హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా హైదరాబాద్‌లోని చెరువుల అభివృద్ధి, పునరుజ్జీవనానికి మద్దతు ఇవ్వాలని…పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి (MA&UD) శాఖ, కార్పొరేట్ సంస్థలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు MA&UD, క్రీడల శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన CSR రౌండ్ టేబుల్ 2.0లో ప్రభుత్వం పిలుపునిచ్చింది.
ఈ సమావేశంలో, నగర పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, భవిష్యత్ నీటి అవసరాలను తీర్చడంలో, పట్టణ వరదల ప్రభావాన్ని తగ్గించడంలో చెరువుల ప్రాముఖ్యతను అధికారులు ప్రముఖంగా ప్రస్తావించారు. CSR కార్యక్రమాల ద్వారా, ముఖ్యంగా చిన్న చెరువుల అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం పెరగడం వల్ల పర్యావరణ పరిరక్షణ బలోపేతం కావడమే కాకుండా, సుస్థిరమైన, పటిష్టమైన హైదరాబాద్ నిర్మాణానికి కూడా ఇది గణనీయంగా దోహదపడుతుందని HYDRAA కమిషనర్ అన్నారు.
నగర పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ నీటి అవసరాలను తీర్చడంలో, వరదల నియంత్రణలో చెరువులు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు వివరించారు. చెరువులను సంరక్షించడం ద్వారా హైదరాబాద్‌ను మరింత సుస్థిర నగరంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి MA&UD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తి పరిరక్షణ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్, పారిశ్రామిక ప్రతినిధులు హాజరయ్యారు.

