Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

రాజధానిలో నీటి కటకట…!

Share It:

ముహమ్మద్ ముజాహిద్…✍️

ముఖ్యాంశాలు

డిసెంబర్‌లోనే హైదరాబాద్‌కు దాహార్తి కష్టాలు!

తెలంగాణలో 17 శాతం వర్షపాత లోటు..

అడుగంటుతున్న జలాశయాలు

రంగంలోకి దిగిన హెచ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ (HMWSSB)

ముందస్తు అత్యవసర ప్రణాళికల రూపకల్పన

ఐటీ కారిడార్‌కు కంటి మీద కునుకు కరువు!

హైదరాబాద్‌: సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే చాలు… గ్రేటర్ హైదరాబాద్ నగరవాసులకు నీటి కష్టాలు మొదలవుతుంటాయి. కానీ, ఈసారి వేసవి వరకు ఆగకుండా… డిసెంబర్, జనవరిలోనే విశ్వనగరానికి తాగునీటి ముప్పు ముంచుకొచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షపాత లోటు, జలాశయాల్లో అడుగంటుతున్న నీటి మట్టాలు నగరవాసులను కలవరపెడుతున్నాయి.

తెలంగాణవ్యాప్తంగా 17 శాతం వర్షపాత లోటు ఉండటంతో, నగరానికి నీరందించే ప్రధాన రిజర్వాయర్లు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. ఈ పరిస్థితులపై ముందస్తుగా అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం… వ్యవసాయ అవసరాల కోసం రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయవద్దని నీటిపారుదల శాఖను ఇప్పటికే స్పష్టంగా ఆదేశించింది. ప్రభుత్వానికి వ్యవసాయం కంటే తాగునీటి సరఫరానే ప్రథమ ప్రాధాన్యమని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ తేల్చిచెప్పారు. అయితే, ప్రస్తుత వేగంతో నీటి మట్టాలు పడిపోతుంటే వేసవి కంటే ముందే తీవ్రమైన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ వివిధ రిజర్వాయర్లు, అనుసంధాన సరస్సుల నుంచి గ్రామాల మీదుగా నీటిని తరలిస్తుండటంతో ఆ నెట్‌వర్క్‌పై విపరీతమైన భారం పడుతోంది.

సింగూరులో అడుగంటుతున్న నీరు.. నగరంలోని ప్రతిష్టాత్మక పశ్చిమ ఐటీ కారిడార్‌కు ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న సింగూరు రిజర్వాయర్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ జలాశయం పూర్తి సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో కేవలం 3.9 టీఎంసీల నీరు మాత్రమే (సుమారు 13 శాతం లేదా ఎనిమిదో వంతు) మిగిలి ఉంది. ఇది గత వేసవి గరిష్ట సమయంలో ఉన్న నిల్వలో దాదాపు సగం మాత్రమే కావడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 60 రోజుల్లో, అంటే డిసెంబర్ మధ్యనాటికి సింగూరు పూర్తిగా అడుగంటుతుందని అధికారులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాతబస్తీపైనా నీటి కక్ష్య.. ఉస్మాన్‌‌సాగర్ సైతం ఖాళీ!కేవలం పశ్చిమ కారిడారే కాకుండా, పాతబస్తీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు నీటిని అందించే ఉస్మాన్‌సాగర్ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. ఇక్కడ నీటి నిల్వ 3.5 టీఎంసీల నుంచి 2.2 టీఎంసీలకు పడిపోవడంతో నగరానికి ఉన్న బఫర్ నిల్వలు ప్రమాదకర స్థాయికి కుచించుకుపోయాయి. మరోవైపు, కోర్ అర్బన్ రీజియన్ (CURE) అవసరాలను తీర్చే హిమాయత్‌సాగర్, నాగార్జున సాగర్ ద్వారా వచ్చే కృష్ణా జలాలు, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వచ్చే గోదావరి జలాలపై ఆధారపడిన వ్యవస్థ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వర్షపాత లోటుతో పాటు ఎల్ నినో (El Nino) ప్రభావం వల్ల రెండు ప్రధాన నదీ పరివాహక ప్రాంతాల్లోనూ వరద ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోయాయి. నాగార్జున సాగర్ నుంచి సింగూరు వరకు ఎక్కడా ఆశించిన స్థాయిలో ప్రవాహాలు లేకపోవడం కలవరపెడుతోంది. ఒకవేళ సింగూరు, ఉస్మాన్‌సాగర్‌‌లలో నీటి మట్టాలు మరింత పడిపోతే ఆ లోటును భర్తీ చేయడం ఏమాత్రం సాధ్యం కాదని నీటిపారుదల శాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

అప్రమత్తమైన వాటర్ బోర్డు.. అత్యవసర కార్యాచరణకు శ్రీకారంఈ ముప్పును ముందే గ్రహించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) ఇప్పట్నుంచే వేసవి అత్యవసర ప్రణాళిక (Summer Contingency Plan) రూపకల్పనలో నిమగ్నమైంది. నగరంలో ఎక్కడా తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రాంతాలవారీగా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని వాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు.సింగూరు, మంజీర సరఫరాపై ఆధారపడిన ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా గుర్తించి… నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఏ ప్రాంతానికి ప్రత్యామ్నాయ వనరు ఏది? నీటిని ఏ మార్గం ద్వారా తరలించాలి? ఎంత పరిమాణంలో అందించాలనేదానిపై స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సీనియర్ హెచ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారి తెలిపారు. అదేవిధంగా, నగరంలో నీటి పీడనం (Water Pressure) తక్కువగా ఉండే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి, ముందస్తు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

మొత్తంగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, జలమండలి చేపడుతున్న ఈ ముందస్తు చర్యలు ఎంతవరకు సఫలమవుతాయి? డిసెంబర్ నాటికి నగరవాసులకు నీటి కష్టాలు రాకుండా నివారించడంలో అధికారులు ఏ మేరకు విజయం సాధిస్తారో వేచి చూడాలి!

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.