గాజా: సమాచార స్వేచ్ఛపై దృష్టి సారించే అంతర్జాతీయ సంస్థ అయిన రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF), ఏకపక్షంగా నిర్బంధించిన పాలస్తీనా జర్నలిస్టులందరినీ ఇజ్రాయెల్ విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని తన ఇంట్లో ఏఎఫ్‌పీ, అల్ జజీరా కోసం పనిచేసిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మహమ్మద్ అవద్‌ను ఇటీవల అరెస్టు చేసిన ఘటనపై దృష్టి సారిస్తూ…“ఇజ్రాయెల్ సైన్యం అతనిపై తీవ్రవాద ఆరోపణలు చేసింది. ఎటువంటి ఆధారాలు లేకుండా పాలస్తీనా జర్నలిస్టులపై తరచుగా మోపే ఆరోపణ ఇది అని ఆ సంస్థ పేర్కొంది.”
“ఇది మరో అన్యాయమైన నిర్బంధం కావచ్చని ఆర్ఎస్ఎఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సైన్యం దీనికి సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది,” అని అది నొక్కి చెప్పింది.
అవద్‌ను బుధవారం రమల్లా సమీపంలోని అతని ఇంటి నుండి తీసుకెళ్లి ఒక సైనిక వాహనంలో ఉంచారని అతని కుటుంబం ప్రకటించింది.
అవద్ “తీవ్రవాద దాడులను ప్రోత్సహిస్తున్నాడనే అనుమానంతో” ఉన్నాడని, అతను “హమాస్ తరపున పనిచేస్తున్నాడని” ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, దీనికి ఎలాంటి ఆధారాలు లేదా మరిన్ని వివరాలు అందించలేదు.
అంతేకాదు వాస్తవాలు బయటికి రాకుండా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అంతర్జాతీయ సమాజం ఖండించాలని హక్కుల సంఘాలు కోరాయి.
ప్రస్తుతం ఇజ్రాయెల్ జైళ్లలో సుమారు 40 మంది పాలస్తీనా జర్నలిస్టులు నిర్బంధంలో ఉన్నారు. జైళ్లలో వీరిని తీవ్రమైన హింస, వైద్య నిర్లక్ష్యం, ఆకలి వంటి కఠిన పరిస్థితులకు గురిచేస్తున్నట్లు హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా, 2023 అక్టోబర్ 7 నుండి ఇప్పటివరకు 250 మందికి పైగా జర్నలిస్టులను ఇజ్రాయెల్ బలగాలు నిర్బంధించాయి.
