హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) సందర్భంగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సమర్పించడానికి నేడు గడువు ముగియనుంది. ఎస్ఐఆర్ షెడ్యూల్ ప్రణాళిక ప్రకారం కొనసాగుతుందని, దీనిని మరింత పొడిగించే అవకాశం లేదని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ సవరణలో ‘క్లెయిమ్‌లు, అభ్యంతరాలు’, ‘నోటీసు కాలం’ అనే రెండు దశలను నిర్వహిస్తోంది.
ఆగస్టు 17న ముసాయిదా జాబితా ప్రకటించిన ఎన్నికల కమిషన్ అదేరోజు నుంచి అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరిస్తోంది. ఎన్యుమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత రాష్ట్రంలో 73,39,000 వేల ఓట్లు రద్దయ్యాయి. అర్హత ఉన్న ఓటర్లను ఫామ్-6 ద్వారా మళ్లీ చేర్చే విధంగా ఆయా రాజకీయపార్టీలు దృష్టిసారించాయి. వాటికి సంబంధించి నిన్నటివరకు 7,56,180 అభ్యంతరాలు,క్లెయిమ్‌లు వచ్చినట్లు సీఈవో కార్యాలయం తెలిపింది.
క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు ఈరోజే చివరి గడువు
ఓటర్లు కొత్తగా నమోదు చేసుకోవడానికి, ఓటర్ల వివరాలను సరిదిద్దుకోవడానికి, మరియు ఓటర్ల జాబితాలో అనర్హులను చేర్చడంపై అభ్యంతరాలు తెలియజేయడానికి అక్టోబర్ 7న దరఖాస్తులను సమర్పించవచ్చు.
ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు లేదా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునేవారు ఫారం 6ను సమర్పించవచ్చు. తమ ఓటర్ల వివరాలలో దిద్దుబాట్లు కోరుకునే ఓటర్లు ఫారం 8ను ఉపయోగించవచ్చు. ఓటర్ల జాబితాలో అనర్హుడిని చేర్చడాన్ని అభ్యంతరం తెలియజేయడానికి ఫారం 7ను సమర్పించవచ్చు. ఈ మూడు ఫారాలను నేడే సమర్పించాల్సి ఉంటుంది.
ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పరిశీలించి వాటిని చట్టబద్ధంగా పరిష్కరించడానికి ఎన్నికల శాఖ నవంబర్ 5వ తేదీ వరకు గడువును కేటాయించింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే, అన్ని పరిశీలనల అనంతరం రాబోయే నవంబర్ 9వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తాజా మార్గదర్శకాల ప్రకారం, అన్‌మ్యాప్డ్ కేటగిరీలో పేర్లు ఉన్నఓటర్ల ఇళ్లకు బూత్-స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) వెళ్తారు. ఈ పర్యటనల సమయంలో బీఎల్‌ఓలు ఈ ఓటర్ల నుండి అవసరమైన పత్రాలను సేకరిస్తారు.
పత్రాల తనిఖీకి ఈఆర్ఓ, ఏఈఆర్ఓ
ఓటర్లు సమర్పించిన పత్రాలను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్ఓలు) లేదా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్ఓలు) పరిశీలిస్తారు. సమర్పించిన పత్రాల ఆధారంగా అధికారులు సంబంధిత ఓటర్ల అర్హతను నిర్ణయిస్తారు. తుది ఓటర్ల జాబితాను నవంబర్ 9న ప్రచురించనున్నారు.


