హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలపై క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించేందుకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం రెండు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మొదటి విడత కార్యక్రమం సెప్టెంబర్ 5, 6 తేదీల్లోనూ, రెండో విడత కార్యక్రమం సెప్టెంబర్ 12, 13 తేదీల్లోనూ పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతుంది.
దరఖాస్తుదారులు లేదా ఓటర్లు పోలింగ్ కేంద్రాల పరిధిలోని నిర్దేశిత ప్రాంతాలను సందర్శించి ముసాయిదా జాబితాను పరిశీలించవచ్చు లేదా ఫారం-6, 7, 8 ద్వారా తమ క్లెయిమ్లు, అభ్యంతరాలను సమర్పించవచ్చు. ఎన్నికల నమోదు అధికారుల (ERO) కార్యాలయాల్లో క్లెయిమ్లు, అభ్యంతరాలను సమర్పించే సాధారణ విధానం కూడా యథాతథంగా కొనసాగుతుంది.
ఈ ప్రత్యేక కార్యక్రమ రోజుల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన నిర్దేశిత ప్రాంతాలలో బూత్ స్థాయి అధికారులు (BLO,s) మరియు బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) అందుబాటులో ఉంటారు.
“BLOలు, BLAలతో కలిసి ముసాయిదా జాబితాను పరిశీలించి, ఏవైనా సవరణలు ఉంటే గుర్తిస్తారు మరియు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు” అని ప్రధాన ఎన్నికల అధికారి (CEO) తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాలపై తమ క్లెయిమ్లు మరియు అభ్యంతరాలను సమర్పించుకోవడానికి ఈ ప్రత్యేక కార్యక్రమ రోజులను సద్వినియోగం చేసుకోవాలని ఓటర్లకు సూచించారు.
