హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకాయానానికి స్వేచ్ఛను పునరుద్ధరించేందుకు చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను అమెరికా సైన్యం తాత్కాలికంగా నిలిపివేస్తుందని ట్రంప్ మంగళవారం ప్రకటించారు. అయితే, అమెరికా దిగ్బంధనం మాత్రం ‘పూర్తి స్థాయిలో అమలులో’ ఉంటుందని ఆయన తెలిపారు.

