లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో వెట్టిచాకిరి కార్మికులపై జరుగుతున్న హింస, దోపిడీని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనను “మానవ గౌరవంపై దాడి”గా అభివర్ణించారు. బాధితులకు న్యాయం, పునరావాసం కల్పించాలని, బాధ్యులకు అత్యంత కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
మండి గ్రామంలోని ఒక పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్‌పై పోలీసులు దాడి చేసి, మైనర్లతో సహా 12 మంది వెట్టిచాకిరి కార్మికులను రక్షించిన సంగతి తెలిసిందే. కార్మికుల శరీరాలపై స్పష్టంగా కనిపించే గాయాలు, శారీరక హింస ఆనవాళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఈ ఘటన కేవలం ఒక క్రిమినల్ కేసు మాత్రమే కాదని, ఇది తీవ్రమైన ఆర్థిక దుస్థితిని ప్రతిబింబిస్తోందని అన్నారు. “ముజఫర్‌నగర్‌లోని కార్మికుల వెట్టిచాకిరి కేసు అత్యంత దిగ్భ్రాంతికరమని రాహుల్ గాంధీ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.
“వారిని వేతనాలు లేకుండా పనిచేయమని బలవంతం చేయడమే కాకుండా, కార్మికులను కుక్కలతో కరిపించారు, ఈటెలతో పొడిచారు, కొరడాలతో కొట్టారు, పశువుల మేత తినిపించారు.” ఇది మానవ గౌరవంపై దాడి — బాధితులకు పునరావాసంతో పాటు న్యాయం జరగాలి, నేరస్థులకు సాధ్యమైనంత కఠినమైన శిక్ష పడాలి,” అని కాంగ్రెస్ నేత అన్నారు.
ఈ సంఘటనను “కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ శిథిలాలు”గా అభివర్ణిస్తూ, బలహీన వర్గాల కార్మికులను ఇలాంటి దోపిడీ పరిస్థితుల్లోకి ఎందుకు నెడుతున్నారని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు.
“ఉద్యోగాలు కనుమరుగైనప్పుడు, ఆదాయాలు స్తంభించిపోయినప్పుడు, అత్యంత బలహీన వర్గాల కోసం ఉద్దేశించిన ఎంజీఎన్ఆర్ఈజీఏ, కార్మిక చట్టాల వంటి రక్షణలు బలహీనపడినప్పుడు, నిరాశ మరింత పెరిగిపోతుంది.” “వేరే మార్గాలు లేనివారు ఇలాంటి దోపిడీకి సులభంగా బలి అవుతారు,” అని ఆయన అన్నారు.
టిటావి పోలీస్ స్టేషన్ పరిధిలోని మండి గ్రామంలో ఉన్న ఫ్యాక్టరీపై సోమవారం అధికారులు జరిపిన దాడిలో కార్మికులను రక్షించారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ ప్రకారం, ఆ ఫ్యాక్టరీలో వెట్టిచాకిరి జరుగుతోందని అధికారులకు సమాచారం అందడంతో, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రాధే శ్యామ్ గౌర్ నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది.
మైనర్లతో సహా, కార్మికులను అమానవీయ పరిస్థితుల్లో ఉంచారని, వారికి వాగ్దానం చేసిన వేతనాలు చెల్లించలేదని అధికారులు తెలిపారు. నెలకు రూ.12,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చి వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చారని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కానీ, వారికి జీతం లేకుండా పని చేయమని బలవంతం చేశారని, కేవలం ఆహారం మాత్రమే అందించారని ఆరోపణలు ఉన్నాయి.
భారతీయ న్యాయ సంహిత, వెట్టిచాకిరి వ్యవస్థ (రద్దు) చట్టం, బాల కార్మిక (నిషేధం మరియు నియంత్రణ) చట్టంలోని నిబంధనల ప్రకారం… ఫ్యాక్టరీ యజమాని అంకిత్ బలియాన్, ప్రదీప్ బలియాన్, శివ త్యాగిలపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.
ప్రదీప్ బలియాన్, శివ త్యాగిలను అరెస్టు చేయగా, ఫ్యాక్టరీ యజమాని అంకిత్ బలియాన్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కొన్ని నివేదికలు అంకిత్ బలియాన్‌కు బీజేపీ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ దళ్‌తో సంబంధం ఉందని పేర్కొన్నప్పటికీ, దీనిపై ఇంకా స్వతంత్రంగా ఎలాంటి ధృవీకరణ జరగలేదు.

