
దేవ్ కర్, సీనియర్ ఎకనమిస్ట్
భారత రాజకీయాల్లో ముస్లిం జనాభా పెరుగుదలను బూచీగా చూపించడం బీజేపీకి పరిపాటిగా మారింది. 2002 సెప్టెంబరులో, ఆ ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అప్పటి రాష్ట్ర తాత్కాలిక ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, ముస్లిం కుటుంబ పరిమాణాన్ని ఉద్దేశించి “హమ్ పాంచ్, హమారే పచ్చీస్” (మేము ఐదుగురం, మా వాళ్ళు ఇరవై ఐదుగురం) అనే పదబంధాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్య అప్పట్లో, ఆ తర్వాత కూడా విస్తృతంగా వార్తల్లో నిలిచింది. అప్పటి నుండి, ఇలాంటి అంశాలు కాలానుగుణంగా తెరపైకి వస్తూనే ఉన్నాయి.
2015లో, ఒక బీజేపీ ఎంపీ హిందూ మహిళలను ఎక్కువ మంది పిల్లలను కనమని వేడుకోగా, 2024లో ఒక కేంద్ర మంత్రి ముస్లిం జనాభా పెరుగుదలకు “బుజ్జగింపు” కారణమని ఆపాదించింది. ఇటీవలే, ఏప్రిల్ 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, రాష్ట్రంలో ముస్లిం జనాభా పెరుగుదలకు బంగ్లాదేశ్ నుండి నిరంతరంగా జరుగుతున్న సరిహద్దు చొరబాట్లే కారణమని బీజేపీ ఆపాదించింది. ఆ ఎన్నికలలో అది భారీ మెజారిటీతో గెలిచింది.
ఈ కథనం వెనుక ఉన్న వాస్తవ ఆధారం ఏమిటి? ఇది నిస్సందేహంగా రాజకీయంగా పనిచేస్తుంది, కానీ ఇది జనాభా శాస్త్రం పరంగా పనిచేస్తుందా లేదా అన్నదే ప్రశ్న. సహజ పెరుగుదల వల్ల గానీ, అక్రమ వలసల వల్ల గానీ ముస్లిం జనాభా పెరుగుదల, హిందువులు అత్యధిక మెజారిటీగా ఉన్న దేశంలోని మతపరమైన కూర్పును తలకిందులు చేయగలదా?
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951 నుండి ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్న జనాభా లెక్కలు, కేవలం వాదనల ఆధారంగా కాకుండా డేటా ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి వీలు కల్పిస్తాయి.
జనాభా లెక్కలు ఏమి లెక్కిస్తాయి
భారత జనాభా లెక్కలు పౌరులను లెక్కించవు; అది ప్రజలను లెక్కిస్తుంది. 1948 జనగణన చట్టం ప్రకారం… జాతీయత లేదా చట్టపరమైన హోదాతో సంబంధం లేకుండా, ఒక ప్రాంతంలో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నివసించిన లేదా నివసించాలనుకుంటున్న భారతదేశంలోని ప్రతి “సాధారణ నివాసి”ని లెక్కిస్తుంది. అందువల్ల, పత్రాలు లేకుండా సరిహద్దు దాటి ముర్షిదాబాద్‌లో స్థిరపడిన బంగ్లాదేశ్ జాతీయుడిని, జనాభా లెక్కల ప్రకారం, ఇతరులందరితో సమానంగా లెక్కించాలి.
ఇది, జనాభా లెక్కల సమాచారం అక్రమ వలసలను పట్టించుకోదని కొట్టిపారేసే సహజ ప్రవృత్తికి విరుద్ధంగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా, జనాభా లెక్కలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ లెక్కిస్తాయి కాబట్టి, విదేశీ వలసదారుల సామూహిక స్థిరనివాసం మొత్తం జనాభాలో, దాని మతపరమైన కూర్పులో, అన్నింటికంటే ముఖ్యంగా, వలసదారులు స్థిరపడిన ప్రాంతాల సాపేక్ష వృద్ధి రేట్లలో ఒక ముద్ర వేస్తుంది. జనాభా లెక్కలు ఎవరు పౌరుడో మనకు చెప్పలేదు, కానీ ఆ ప్రజలు అక్కడ ఉన్నారా లేదా అని చెప్పగలవు.
భారతదేశ జనాభా లెక్కల పద్ధతి దేశీయ ప్రత్యేకత కాదని గమనించండి. ఐక్యరాజ్యసమితి గణాంకాల విభాగం, 1958 నుండి, జనాభా, గృహ గణనల కోసం అంతర్జాతీయ సూత్రాలు, సిఫార్సులను జారీ చేస్తూ, కాలానుగుణంగా సవరిస్తూ వస్తోంది. ఈ మార్గదర్శకాలు జాతీయ జన గణన అంతర్జాతీయంగా పోల్చదగినవిగా ఉండేలా రూపొందించారు. తద్వారా దేశస్థాయి గణనలను స్థిరంగా ప్రాంతీయ, ప్రపంచ మొత్తాలుగా ఏకీకృతం చేయవచ్చు.
భారతదేశం 1951 అనంతర జనాభా గణన, దాని “సాధారణ నివాసం” అనే గణన భావనతో సహా, స్థూలంగా ఈ చట్రానికి అనుగుణంగా నిర్వహించారు. భారత జనాభా గణన అధికారులు, ఈ ప్రమాణాన్ని కాలానుగుణంగా సవరించే ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందాలలో నేరుగా పాల్గొన్నారు. అందువల్ల, ప్రపంచవ్యాప్తంగా జనాభా గణాంకాలను సంకలనం చేయడానికి ఉపయోగించే పద్ధతిని భారత ప్రభుత్వం ద్వారా రూపొందింది.
1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, భారతదేశ జనాభా సుమారుగా 34 కోట్లు (340 మిలియన్లు)గా ఉండేది. ప్రజారోగ్యం, పోషణ, వైద్య రంగాలలో వచ్చిన మెరుగుదల… ఆ తర్వాత వేగవంతమైన వృద్ధికి దారితీశాయి: 1951 జనాభా లెక్కల ప్రకారం 361 మిలియన్ల నుండి 2011 జనాభా లెక్కల నాటికి 1.21 బిలియన్లకు పెరిగింది.
1950 నుండి 2023 మధ్య, కరువు నివారణ, బాల్య టీకాలు, గ్రామీణ ఆరోగ్య సేవలలో నిరంతర పెట్టుబడుల కారణంగా శిశు మరణాలు ప్రతి వెయ్యి జననాలకు సుమారు 176 నుండి 25 మరణాలకు తగ్గాయి. ఆయుర్దాయం పురుషులకు సుమారు 72 సంవత్సరాలకు, మహిళలకు 74 సంవత్సరాలకు పెరిగింది. 2026 మధ్య నాటికి, ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం భారతదేశ జనాభాను సుమారు 1.48 బిలియన్లుగా పేర్కొంది – ఇది చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలిచింది.1951 – 2011 మధ్య కాలంలో, హిందూ జనాభా 303.7 మిలియన్ల నుండి 966.3 మిలియన్లకు పెరిగింది (దీని వార్షిక వృద్ధి రేటు సుమారు 1.9%). అదే సమయంలో, ముస్లిం జనాభా 35.4 మిలియన్ల నుండి 172.3 మిలియన్లకు పెరిగింది (వార్షిక వృద్ధి రేటు సుమారు 2.7%). దీని ఫలితంగా, మొత్తం జనాభాలో హిందువుల వాటా 1951లో 84.1% నుండి 2011 నాటికి 79.8%కి తగ్గగా, ముస్లింల వాటా 9.8% నుండి 14.2%కి పెరిగింది.
పశ్చిమ బెంగాల్‌లో ఈ మార్పు కాస్త ఎక్కువగా కనిపించింది: 1951లో రాష్ట్ర జనాభాలో 19.5%గా ఉన్న ముస్లింల సంఖ్య 2011 నాటికి 27.0%కి పెరిగింది, అదే సమయంలో హిందువుల వాటా 78.9% నుండి 70.5%కి తగ్గింది. అయితే, చీకట్లో కనిపించే బెల్టును చూసి పాము అని పొరబడినట్లుగానే, ఈ గణాంకాలు రేకెత్తించే భయాలు అనేక కారణాల వల్ల నిరాధారమైనవి.
పశ్చిమ బెంగాల్ వెలుపల ముస్లిం జనాభా వృద్ధి, రాష్ట్రంలోని వృద్ధి కంటే స్వల్పంగా ముందుంది, అంతేగాని వెనుకబడి లేదు. సంక్షిప్తంగా చెప్పాలంటే, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర జనాభా సమతుల్యతను మార్చడానికి, ఇక భారతదేశ జనాభా సమతుల్యతను మార్చడానికి అవసరమైనంత నిరంతర భారీ అక్రమ వలసలు ఆ రాష్ట్రంలోనే జరుగుతున్నాయనడానికి వృద్ధి రేటు గణాంకాలలో మాకు ఎటువంటి ఆధారాలు కనిపించలేదు.
దీనికి అనుగుణంగా, భారతదేశ మొత్తం ముస్లిం జనాభాలో పశ్చిమ బెంగాల్ వాటా ఆరు దశాబ్దాలుగా దాదాపుగా స్థిరంగా ఉంది: 1951లో 14.4% మరియు 2011లో 14.3%. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వరదకు ప్రధాన నిలయంగా భావించబడుతున్న ఈ సరిహద్దు రాష్ట్రం, అరవై సంవత్సరాల క్రితం భారతదేశంలోని ముస్లింలలో ఎంత వాటాను కలిగి ఉందో, ఇప్పుడు కూడా సరిగ్గా అంతే వాటాను కలిగి ఉంది. అందువల్ల, జనాభా లెక్కల గణాంకాల ప్రకారం చూస్తే…బీజేపీ చెబుతున్నట్లుగా చొరబాట్ల అంశం అస్సలు నిజం కాదు.
జనాభా గణన సమాచారం ఒకే ఒక అర్థాన్ని సూచిస్తుంది. గత ఆరు దశాబ్దాలుగా భారతదేశ మతపరమైన కూర్పులో స్వల్ప మార్పు వచ్చింది. దీనికి కారణం, ఇప్పుడు కనుమరుగవుతున్న సంతానోత్పత్తి రేటులోని వ్యత్యాసమే. ఆరు దశాబ్దాలుగా ముస్లిం జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, మెజారిటీ జనాభా ఇప్పటికీ మైనారిటీ జనాభా కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉంది – ఇది 1951లో ఎనిమిది రెట్లకు పైగా ఉండేది.
పౌరసత్వంతో సంబంధం లేకుండా ప్రతి నివాసిని లెక్కించే ఒక జనాభా లెక్కల ప్రకారం, 1951లో భారతదేశంలోని ముస్లింలలో ఏడవ వంతు వాటా ఎంత ఉండేదో, 2011లో కూడా పశ్చిమ బెంగాల్‌లో అంతే ఉన్నట్లు తేలింది. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ చొరబాటు కథనం ఒక రాజకీయ సాధనం మాత్రమే, జనాభా గణాంకాలకు సంబంధించిన వాస్తవం కాదు. అయితే ఇదే అంశాన్ని బూచిగా చూపి బీజేపీ పశ్చిమబెంగాల్‌లో విజయం సాధించింది. ఇక రాబోయే 2027 జనాభా లెక్కలు దీనికి ఒక కొత్త పరీక్షను అందిస్తాయి. కానీ ఆరు దశాబ్దాల గణాంకాలలో ఏదీ కూడా ఈ భయాందోళనను అది సమర్థిస్తుందని సూచించడం లేదు.
(ద వైర్ సౌజన్యంతో)
