Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

‘మరింత స్వయంప్రతిపత్తి మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరిస్తుంది’…ఎమ్మెల్యే రామ్ ముయివా!

Share It:

ఇంఫాల్: మణిపూర్‌లో మెయిటీ, కుకీ-జో వర్గాల మధ్య 2023లో ఘర్షణలు జరిగినప్పుడు, ఉఖ్రుల్ జిల్లాలో నాగాలు తటస్థంగా ఉన్నారు. అయితే, నేడు మణిపూర్ నుండి వస్తున్న వార్తల ప్రకారం చాలా హింసాత్మక ఘటనలకు ఉఖ్రుల్, కామ్‌జాంగ్ జిల్లాలు కేంద్రంగా ఉన్నాయి. ఈనేపథ్యంలో ఉఖ్రుల్‌లో ఇటీవల జరిగిన ఆకస్మిక దాడులు, ఘర్షణలకు కారణమేమిటో, ఈ సంఘర్షణలోకి నాగాలను ఎలా లాగారో మాజీ ఐఏఎస్‌ అధికారి, నాగా పీపుల్స్ ఫ్రంట్ టికెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికయిన ముయివా వివరించారు.

మణిపూర్‌లో… కొండ జిల్లాల పట్ల కేంద్రంలోని ప్రభుత్వాలు వివక్ష చూపాయని నాగాలు ఆరోపించారు. ఈ అంశంపై ఎమ్మెల్యే ముయివా మాట్లాడుతూ… ఈ విషయాన్ని సరైన దృక్కోణంలో చూస్తే, ఈశాన్య భారతదేశంలోని అన్ని కొండ జాతులు రాష్ట్ర హోదాను పొందాయి. 1963లో నాగాలాండ్, 1972లో మేఘాలయ, 1975లో సిక్కిం, వరుసగా 1987లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలకు ఈ హోదాలు లభించాయి. అస్సాంలోని బోడోలు, కర్బీలు,దిమాసాల వంటి మైదాన ప్రాంత గిరిజనులు, త్రిపురలోని కొండ జాతులతో సహా ఇతర గిరిజనులు రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద ప్రాదేశిక మండళ్ల ప్రయోజనాన్ని పొందారు. విచారకర విషయమేమిటంటే…మణిపూర్‌లోని కొండ జాతులకు స్థానిక స్వయంప్రతిపత్తి కూడా నిరాకరించారు. మణిపూర్‌లో స్వయంప్రతిపత్తి గల జిల్లా మండలికి ఎటువంటి అధికారాలు లేవు.

ఇటీవల, ఆదాయపు పన్ను శాఖ రిటైర్డ్ చీఫ్ కమిషనర్ ఒకరు లోయ, కొండ జిల్లాల మధ్య బడ్జెట్ కేటాయింపులు,పెట్టుబడులలో ఉన్న భారీ వ్యత్యాసానికి సంబంధించి తన పరిశోధనల వివరాలను ముఖ్యమంత్రికి సమర్పించారు; వాటిలో ముఖ్యంగా, 2024-25లో లోయ ప్రాంతానికి మూలధన వ్యయం రూ. 5,215 కోట్లు కాగా, కొండ ప్రాంతాలకు ఇది కేవలం రూ. 378 కోట్లుగా ఉంది. అదే కాలంలో, లోయ ప్రాంతంలో రెవెన్యూ వ్యయం రూ. 22,632 కోట్లు కాగా, కొండ ప్రాంతాల్లో రూ. 4,041 కోట్లుగా నమోదైంది. నిష్కపటంగా చెప్పాలంటే, మణిపూర్‌లో హింసకు మూల కారణం, జనాభా అసమతుల్యత, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు, అధికారాన్ని పంచుకోవడం, సర్దుకుపోయే స్ఫూర్తి లేకపోవడమేని నాగా ఎమ్మెల్యే అయిన ముయివా కుండబద్దలు కొట్టారు.

వివిధ జాతుల ప్రజలు శాంతియుతంగా కలిసి జీవిస్తూ, అభివృద్ధి చెందుతున్న ఉదాహరణలు ఉన్నాయి. మేఘాలయలో, దానికి రాష్ట్ర హోదా వచ్చినప్పటి నుండి (1972) ఎనిమిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వారిలో నలుగురు గారో, నలుగురు ఖాసీ వర్గాల నుండి రాగా, ఉప ముఖ్యమంత్రి జైంతియా అనే ఒక చిన్న తెగకు చెందినవారు. సిక్కింలో, రాజ్యసభ ఎంపీ ఎల్లప్పుడూ భూటియాలు, లెప్చాల వంటి మైనారిటీ వర్గాల నుండి ఉంటారు. అదేవిధంగా, సింగపూర్ అధ్యక్షుడు కూడా ఎల్లప్పుడూ మలయ్ లేదా తమిళుల వంటి మైనారిటీ వర్గానికి చెందినవారే ఉంటారు. మణిపూర్ ఈ రాష్ట్రాలు, దేశాల మంచి పద్ధతులను అనుకరించడం వివేకవంతమైన చర్య అవుతుంది.

ఈ సంవత్సరం ఆరంభం నుంచే, అస్సాం రైఫిల్స్ పోస్టులు సమీపంలో ఉన్నప్పటికీ, భద్రతా దళాలు, ముఖ్యంగా అస్సాం రైఫిల్స్, కుకీ మిలిటెంట్ల దాడుల నుండి టాంగ్‌ఖుల్ నాగా పౌరులను రక్షించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే ముయివా మాట్లాడుతూ…
అస్సాం రైఫిల్స్,సైన్యం మయన్మార్ నుండి కుకీ మిలిటెంట్లను ఉఖ్రుల్ జిల్లాలోకి తరలించాయని నాకు ఫిర్యాదులు అందాయి. ఇటీవల, మే 7వ తేదీన మయన్మార్ నుండి వచ్చిన KNA-B (కుకీ నేషనల్ ఆర్మీ-బర్మా) మిలిటెంట్లు సరిహద్దు గ్రామాలైన చోరో, వాంగ్లీ, నమ్లీలపై దాడి చేసినప్పుడు, ఉదయం 4.00 నుండి 7.00 గంటల వరకు ఇళ్ళు తగలబడుతూనే ఉన్నాయి, కానీ చోరోకు కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న అలోయోలోని అస్సాం రైఫిల్స్ పోస్ట్ జోక్యం చేసుకోవడానికి కూడా పట్టించుకోలేదు.

మే 9వ తేదీన నేను మణిపూర్ హోం మంత్రితో కలిసి ఈ సరిహద్దు ప్రాంతానికి వెళ్లాను. మేము వెళ్ళిన ప్రతిచోటా, సరిహద్దు ప్రాంతాలలో అస్సాం రైఫిల్స్ స్థానంలో రాష్ట్ర బలగాలను నియమించాలని మహిళలు కన్నీళ్లతో, తీవ్రమైన కోపంతో డిమాండ్ చేశారు. సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్న, కుకీ మిలిటెంట్లు ఉపయోగించిన తూటాలు భారత ఆయుధ కర్మాగారాల నుండి వచ్చినవేని సూచించాయి; అవన్నీ సైనిక శ్రేణికి చెందినవి. బహిరంగ మార్కెట్లో లభ్యం కానివి. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఎవరు సరఫరా చేశారు? వారు ఉపయోగించిన ఆయుధాలు ఎక్కువగా భారత సైనికులు ఉపయోగించే విధంగానే LMG, SLR, బైనాక్యులర్‌లు అమర్చినవి.

మోంగ్‌కోట్ చెపు ప్రాంతంలో నిరంతరం కాపలా కాస్తున్న భారత సైన్యం కళ్ల ముందే, NH-202 పై ఉఖ్రుల్ ఎస్పీ (SP) వాహనాన్ని అక్కడి కుకీలు తీవ్రంగా ధ్వంసం చేశారు; అయినా సరే, ఆ మహిళా అధికారిని రక్షించడానికి సైన్యం ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. అలాగే, జిల్లా యంత్రాంగానికి అధిపతి అయిన ఉఖ్రుల్ డిప్యూటీ కమిషనర్ (DC)ను కూడా మయన్మార్‌కు చెందిన మోంగ్‌కోట్ చెపు గ్రామ కుకీలు భారత సైన్యం కళ్ల ముందే అడ్డుకుని వెనక్కి పంపేశారు; దాంతో ఆయన ఇంఫాల్‌కు తిరిగి వెళ్లి, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉఖ్రుల్ జిల్లా ప్రధాన కార్యాలయానికి చేరుకోవాల్సి వచ్చింది.

ఫిబ్రవరిలో లిటాన్ ప్రాంతంలో కుకీ మిలిటెంట్లతో కలిసి ఆర్మీ సిబ్బంది నాగా ప్రజల ఇళ్లను బహిరంగంగా తగలబెట్టడాన్ని కూడా నేను సోషల్ మీడియాలో చూశాను. ఈ ఆరోపణలను నేను మణిపూర్‌లోని భారత సైనిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయిందని ఆయన వాపోయారు.

చివరగా మణిపూర్‌లో శాంతికోసం మేఘాలయ లేదా సింగపూర్ వంటి మన పొరుగు దేశాల మంచి పద్ధతులను, విజయ గాథలను మనం అనుకరించాలి; మణిపూర్ ముందుకు సాగడానికి అదే ఏకైక మార్గమని నాగా పీపుల్స్ ఫ్రంట్ టికెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికయిన ముయివా తేల్చి చెప్పారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.