తల్లిన్: ఉక్రెయిన్‌కు సైనిక సాయం అందించేందుకు ఉద్దేశించిన 70 మిలియన్ యూరోల (రూ. 768.50 కోట్లకు పైగా) ఆయుధ ఒప్పందంలో కుంభకోణం బయటపడటంతో ఎస్టోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్ రాజీనామా చేశారు. 2022 నుండి రక్షణ మంత్రిగా పనిచేస్తున్న పెవ్కుర్, ఆ దేశ జాతీయ ఆడిట్ కార్యాలయం వెల్లడించిన పలు కీలకమైన విషయాల నేపథ్యంలో, ఈ రక్షణ ఒప్పందానికి తానే బాధ్యత వహిస్తు తన రాజీనామాను ప్రకటించారు.
“ఎస్తోనియా భద్రత అనేది ఒక్క వ్యక్తి చేసే పని కాదు. అది మనందరి ఉమ్మడి బాధ్యత. అందుకే ఈ రోజు నేను మొత్తం రక్షణ రంగానికి రాజకీయ బాధ్యత వహించి, సరైన సమయంలో రక్షణ మంత్రి బాధ్యతలను ప్రధానమంత్రికి అప్పగించాలి,” అని పెవ్కుర్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే… రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కీవ్‌కు మద్దతుగా నిలిచిన యూరోపియన్ దేశమైన ఎస్తోనియా.. భారతీయ కంపెనీ నుంచి ఆయుధాలు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. మొత్తం 70 మిలియన్ యూరోలు అంటే మన కరెన్సీలో దాదాపు 770 కోట్ల రూపాయలు విలువైన ఆయుధాలను ఈ సంస్థ సరఫరా చేయడానికి అంగీకరించింది. తీవ్రమైన ఆయుధ కొరతను ఎదుర్కొంటున్న సమయంలో ఉక్రెయిన్‌కు ఫిరంగి గుళ్లను సమకూర్చడమే ఈ ఒప్పందం ఉద్దేశ్యం. అయితే, ఇందులో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఆ దేశ రక్షణ మంత్రి పదవికి ఎసరు తెచ్చి పెట్టింది.
ఎస్టోనియా ప్రభుత్వ ప్రసార సంస్థ ఈఆర్ఆర్ మరియు ఈస్టి ఎక్స్‌ప్రెస్, పోస్టిమీస్ నివేదికల ప్రకారం, ఈ కొనుగోలు కోసం ఎస్టోనియా యూరోపియన్ యూనియన్ యూరోపియన్ పీస్ ఫెసిలిటీ నుండి నిధులను ఉపయోగించుకుంది, ఆ కంపెనీకి ముందుగానే మిలియన్ల యూరోలను చెల్లించింది. దీంతో మొత్తం ముందస్తు చెల్లింపులు చివరికి సుమారు €70 మిలియన్లకు చేరుకున్నాయి.
ఎస్టోనియా 2024 ఆగస్టులో మొదటి ఒప్పందంపై సంతకం చేసి, సుమారు €15 మిలియన్లను ముందస్తుగా చెల్లించింది. అక్టోబర్‌లో మరో ఒప్పందంపై సంతకం చేసి, €10 మిలియన్లకు పైగా అదనపు ముందస్తు చెల్లింపు చేసింది. సంవత్సరం చివరి నాటికి, మరికొన్ని ఒప్పందాలతో ముందస్తుగా చెల్లించిన మొత్తం సుమారు €70 మిలియన్లకు చేరింది. మందుగుండు సామగ్రి మొదట్లో కొన్ని నెలల్లో ఉక్రెయిన్‌కు చేరుకుంటుందని భావించారు, కానీ ఉత్పత్తిలో సమస్యలు తలెత్తాయనే వార్తల కారణంగా సరఫరాలు పదేపదే ఆలస్యమయ్యాయి. చివరకు 2025లో మందుగుండు సామగ్రి అందినప్పుడు, అది నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోయిందని ఈస్టి ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
ఒప్పందం రద్దును సవాల్ చేసిన సంస్థ
ఎస్తోనియా రక్షణ కొనుగోళ్ల కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న భారతీయ కంపెనీ డేటాసెల్, తమ ఒప్పందాలు రద్దు కావడానికి ముందే ప్రభుత్వానికి €59 మిలియన్ల విలువైన ఆయుధాలను సరఫరా చేసినట్లు ఈస్టి ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ఈ కంపెనీ ఎస్టోనియాపై దావా వేయగా, ఈ కొనుగోళ్ల వివాదం అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి చేరింది.
“ఈ సరఫరా ఒప్పందాల విషయంలో నష్టపోయిన పక్షం డేటాసెల్,” అని ఆ కంపెనీ తన న్యాయవాది ద్వారా ఈస్టి ఎక్స్‌ప్రెస్‌కు తెలిపింది. “ఎస్టోనియన్ సెంటర్ ఫర్ డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ చర్యలు, ముఖ్యంగా ఒప్పందాలను అసాధారణంగా రద్దు చేయడానికి చెప్పిన కారణాలు పరస్పర విరుద్ధంగా, అహేతుకంగా ఉన్నాయి.”
ప్రభుత్వ సెంటర్ ఫర్ డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ (RKIK) నుండి €59 మిలియన్ల ముందస్తు చెల్లింపులు అందుకున్నట్లు డేటాసెల్ ధృవీకరించింది. RKIK ఈ కొనుగోలు విలువను €70 మిలియన్లుగా అంచనా వేయడంతో, మిగిలిన నిధులు ఎక్కడ ఉన్నాయని ఈస్టి ఎక్స్‌ప్రెస్ ప్రశ్నించింది. అయితే, ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో తమకు ఇంకా తెలియదని ఆ పత్రిక పేర్కొంది.
“డేటాసెల్ గణనీయమైన పరిమాణంలో వస్తువులను సరఫరా చేసి, మొత్తం €58 మిలియన్ల విలువైన ఇన్వాయిస్లను సమర్పించింది,” అని ఆ సంస్థ తెలిపింది. ఆలస్యం జరిగినట్లు అంగీకరించినప్పటికీ, ఆయుధాలు తగినంత నాణ్యతతో లేవన్న ఆరోపణలను అది ఖండించింది. RKIK తన నిబంధనలను నెరవేరిస్తే మిగిలిన కాంట్రాక్ట్‌ను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది.
కాగా, డేటాసెల్తో కాంట్రాక్టులను రద్దు చేసిన ప్రభుత్వ సెంటర్ ఫర్ డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ (RKIK), చెల్లించిన ముందస్తు మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. రద్దు చేసిన 70 మిలియన్ డాలర్ల నిధులను రికవరికీ యూరోపియన్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్‌ను ఎస్టోనియా ఆశ్రయించింది.
సుమారు 12 లక్షల జనాభా కలిగిన చిన్న దేశమైన ఎస్తోనియా… EU, నాటో రెండింటిలోనూ సభ్యత్వం కలిగి ఉంది. ఉక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా ఉంది.
