లక్నో: జౌహర్ విశ్వవిద్యాలయానికి చెందిన రాంపూర్ క్యాంపస్‌లోని 38 భవనాల కూల్చివేతపై, కేసు తుది విచారణ పూర్తయ్యే వరకు మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ కోర్టు స్టే విధించింది. ఉపశమనం కోరుతూ విశ్వవిద్యాలయం తరఫు న్యాయవాది దరఖాస్తు దాఖలు చేసిన తర్వాత ఈ స్టే మంజూరు చేసినట్లు డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు
“విశ్వవిద్యాలయం దరఖాస్తును అంగీకరించాం. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఏ కట్టడాన్నీ కూల్చివేయకుండా నిలిపివేసాం. తుది విచారణ జరిగే వరకు ఈ మధ్యంతర రక్షణ అమలులో ఉంటుందని” డివిజనల్ కమిషనర్ అన్నారు. అన్ని పక్షాల వాదనలు విని, సంబంధిత రికార్డులను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
12వ రోజుకు చేరుకున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఈ ఉపశమనం లభించింది. విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు అజం ఖాన్ భార్య, మాజీ రాజ్యసభ ఎంపీ అయిన తజీన్ ఫాతిమా ఈ పరిణామాన్ని స్వాగతించారు. అవసరమైతే తమ న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని ఆమె పునరుద్ఘాటించారు.
“తీర్పు మాకు అనుకూలంగా రాకపోతే, మేము హైకోర్టును, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము. చివరి వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాము,” అని ఆమె అన్నారు. మైనారిటీ విద్యాసంస్థలకు రాజ్యాంగ రక్షణ ఉంటుందని వాదిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటుందన్న సూచనలను కూడా ఫాతిమా తోసిపుచ్చారు.
క్యాంపస్‌ను కూల్చివేసినా తమ చదువును కొనసాగించాలని విద్యార్థులు నిశ్చయించుకున్నారని ఆమె అన్నారు. “వారు నేలపై, చెట్ల కింద కూర్చుని చదువుకుంటూనే ఉంటామని నాతో చెప్పారని” ఆమె తెలిపారు.
ఇదిలా ఉండగా, అధికారులు విశ్వవిద్యాలయాన్ని కూల్చివేయడానికి ప్రయత్నిస్తే భారీ ఆందోళన చేపడతామని అజం ఖాన్ సన్నిహితుడు అసిమ్ రాజా హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్ పట్టణ ప్రణాళిక, అభివృద్ధి చట్టం, 1973 ప్రకారం ఆమోదిత భవన ప్రణాళికలు లేకుండా నిర్మించారని ఆరోపిస్తూ, విశ్వవిద్యాలయంలోని 40 భవనాలలో 38 భవనాలను 15 రోజుల్లోగా కూల్చివేయాలని రాంపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ (RDA) జూలై 15న ఉత్తర్వు జారీ చేయడంతో ఈ వివాదం మొదలైంది.
ఈ ప్రతిపాదిత కూల్చివేతకు విద్యార్థులు, సమాజ్‌వాదీ పార్టీ, అనేక సామాజిక సంస్థల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వెల్లువెత్తాయి.
