Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఢిల్లీలోని పీజీ హాస్టళ్ల సౌకర్యాలపై విద్యార్థుల ఆవేదన!

Share It:

న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ/యూనివర్సిటీ హాస్టళ్లలో సీట్ల కొరత కారణంగా వేలాది మంది విద్యార్థులు అపరిశుభ్రమైన ప్రైవేట్ పీజీ (PG) వసతిగృహాల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. పీజీల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, నిబంధనల ఉల్లంఘనలు, నాసిరకమైన ఆహారం, కలుషిత నీరు, విద్యార్థుల భద్రత గాల్లో కలవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ఘటన నేపథ్యంలో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు.

అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే – విద్యార్థులు పీజీల్లో తాత్కాలికంగా నివసిస్తున్నప్పటికీ, ప్రతిరోజూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సత్య నికేతన్‌లో ఘటనలో మరణించిన వారిలో ఆరుగురు, గాయపడిన వారందరూ విద్యార్థులే.

ఇంటి సౌకర్యాలు, రక్షణకు దూరంగా, ఇంజనీరింగ్, నీట్, సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తున్న ఈ విద్యార్థులు, తాము ఎంచుకున్న వృత్తిపై దృష్టి పెట్టడానికి అన్ని విధాలా సహాయం అవసరమైన కీలక సమయంలో, నిలదొక్కుకోవడానికి పోరాడవలసి వస్తోంది.

రెండు సంవత్సరాల క్రితం మరో విషాదం కారణంగా వార్తల్లో నిలిచిన పశ్చిమ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని ఒక కోచింగ్ సెంటర్‌ బేస్‌మెంట్‌లో వరదనీటిలో ముగ్గురు యుపిఎస్‌సి అభ్యర్థులు మునిగిపోయారు.

ఈనాడు, చాలా కోచింగ్ సెంటర్లు తమ తప్పులను సరిదిద్దుకుని, బేస్‌మెంట్‌లను మూసివేసినప్పటికీ, తాజాగా శిథిలావస్థలో ఉన్న ప్రైవేట్‌ పీజీ భవనాలతో కొత్త సంక్షోభం తలెత్తింది.

సమీపంలోని కరోల్ బాఘ్‌లో ఉన్న ఒక స్థానిక పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో దిగ్భ్రాంతికరమైన పరిస్థితులు ఉన్నట్లు ఎన్‌డీటీవీ పరిశోధనలో తేలింది. వీధి దీపాల స్తంభాల నుండి బయటకు పొడుచుకు వచ్చిన విద్యుత్ తీగలు, పాత ఎయిర్ కండిషనర్ల చిక్కుముడి మధ్య, రంగు వెలసి, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు వరుసగా ఉన్నాయి – ఇవి ఎప్పుడైనా అగ్ని ప్రమాదానికి దారితీసేలా ఉన్నాయి.

లోపల, పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. మెట్ల మధ్యలో చెత్తాచెదారం పేరుకుపోయిన ఇరుకైన, విరిగిపోయిన మెట్లు స్వాగతం పలుకుతాయి. గదులు చిన్నవిగా ఉన్నాయి, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంటగదులలో కనీస అల్మారాలు కూడా లేవు, మరుగుదొడ్లు మురికిగా, నీటితో నిండిపోయి ఉన్నాయి.

“తాగడానికి శుభ్రమైన నీరు కూడా లేదు,” అని అక్కడే ఉంటు హాస్టల్‌ విద్యార్థి వికాస్ మిశ్రా అన్నారు. ” ఇక్కడ నివసించడం జైలులో జీవించడం లాంటిది. యజమానులు మిమ్మల్ని వేధిస్తారు. బ్రోకర్లు మిమ్మల్ని వేధిస్తారు. ఇక నీటి సమస్య ఉంటుంది. కొన్నిసార్లు ఐదు, ఆరు రోజుల పాటు నీళ్లు ఉండవు,” అని ఆయన అన్నారు.

అక్కడ నీరు లభించినా, అది మురుగునీరులా ఉంటుంది. “అది బూడిద రంగులో ఉంటుంది, అంటే ఏదో ఒక దశలో అది కలుషితమవుతోందని అర్థం… మేం ఇలాగే జీవిస్తున్నాం,” అని ఆయన అన్నారు.

“ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు కేవలం రోడ్లను మాత్రమే పరిశీలిస్తారు. రోడ్లను చూడటం సరిపోదు. వారు భవనాల లోపలి పరిస్థితులను కూడా చూడాలి. మెట్లు చాలా ఇరుకుగా ఉంటాయి. పైగా మేం నాలుగవ అంతస్తు వరకు ఎక్కాల్సి ఉంటుంది… అలాగే యజమానులు ఎలా ఉంటున్నారో చూడండి. వారి ఇళ్లు అందంగా, చక్కటి సదుపాయాలతో ఉంటాయి,” అని ఆ ప్రాంతంలో నివసిస్తున్న మరో విద్యార్థిని సాక్షి సింగ్ అన్నారు.

సత్య నికేతన్‌లో భవనం కూలిపోయిన ఘటన, దేశ రాజధానికి వచ్చే విద్యార్థుల జీవన పరిస్థితులపై అందరి దృష్టిని సారించేలా చేసింది. ఈ దుర్ఘటన ఢిల్లీ హైకోర్టు దృష్టిని ఆకర్షించింది. ఈ పీజీ (PG) వసతి గృహాల పరిస్థితులు, చట్టపరమైన స్థితిగతులను పరిశీలించాలని, అలాగే రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కోర్టు అధికారులను ఆదేశించింది.

“చదువు కోసం బయటి ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఢిల్లీకి వస్తుంటారు. వారే దేశ భవిష్యత్తు,” అని పేర్కొన్న కోర్టు, వారు నివసించాల్సిన పరిస్థితులు “అత్యంత దయనీయంగా” ఉన్నాయని వ్యాఖ్యానించింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.