హైదరాబాద్: స్టైఫండ్ పెంపు, అల్లోపతి వైద్యులతో సమానమైన వేతనం, ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం డిమాండ్ చేస్తూ, తెలంగాణ వ్యాప్తంగా సుమారు 6,000 మంది AYUSH (ఆయుర్వేద, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ,హోమియోపతి) హౌస్ సర్జన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు నిన్నటినుండి నిరవధిక సమ్మెను ప్రారంభించారు.
ఎర్రగడ్డలోని డాక్టర్ BRKR ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బేగంపేటలోని కొణిజేటి రోశయ్య ప్రభుత్వ ప్రకృతి వైద్య ఆసుపత్రి, చార్మినార్లోని ప్రభుత్వ నిజామియా యునాని ఆసుపత్రి వద్ద నిరసనలు జరిగాయి. తమ సమస్యల పరిష్కారం కోసం గత రెండేళ్లలో ప్రభుత్వానికి 60కి పైగా వినతిపత్రాలు సమర్పించినట్లు చార్మినార్ వద్ద నిరసన తెలుపుతున్న ఒక విద్యార్థి తెలిపారు. జీవన వ్యయాల భారం వల్ల విద్యార్థులు తమ విధులపై దృష్టి పెట్టలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు.
2016 వరకు ప్రతి రెండేళ్లకు ఒకసారి స్టైఫండ్ 15 శాతం పెంచేవారని, ఆ విధానాన్ని తిరిగి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. “2016 తర్వాత మా స్టైఫండ్ పెంపు ఎందుకు ఆగిపోయింది? ప్రభుత్వం తదనుగుణంగా పెంచి, బకాయిలన్నింటినీ చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము.”
“ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మాకు చెల్లించడానికి నిధులు ఉండేవి, కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆంధ్రకు చెందిన వైద్యులకు రూ. 60,000 స్టైపెండ్ లభిస్తుండగా, మాకు మాత్రం రూ. 30,000 మాత్రమే లభిస్తోంది,” అని ఆయన అన్నారు.
