Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఇరాన్‌లో వివాహ వేడుకపై అమెరికా దాడి… నలుగురి మృతి, పలువురికి గాయాలు!

Share It:

టెహ్రాన్‌: ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ ఇరాన్‌లో ఒక వివాహ వేడుకపై అమెరికా జరిపిన దాడిలో, ఒక చిన్నారితో సహా నలుగురు మృతి చెందారని, 50 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ రెడ్ క్రెసెంట్ తెలిపింది.

దాడి అనంతరం ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలను ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్, జాస్క్, చబహార్ సహా పలు ప్రాంతాల్లో, జిరోఫ్ట్ విమానాశ్రయంలోనూ దాడులు జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది.

అంతకుముందు, దక్షిణ హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ అహ్మద్ నఫీసీ ప్రభుత్వ టెలివిజన్‌తో మాట్లాడుతూ: “ఇద్దరు అమరులయ్యారని, మరికొందరు గాయపడ్డారని పేర్కొన్నారు.”

ఇదిలా ఉండగా, హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపైనా, అమెరికన్ సైనికులపైనా ఇరాన్ దాడుల నేపథ్యంలో, వారి లక్ష్యాలపై తాము దాడులు జరుపుతున్నామని అమెరికా ప్రకటించింది. ఇరాన్‌పై మరిన్ని దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, కొత్త ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సాంట్ తెలిపారు.

మరోవంక హర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. ‘ట్రూత్ సోషల్’ వేదికగా చేసిన పోస్టులో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఒప్పందంపై సంతకం చేసినా, చేయకపోయినా తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

అమెరికా తాజా దాడులకు ప్రతిస్పందనగా జోర్డాన్, బహ్రెయిన్, ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసినట్లు సమాచారం. సోమవారం హోర్ముజ్ జలసంధి నుంచి బయలుదేరుతున్న రెండు చమురు ట్యాంకర్లపై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది.

హర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన వ్యూహాత్మక జలమార్గాల్లో ఒకటి. ప్రపంచ చమురు రవాణాలో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. జలమార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం ప్రపంచ చమురు ధర బ్యారెల్‌కు 4 డాలర్లకు పైగా పెరిగింది

కాగా, ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్, అమెరికాతో యుద్ధంలో ఉంది. ఆ దాడుల్లో ఇస్లామిక్ రిపబ్లిక్ సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీతో పాటు ఉన్నత సైనిక అధికారులు మరణించారు.

ప్రారంభంలో జరిగిన తీవ్రమైన బాంబు దాడుల పరంపర దాదాపు 40 రోజుల పాటు కొనసాగింది. కానీ, ప్రధానంగా హర్ముజ్ చుట్టూ అడపాదడపా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో తుది శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు మసకబారాయి.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.