Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

తెలంగాణలో తప్పుడు’ఫారం-7′ కలకలం…బీజేపీ BLAపై ఎఫ్‌ఐఆర్!

Share It:

హైదరాబాద్‌: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముషీరాబాద్‌లో బల్క్ ‘ఫారం-7’ దరఖాస్తులు సమర్పించిన బీజేపీ బూత్ స్థాయి ఏజెంట్ (BLA)పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు. SIR సందర్భంగా ఫారం-7 ద్వారా తప్పుడు సమాచారం సమర్పించారనే ఆరోపణలపై తెలంగాణలో నమోదైన మొదటి ఎఫ్ఐఆర్ ఇదే.

ఒక ఎన్నికల అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్. బాలచందర్‌పై ఈ కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సంబంధిత నిబంధనలను ప్రయోగించినట్లు పోలీసులు తెలిపారు.

“30 మంది ఓటర్లను తొలగించడానికి BLA ఫారాలు సమర్పించారనే ఫిర్యాదు మేరకు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేశాము, దీనిపై దర్యాప్తు జరుగుతోంది,” అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్‌
ముషీరాబాద్‌లోని బీజేపీ బీఎల్‌ఏ 30 మంది ఓటర్ల పేర్లను తొలగించాలని కోరుతూ ఫారం-7 దరఖాస్తులు సమర్పించారని ఆరోపిస్తూ, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డికి బాలచందర్‌పై ఫిర్యాదు చేశారు. నిజమైన ఓటర్ల పేర్లను చట్టవిరుద్ధంగా తొలగించే ప్రయత్నమే ఈ దరఖాస్తులని కాంగ్రెస్ ఆరోపించింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

ఈమేరకు తెలంగాణ కాంగ్రెస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌ను కూడా ఆశ్రయించింది. ఎస్ఐఆర్ సమయంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిజమైన ఓటర్లను తొలగించేందుకు కుట్ర పన్నారని అనుమానిస్తూ, దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సిట్ దర్యాప్తు జరపాలని కోరింది.

తన ఫిర్యాదులో, ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బీజేపీ బీఎల్‌ఏ… షర్ఫుద్దీన్, అతని కుటుంబ సభ్యుల పేర్లను తొలగించాలని కోరుతూ ఫారం-7 దరఖాస్తులు సమర్పించారని కాంగ్రెస్ ఆరోపించింది.

ప్రస్తుత ఓటర్ల జాబితా నుండి ఒక పేరును చేర్చడం లేదా తొలగించడం అనే ప్రతిపాదనపై అభ్యంతరం దాఖలు చేయడానికి ఫారం-7 ఉపయోగిస్తారు. అయితే బీజేపీ ఈ ఆరోపణలను ఖండించింది. ఏ బీజేపీ బీఎల్‌ఏ కూడా అటువంటి ఫారం-7 దరఖాస్తులను సమర్పించలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు.

తప్పుడు ప్రకటనల పట్ల సీఈఓ హెచ్చరిక
ఫారం-6, ఫారం-6A, ఫారం-7, ఫారం-8లలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు లేదా ప్రకటనలు చేసే దరఖాస్తుదారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

జిల్లా ఎన్నికల అధికారులకు పంపిన ఆదేశాల్లో, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల వద్ద పెద్ద సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు దాఖలవుతున్నాయని, అయితే వాటిలో కొన్ని నిజమైనవి కావనే ఆరోపణలు ఉన్నాయని సీఈఓ కార్యాలయం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.