భోపాల్: వేరే దేశంలోనైనా, లేదా మన దేశంలోనే వేరొక కాలంలోనైనా, నాయకులు సిగ్గుతో తలదించుకుని ఉండేవారు. మధ్యప్రదేశ్‌లోని ‘కెన్’ నదికి ఉపనది అయిన ‘బరానా’ నదీ తీరంలో, పేద గ్రామస్తులు తమ చావును తామే ప్రదర్శించుకోవడం చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. మహిళలు చెక్కలతో చేసిన చితిపై పడుకుని ఉన్నారు. పురుషులు, మహిళలు బూడిద పూసుకున్న ముఖాలతో, చెక్క శిలువలకు చేతులు కట్టుకుని ఉన్నారు. యువకులు మెడలో ఉరితాళ్లతో నీటిలో నిలబడి, ‘న్యాయ్ దో యా మృత్యు’ (న్యాయం చేయండి లేదా మరణం ఇవ్వండి) అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని ఉన్నారు.
రూ. 45,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ‘కెన్-బెత్వా నదీ అనుసంధాన ప్రాజెక్ట్’లో భాగంగా నిర్మిస్తున్న ‘దౌధన్ ఆనకట్ట’ వల్ల తమ ఇళ్లను కోల్పోయిన బాధను తెలియజేయడానికే వారు ఇలా నిరసన చేస్తున్నారు. బీహార్, కర్ణాటక నుండి కేరళ, సిక్కిం వరకు ప్రతిపాదించిన 37 నదీ అనుసంధాన (ILR) ప్రాజెక్టులలో ఇది మొదటిది.
నిరసనకారులలో ఒకరైన 23 ఏళ్ల రాజ్ కుమార్ ఈ దుస్థితిపై మాట్లాడుతూ…“మేము మా భూమిని, జీవనోపాధిని, అడవులను మాత్రమే కాదు, మా సాంస్కృతిక గుర్తింపును కూడా కోల్పోయాము. మా సొంత దేశంలోనే మేము నిరాశ్రయులమయ్యాం అని వాపోయారు.”
బుందేల్‌ఖండ్‌కు చెందిన సామాజిక కార్యకర్త, ‘సోనమ్ వాంగ్‌చుక్’గా పేరుగాంచిన అమిత్ భట్నాగర్ గత నాలుగేళ్లుగా ఇక్కడ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
జూలై 5 నుండి ఆయన కుపి గ్రామం దగ్గర నిరాహార దీక్ష చేపట్టారు. జూలై 19న తెల్లవారుజామున 5 గంటల సమయంలో, పోలీసులు ఆందోళనను అడ్డుకోవడానికి రంగంలోకి దిగారు. భట్నాగర్ను మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు; అక్కడ ఆరోగ్యం క్షీణించడం, రక్తపోటు (BP) పడిపోవడంతో ఆయన ఐసీయూ (ICU)లో చికిత్స పొందారు.
జూలై 23న, బాధితులైన ప్రతి గ్రామస్తుడికి న్యాయం జరిగేలా చూసేందుకు ‘న్యాయ్ ఉపవాస్’ (న్యాయం కోసం ఉపవాసం) కొనసాగిస్తూనే, తన నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు (18 రోజుల తర్వాత) భట్నాగర్ ఒక వీడియో ప్రకటనలో తెలిపారు.
సుమారు 400 మంది పౌరులు, నటులు, సామాజిక కార్యకర్తలు ఆయనను దీక్ష విరమించమని కోరారు, కానీ ఆయన తల్లి చేసిన అభ్యర్థన ఆయనను ఒప్పించింది. అనారోగ్యం కారణంగా, తిరిగి ప్రయాణానికి సిద్ధమయ్యేంత వరకు ఆయన తన సొంత ఊరైన బిజావర్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. ఉద్యమం కొనసాగుతోందని, ఇది సుదీర్ఘ పోరాటం కానుందని ఆయన అన్నారు.కాగా, గత మూడు నెలల్లో ఆయనపై 42 కేసులు నమోదయ్యాయి. ఈ ఉద్యమ సమయంలో ఆయన పలుమార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
“హక్కులు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడటమే నేరమైతే, అమిత్ భట్నాగర్ మాత్రమే కాదు, ప్రతి యువకుడు, ప్రభావితమైన ప్రతి వ్యక్తి ఈ ‘నేరాలను’ పదే పదే చేస్తూనే ఉంటారని అమిత్ భట్నాగర్ సహచరి దివ్య అహిర్వార్ అన్నారు.”
ప్రభావిత వర్గాల సమ్మతిని కోరేందుకు ఒక్క గ్రామ సభ సమావేశాన్ని కూడా నిర్వహించకుండా ప్రభుత్వం వ్యవహరించిన తీరును భట్నాగర్ ప్రశ్నించారు. “గిరిజన ప్రాంతాలు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయి, ఇక్కడ గిరిజన భూమి బదిలీకి గ్రామ సభ సమ్మతి తప్పనిసరి. ఎటువంటి సమ్మతి కోరలేదు; పైగా, సమ్మతి సంతకాలను ఫోర్జరీ చేశారు. అంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే, పర్యావరణ ప్రభావ అంచనా (EIA) వివరాలు లేదా 45 లక్షల చెట్లను నరికివేయడం వల్ల కలిగే పరిణామాల గురించి ఎటువంటి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. బుందేల్‌ఖండ్‌లోని బందా, ఖజురాహో నగరాలు భారతదేశంలోని అత్యంత వేడి నగరాల జాబితాలో ఉన్నాయి. పన్నా టైగర్ రిజర్వ్ బుందేల్‌ఖండ్‌కు ఊపిరితిత్తుల వంటిది.”
“అడవులన్నీ నీట మునిగితే ఏమవుతుంది? ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ఇలా జరిగినప్పుడు మన ప్రాంతంలో వర్షపాతం మరో 20 శాతం తగ్గుతుందని శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించారు” అని భట్నాగర్ అన్నారు.
కెన్, బెత్వా నదుల జల ప్రవాహానికి సంబంధించిన వివరాలు లేకపోవడం పట్ల కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “ఈ ప్రాజెక్ట్‌తో సంబంధం ఉన్న ఇంజనీర్లు, చివరి జలవనరుల అధ్యయనం (hydrological study) 2001లో జరిగిందని అంగీకరిస్తున్నారు. అప్పటి నుండి క్షేత్రస్థాయి పరిస్థితులు గణనీయంగా మారిపోయాయి. కెన్ నది, తనకంటే రెట్టింపు పరిమాణం కలిగిన బెత్వా నది కంటే తక్కువ ఎత్తులో (దిగువన) ఉంది.” గత కొన్నేళ్లుగా వేసవిలో కెన్ పూర్తిగా ఎండిపోతోంది. ఇంత భారీ ప్రాజెక్టుకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? అని ఇళ్లు కోల్పోయిన గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.
“మమ్మల్ని బలవంతంగా ఖాళీ చేయించే ముందు ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు జరపలేదు?” అని బరానా నదిలో వరుసగా ఐదు రోజుల పాటు నిరసన తెలిపిన వారిలో ఒకరైన 45 ఏళ్ల పురుషోత్తం ప్రశ్నించారు. “మాకు అడవితో ఒక సహజీవన సంబంధం ఉంది. మమ్మల్ని బయటకు నెట్టేస్తే మా గతి ఏమవుతుంది? తలదాచుకోవడానికి చోటు కూడా లేకుండా వలస కూలీలుగా మారాల్సి వస్తుంది.”
జిల్లా యంత్రాంగం తన అత్యంత లోపభూయిష్టమైన పునరావాస ప్యాకేజీని సవరిస్తామని హామీ ఇవ్వడంతో, బుందేల్‌ఖండ్‌లోని గోండ్, కోల్ వర్గాలకు చెందిన గిరిజనులు ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో ఇదే తరహా నిరసనను నిలిపివేశారు. మరోవంక సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ, 2019లోనే ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ప్రతికూల నివేదిక ఇచ్చి, బుందేల్‌ఖండ్‌లో నీటి కొరతను ఎదుర్కోవడానికి ప్రభుత్వం మరింత తక్కువ ఖర్చుతో కూడిన మార్గాలను అన్వేషించాలని సూచించింది. కెన్-బెట్వా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉన్న కేసు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. అలాంటప్పుడు దీనిని ముందుకు తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా మధ్యప్రదేశ్‌లో కెన్-బెట్వా నిరసనపై పోలీసుల అణచివేత బుందేల్‌ఖండ్ ప్రజలను దిక్కులేనివారిగా, నిస్సహాయులుగా వదిలేసింది.

