Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

అస్సాంలో ఓ వ్యక్తి 15 పత్రాలు సమర్పించినా, తాను భారతీయుడినని నిరూపించుకోవడంలో విఫలం!

Share It:

గువహటి: అస్సాంలో అమీనుల్‌ హక్‌ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యుల పేర్లు ఉన్న 1951 నాటి ఎన్‌ఆర్‌సి రికార్డులతో సహా 15 పత్రాలను సమర్పించినప్పటికీ, అతడిని విదేశీయుడిగా ప్రకటించారు. ఫారిన్‌ ట్రిబ్యునల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌహతి హైకోర్టు ఇప్పుడు సమర్థించింది. రోజువారీ కూలీ అయిన ఆ వ్యక్తి సమర్పించిన సాక్ష్యాలు చట్టబద్ధంగా ఆమోదయోగ్యం కాదని, అతని పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి అవి సరిపోవని అస్సాం హైకోర్టు డివిజన్ బెంచ్ అతని రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది.

గౌహతి సమీపంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న పిటిషనర్, మౌఖిక సాక్ష్యంతో పాటు ఆ పత్రాల ఆధారాలను కూడా సమర్పించారు. అతని పత్రాలలో తన తండ్రి, తాతల పేర్లు ఉన్న 1951 జాతీయ పౌర పట్టిక (NRC) కాపీలు, 1966 నాటి పలు ఓటర్ల జాబితాలు, 2017 పాఠశాల సర్టిఫికేట్, పాన్ కార్డ్, ఓటరు ఫోటో గుర్తింపు కార్డు (EPIC) ఉన్నాయి. తన వంశాన్ని నిరూపించుకోవడానికి అతను తన తండ్రి నుండి మౌఖిక సాక్ష్యాన్ని కూడా సమర్పించారు.

జస్టిస్ కళ్యాణ్ రాయ్ సురానా, షమీమా జహాన్ లతో కూడిన డివిజన్ బెంచ్, సమర్పించిన పత్రాలలో ఏదీ కూడా పిటిషనర్‌ను అతను పేర్కొన్న వంశానికి సరిపోలేదని తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వులో, “1946 విదేశీయుల చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం, తాను విదేశీయుడిని కాదని, భారత పౌరుడినని నిరూపించుకోవాల్సిన బాధ్యతను పిటిషనర్ నిర్వర్తించడంలో విఫలమయ్యాడు” అని బెంచ్ ప్రకటించింది.

తన భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి, పిటిషనర్ విదేశీయుల ట్రిబ్యునల్‌కు 15 పత్రాలను సమర్పించారు. వీటిలో అతని తండ్రి, తాతల పేర్లు ఉన్న 1951 NRC కంప్యూటరైజ్డ్ కాపీలు, అలాగే అతని కుటుంబ సభ్యుల పేర్లు ఉన్న 1996 నుండి 2017 వరకు గల ఓటర్ల జాబితాల ధృవీకరణ కాపీలు ఉన్నాయి.

అదనంగా, పిటిషనర్ తన తాతగారు రాసిన 1973 నాటి అసలు భూమి కొనుగోలు దస్తావేజును, హష్డోబా అంచలిక్ ఉన్నత పాఠశాల నుండి పొందిన 2017 పాఠశాల ధృవీకరణ పత్రాన్ని, తన పాన్ కార్డును, మరియు తన EPIC లేదా ఓటరు కార్డును సమర్పించారు.

లిఖితపూర్వక వాంగ్మూలం ప్రకారం, పిటిషనర్ 1988లో జన్మించారు, గౌహతిలోని బోర్బోరిలో అద్దె ఇంట్లో నివసిస్తూ రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు.

నదీ కోత కారణంగా తన కుటుంబం చరాయి ఖసారా నుండి ధోబకురాకు, ఆ తర్వాత ఘుగుడోబాకు, చివరకు హష్డోబాకు వలస వెళ్లవలసి వచ్చిందని, అక్కడ తాను 1999లో హష్డోబా అంచలిక్ ఉన్నత పాఠశాలలో 5వ తరగతి చదివానని అతను పేర్కొన్నాడు. తన వాదనలకు మద్దతుగా, పిటిషనర్ ,అతని తండ్రి ఇద్దరూ సాక్షులుగా మౌఖిక వాంగ్మూలాలను అందించారు.

గౌహతి హైకోర్టు ఏ కీలక పత్రాలను తిరస్కరించింది?
తిరస్కరించిన 15 సమర్పిత పత్రాలలో అత్యంత కీలకమైనవి పిటిషనర్ 1951 NRC రికార్డులు. 1951 జనాభా లెక్కల తర్వాత అస్సాం జాతీయ పౌర పట్టికను (NRC) రూపొందించింది. 2019లో నవీకరించిన NRC ప్రచురించారు, దీని కోసం 1951 పట్టికతో సంబంధాలను ఏర్పరచుకోవాలి లేదా ప్రజలు తమ భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి 1971కి ముందు నాటి పత్రాలతో పాత డేటాను అందించాలి.

“1951 నాటి ఎన్‌ఆర్‌సి ఫోటోకాపీ/కంప్యూటర్ ద్వారా రూపొందించిన వివరాలు, ఇవి చట్ట ప్రకారం నిరూపించలేదు” అనే ట్రిబ్యునల్ నిర్ధారణను గౌహతి హైకోర్టు సమర్థించింది.

సమర్పించినది కేవలం ఇమేజ్ ఐడీలు, “DLDD వెర్షన్ 6.0 ద్వారా రూపొందించారని”, ఇవి “కంప్యూటర్ ద్వారా రూపొందించిన స్టేట్‌మెంట్” మాత్రమేనని తీర్పులో పేర్కొన్నారు. DLDD అంటే డిజిటైజ్డ్ లెగసీ డేటా డెవలప్‌మెంట్, ఇది సాధారణంగా ఎన్‌ఆర్‌సి నవీకరణ ప్రక్రియ నుండి వచ్చిన ముద్రిత లెగసీ డేటా స్లిప్‌లు లేదా డిజిటైజ్ చేయబడిన డాక్యుమెంట్ సారాంశాలపై కనిపిస్తుంది.

ఈ పత్రాన్ని ప్రస్తావిస్తూ, “భారతీయ సాక్ష్యాధినియమ్, 2023లోని సెక్షన్ 63(4)కి అనుగుణంగా సాక్ష్య చట్టం, 1872లోని సెక్షన్ 65బి ప్రకారం అవసరమైన ధృవీకరణ పత్రం లేకుండా, దానికి ఎటువంటి సాక్ష్య విలువ ఉండదు” అని కోర్టు పేర్కొంది.

అంతేకాకుండా, 1948 జనగణన చట్టంలోని సెక్షన్ 15ను ఉటంకిస్తూ, “భారతదేశంలో నివాసాన్ని నిరూపించడానికి సమర్పించిన ఎన్‌ఆర్‌సి సారాంశం సాక్ష్యంగా స్వీకరించమని కోర్టు పేర్కొంది. కాగా, 1951 ఎన్‌ఆర్‌సిని ఈ విధంగా తిరస్కరించడం పిటిషనర్ యొక్క వంశపారంపర్య వాదనను ప్రాథమికంగా దెబ్బతీసింది.

1951 ఎన్‌ఆర్‌సితో పాటు, మరో నాలుగు కీలక పత్రాలను కూడా తిరస్కరించారు. మొదటిది 2017 పాఠశాల ధృవపత్రం, దానిని జారీ చేసిన ప్రధానోపాధ్యాయుడిని సాక్షిగా హాజరుపరచడంలో పిటిషనర్ విఫలమైనందున దానిని తిరస్కరించారు. అంతేకాకుండా, అందులోని అంశాలను చట్టబద్ధంగా ధృవీకరించడానికి పాఠశాల ప్రవేశ రిజిస్టర్‌ను కూడా అతను సమర్పించడంలో విఫలమయ్యాడు.

స్పష్టమైన వంశపారంపర్య సంబంధం లేకపోవడం వల్ల 1973 నాటి భూమి కొనుగోలు దస్తావేజును కూడా తిరస్కరించారు. “ఒకవేళ ఆ భూమి ఉనికిలో ఉన్నట్లయితే, అది పిటిషనర్ తాతగారి చట్టబద్ధమైన వారసులకు ఎందుకు సంక్రమించలేదో ఎటువంటి వివరణ లేదు” అని ట్రిబ్యునల్ పేర్కొంది.

మొత్తం కేసును పరిశీలించిన తర్వాత… 15 పత్రాలు సమర్పించి, మౌఖికంగా సాక్ష్యం చెప్పినప్పటికీ, ఆ వ్యక్తి భారత పౌరుడు కాదని అస్సాం ఫారిన్‌ ట్రిబ్యునల్‌ తేల్చి చెప్పింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.