న్యూఢిల్లీ: “మనం ఇంతకు ముందెన్నడూ చూడని” ఒక భారీ ఆర్థిక తుఫాను దేశం వైపు అనివార్యంగా దూసుకు వస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు.
ప్రజలు విదేశాలకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేసిన వెంటనే ఐదు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీపై గాంధీ విమర్శలు గుప్పించారు. అదానీ-అంబానీలు నిర్మించిన బృహత్తర ఆర్థిక నిర్మాణం ఈ తుఫానులో కూలిపోతుందని, అయితే ఆ దిగ్గజాలు తమ రాజభవనాల్లోనే ఉంటారని, కానీ దాని భారాన్ని సామాన్యుడే మోయాల్సి వస్తుందని కూడా గాంధీ అన్నారు.
మోదీ ఆర్థిక విధానాలపై గాంధీ విమర్శలు….”అదానీ, అంబానీలతో ఆయన (నరేంద్ర మోదీ) నిర్మించిన నిర్మాణం చెక్కుచెదరకుండా ఉండదు, అది కూలిపోతుంది. విచారకరంగా, ఆ నష్టాన్ని సామాన్య ప్రజలే అనుభవిస్తారు. మరో మాటలో చెప్పాలంటే, వారు తమ రాజభవనాల్లోనే ఉంటారు, కానీ ఆ పూర్తి షాక్‌ను యూపీ యువత, ప్రజలు అనుభవిస్తారు,” అని రాయ్‌బరేలీలో ఒక సభలో ప్రసంగించిన అనంతరం గాంధీ విలేకరులతో అన్నారు.
ఇంతకుముందు, ఇక్కడ బచ్ఛ్రావన్‌లో ఒక వివాహ మందిరం ప్రారంభోత్సవం అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, విదేశాలకు వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన వెంటనే మోదీ విదేశాలకు వెళ్లడాన్ని గాంధీ విమర్శించారు.
“రోజురోజుకీ, కార్మికులను, చిన్న వ్యాపారులను ఆదుకోవడం ప్రారంభించాలని మేము నరేంద్ర మోదీని కోరుతూనే ఉన్నాము… అయినా, ఆయన ఏం చేస్తారు! నార్వేకు వెళ్ళిపోతారు. నార్వేలో ఆయన, ‘సోదరా! అదానీకి సహాయం చేయండి, అంబానీకి సహాయం చేయండి’ అని అంటారని” ఆయన అన్నారు.
ఆ తర్వాత, దేశం ఎదుర్కోబోయే ఆర్థిక సంక్షోభం గురించి రాహుల్ గాంధీ హెచ్చరించారు. “విచారకరమైన విషయం ఏమిటంటే, ఎవరూ ఆపలేని, మన జీవితంలో ఎన్నడూ చూడని ఒక తీవ్రమైన ఆర్థిక తుఫాను రాబోతోందని రాహుల్ అన్నారు. అయితే, ఈ సంక్షోభం వల్ల వ్యాపార దిగ్గజాలు ప్రభావితం కారని ఆయన అభిప్రాయపడ్డారు.
“నష్టపోయేది అంబానీ లేదా అదానీ కాదు. వారు నాలుగు వైపులా సురక్షితంగా తమ రాజభవనాలలోనే ఉంటారు. నష్టపోయేది భారతదేశపు రైతులు, కార్మికులు, యువత, ఉపాధిని కల్పించే చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమలే,” అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అన్నారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం
హార్ముజ్ జలసంధి సంక్షోభం పర్యవసానంగా, ప్రపంచం మొత్తం చమురు, ఎరువులు,డీజిల్ తీవ్ర కొరతను వేగంగా ఎదుర్కోవడం ప్రారంభించిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
“పెట్రోల్ ధరలు పెరగనున్నాయి, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుంది. అయినా సరే, రాహుల్ గాంధీకి ఏమాత్రం అవగాహన లేదని వారు అంటున్నారు. ఈ రోజు కూడా మేము వారికి చెబుతూనే ఉన్నాము: చర్యలు తీసుకోండి. ప్రజలను రక్షించండి, రైతులను ఆదుకోండి. కానీ వారికి పట్టదు. ఒక్కోసారి వారు నార్వేకు విమానమెక్కుతారు, ఆపై జపాన్‌కు, ఇంకోసారి వేరే చోటికి వెళ్తారు. ఎందుకు?” అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
పక్షపాతం, సంపద కేంద్రీకరణ ఆరోపణలు
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో, MGNREGA వంటి పథకాలు క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారని రాయ్‌బరేలి ఎంపీ అయిన రాహుల్ ఆరోపించారు.
“అదానీ,అంబానీ మరింత సంపన్నులవుతారు. మీ డబ్బు మొత్తం వారి జేబుల్లోకి వెళ్తుంది. భారీ భవనాలు, రాజప్రాసాదాలు నిర్మించుకుంటారు. మీ జేబుల నుండి డబ్బును దోచుకోవడానికే ఈ వ్యవస్థ మొత్తం రూపొందుతోంది. మేము మీకు అండగా గట్టిగా నిలబడతాము. మీకు ఎక్కడ కావాలన్నా, ఎప్పుడు నా అవసరం వచ్చినా, మీరు నన్ను పిలవవచ్చని లోక్‌సభలో విపక్షనేత అన్నారు.
ముఖేష్ అంబానీ కుటుంబంలో జరిగిన ఒక వివాహ వేడుకకు మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారని, కానీ తాను మాత్రం వెళ్లలేదని రాహుల్ తెలిపారు. “రాహుల్ గాంధీ వెళ్లాడా? నేను మీ పెళ్లికి హాజరు కావాలనుకుంటున్నాను. నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను, వారింటికి వెళ్లాలనుకోవడం లేదు,” అని ఆయన సభలో ఉన్నవారితో అన్నారు.
గత 10 ఏళ్లుగా, ప్రజల డబ్బును, రైతుల డబ్బును దొంగిలించి “ఇద్దరు బిలియనీర్లకు” కట్టబెట్టారని గాంధీ ఆరోపించారు; ఫలితంగా, “దేశంలోని సంపద మొత్తం ఇప్పుడు కేవలం ఇద్దరు వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది.”
“విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విద్యుత్ కేంద్రాలు,సిమెంట్ పరిశ్రమ వైపు చూడండి. దేశ రక్షణకు అత్యంత కీలకమైన పరిశ్రమలను గమనించండి. నరేంద్ర మోదీ వాటన్నింటినీ కేవలం కొద్దిమంది ఎంపిక చేసిన వ్యక్తులకు అప్పగించేశారని” రాహుల్ అన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలు, విస్తృత ఆర్థిక సమస్యలు
అనంతరం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, సమస్య వాహనాలతో కాదని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ఉందని గాంధీ పేర్కొన్నారు.
“చాలా త్వరలో, ఎరువుల కొరత ఏర్పడబోతోంది. వారు ఏ లోకంలో బతుకుతున్నారో నాకు తెలియదు గానీ, ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాలు వాడమని చెబుతున్నారు,” అని ఆయన అన్నారు. “దేశంలోని కార్మికులు, రైతులు, యువత, పేద ప్రజలు, చిన్న వ్యాపార యజమానులను రక్షించాలి. ఒక తుఫాను ముంచుకొస్తోందని మేము వారికి చెబుతున్నప్పటికీ, మీరు దానిని అపహాస్యం చేశారు,” అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.


