హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (TGSWREIS) ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ (Centers of Excellence) విద్యార్థులు, తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయ,ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TG EAPCET-2026)లో మంచి ర్యాంకులను సాధించారని ఒక ప్రకటనలో తెలిపింది. సరికొత్త రికార్డులను సృష్టిస్తూ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి, గురుకులాలు అగ్రశ్రేణి విద్యాసంస్థలుగా నిరూపించుకున్నాయి.
ఈ సందర్భంగా, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేసారు. పేద, దళిత, గిరిజన,వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులలో ఉన్న అసాధారణ ప్రతిభకు ఈ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు.
కార్పొరేట్ స్థాయిలో అందుతున్న స్టడీ మెటీరియల్, పర్సనలైజ్డ్ మెంటరింగ్, ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌ల (Mock tests) సహాయంతో విద్యార్థులు వెటర్నరీ, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత కోర్సుల్లో ప్రవేశాలకు సిద్ధమయ్యారు. “సరైన అవకాశం కల్పిస్తే, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు కూడా అద్భుతాలు సృష్టించగలరని వారు మరోసారి నిరూపించారు,” అని మంత్రి అన్నారు.
గురుకుల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆధునిక వసతులు, ప్రత్యేక శిక్షణ, డిజిటల్ అభ్యాసం, పోటీ పరీక్షల శిక్షణ కోసం నిధులను క్రమం తప్పకుండా విడుదల చేస్తోందని ఆయన తెలిపారు.
SSC, ఇంటర్మీడియట్, JEE, NEET, EAPCET వంటి ప్రధాన పరీక్షలలో గురుకుల విద్యార్థులు వరుస విజయాలు సాధించడాన్ని TGSWREIS కార్యదర్శి కంభంపాటి శారద అభినందించారు. ఈ విజయాలు ఆ విద్యా సంస్థలో అందిస్తున్న నాణ్యమైన విద్యకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
అంతేకాకుండా, గురుకులాల్లో పాటించే క్రమశిక్షణ, భద్రత,పోటీ పరీక్షల కోసం అందించే ప్రత్యేక శిక్షణ, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో అవకాశాలు పొందడానికి ఎంతగానో దోహదపడ్డాయని ఆమె తెలిపారు.


