కోల్‌కతా: కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (SRFTI) విద్యార్థులపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలమని చెప్పుకున్న వ్యక్తులు నిన్న దాష్టీకానికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు; పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించిన ఒక లైబ్రేరియన్, పలువురు ఉపాధ్యాయులు కూడా గాయపడి రక్తమోడారు. మొత్తం 150 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు.
కనీసం నలుగురు విద్యార్థులకు కత్తి గాయాలు అయ్యాయి. సాయంత్రం 7 గంటల సమయంలో ఇన్‌స్టిట్యూట్ గేట్లు మూసివేసారని, దాడి చేసిన వారిలో కొందరిని ప్రాంగణం నుండి బయటకు పంపారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను లాక్కున్నట్లు సమాచారం.
ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ సమావేశం
కాగా, నిన్న ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న వినియోగదారుల అవగాహన సంస్థగా చెప్పుకునే ‘అఖిల భారతీయ గ్రాహక్ పంచాయత్’ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ప్రధాన థియేటర్ వేదికపై ఒక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం గురించి విద్యార్థులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, సినిమా రంగానికి ఎటువంటి సంబంధం లేని ఆ సంస్థకు అక్కడ సమావేశం నిర్వహించడానికి అనుమతి ఎలా లభించిందనే విషయంపై విద్యార్థి సంఘానికి ఏమీ తెలియదని సంఘం అధ్యక్షురాలు బ్లాసమ్ హజారికా తెలిపారు.
విద్యార్థుల కథనం ప్రకారం… మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీజేపీకి చెందినవారమని చెప్పుకున్న వ్యక్తులు అక్కడికి వచ్చి, హాలులో ఉన్న విద్యార్థులను బలవంతంగా బయటకు పంపడం ప్రారంభించారు; వారు విద్యార్థులను పక్కకు నెట్టడం, మెడ పట్టుకుని లాగడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ సమావేశం జరుగుతున్న ప్రధాన థియేటర్ వేదిక వద్ద విద్యార్థులు ‘అఖిల భారతీయ గ్రాహక్ పంచాయత్’ సభ్యులతో వాదనకు దిగారు.
ఇన్‌స్టిట్యూట్‌లో జరిగే కార్యకలాపాల స్వభావం దృష్ట్యా, ముందస్తు సమాచారం లేకుండా థియేటర్ వేదికపై ఎటువంటి సమావేశం నిర్వహించకూడదని విద్యార్థులు స్పష్టం చేశారు. ‘అక్కడ మరికొంతమంది బీజేపీ కార్యకర్తలు వేచి ఉన్నారు’
ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి విద్యార్థి నీరజ్ కుమార్ మాట్లాడుతూ… “మేము నిరసన తెలపడం కోసమే వారు వేచి ఉన్నట్లు అనిపించింది. క్షణాల్లోనే, వారిలో ఒక గుంపు వెదురు కర్రలు, లాఠీలతో మాపై దాడి చేసారు. మమ్మల్ని వామపక్ష తీవ్రవాదులని, బంగ్లాదేశీయులని ఇంకా రకరకాలుగా దూషిస్తూ తిట్టడం ప్రారంభించారు. అకస్మాత్తుగా వారిలో ఒక బృందం బయటకు వెళ్లి పిలవగానే, అక్కడ వేచి ఉన్న మరికొంతమంది బీజేపీ కార్యకర్తలు వచ్చి మాపై దాడి చేయడం మొదలుపెట్టారు.”
“వారు విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టడం మొదలుపెట్టారు. మహిళా విద్యార్థుల దుస్తులను లాగేయడానికి ప్రయత్నించారు, అలాగే విద్యార్థులను దేశద్రోహులని, బొద్దింకలని ఇంకా రకరకాలుగా దూషించారు.” దీంతో భయపడ్డ విద్యార్థులు లైబ్రరీలోకి పరుగెత్తారని, దుండగులు వారిని వెంబడించారని కుమార్ పేర్కొన్నారు:
“అప్పుడు విద్యార్థులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి లైబ్రరీలో ఆశ్రయం పొందారు. వారు లైబ్రరీలోకి కూడా చొరబడ్డారు. లైబ్రేరియన్‌పై కూడా దారుణంగా దాడి చేశారు.” బెంగాల్‌లో ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోలీసులు విద్యార్థులపైనే తమ ఆగ్రహాన్ని చూపించారని కుమార్ తెలిపారు:
“ఘటన మొదలైన గంట తర్వాత పంచసయార్ (Panchasayar) పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానీ పోలీసులు వచ్చినప్పుడు, వారు విద్యార్థులపైనే లాఠీచార్జ్ చేశారు. పోలీసుల సమక్షంలోనే బీజేపీ కార్యకర్తలు, వారి మద్దతుదారులు మాపై దాడులు కొనసాగించారు. పోలీసులు ఏమీ చేయలేదు.”
తీవ్రంగా గాయపడిన విద్యార్థులపై పదేపదే దాడులు జరిగాయని మరో విద్యార్థి ఉజ్వల్ రాయ్ చెప్పారు. “సాయంత్రం 7 గంటల సమయంలో, మేము ఎనిమిది మంది విద్యార్థులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా, వారు అంబులెన్స్‌ను చుట్టుముట్టి మళ్ళీ మాపై దాడి చేశారు. వారి దాడి ముందస్తు ప్రణాళికతో జరిగింది.” సంస్థలోని చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు చెందినవారని, క్యాంపస్ బయట ఆశ్రయం పొందే అవకాశం వారికి లేదని రాయ్ పేర్కొన్నారు.
కాగా, ఈ ఘటనపై ‘ది వైర్’ వార్తా సంస్థతో మాట్లాడిన చాలా మంది ప్రస్తుత, మాజీ విద్యార్థులు ఒక విషయాన్ని ప్రస్తావించారు: 1995లో వామపక్ష కూటమి (లెఫ్ట్ ఫ్రంట్) ప్రభుత్వ హయాంలో స్థాపించిన ఈ సంస్థలో, ఇలాంటి రాజకీయ సమావేశాలు లేదా ఇటువంటి హింస జరగడం గతంలో ఎప్పుడూ లేదని ఒక విద్యార్థిని అన్నారు:
అంతేకాదు “జూన్ నెల నుండి, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు అనుబంధంగా ఉన్న వివిధ సంస్థలు ప్రతి ఆదివారం ప్రధాన ఆడిటోరియంలో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. గతంలో ఇలాంటి పద్ధతి ఎప్పుడూ లేదు. ఒక రాజకీయ పార్టీకి ఈ విధంగా ప్రాంగణాన్ని ఉపయోగించుకునే అనుమతి ఎలా ఇచ్చారని విద్యార్థులందరూ ప్రశ్నిస్తున్నారు.”
“ఇక్కడ ఆదివారం అంటే కేవలం సెలవు దినం మాత్రమే కాదు. చాలా మంది విద్యార్థులు వారాంతపు సెలవులను తమ ప్రాక్టికల్ అసైన్‌మెంట్ల పని కోసం వినియోగించుకుంటారు. కాబట్టి, బయటి నుండి రాజకీయ కార్యకర్తల బృందం వచ్చి సమావేశాలు నిర్వహించినప్పుడు, అది విద్యార్థుల పనికి ఆటంకం కలిగిస్తుంది.”
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవారని చెప్పుకుంటూ విద్యార్థులపై దాడి చేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ, ఆ సంఘటన వివరాలతో కూడిన ఫిర్యాదును విద్యార్థి సంఘం పంచసయార్ పోలీస్ స్టేషన్‌లో సమర్పించింది.
కాగా, ఈ ఘటనపై ప్రముఖ బెంగాలీ చిత్రనిర్మాత కమలేశ్వర్ ముఖర్జీ ది వైర్‌తో మాట్లాడుతూ… “టెలివిజన్, సినిమా లేదా ఏదైనా కళారూపంతో సంబంధం లేని వ్యక్తులు ప్రభుత్వ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? వారు విద్యార్థులను కొట్టి, వారిని దేశ వ్యతిరేకులుగా పిలుస్తున్నారు? ఈ వ్యక్తులు ఎవరు? దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.” విద్యార్థులపై జరిగిన దాడిని లెఫ్ట్ అనుబంధ విద్యార్థి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ ఖండించింది, బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్ చక్రవర్తి ఈ ఘటనను అనాగరికమని అభివర్ణించారు. ‘‘సత్యజిత్‌రే పేరుతో దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో దేశంలోని భావి సినీ నిర్మాతలు, మేధావులపై దాడి చేయడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ ఎలాంటి సంస్కృతిని కోరుకుంటున్నదో చూపించిందని ఆయన వాపోయారు.

