ముహమ్మద్ ముజాహిద్…✍️
న్యూఢిల్లీలోని చారిత్రక రేస్‌కోర్స్ మసీదును పరిరక్షించడంతో పాటు, అక్కడ నిలిపివేసిన మౌలిక సదుపాయాలను తక్షణమే పునరుద్ధరించాలని జమాతె ఇస్లామీ హింద్ డిమాండ్ చేసింది. మసీదును ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేయడం, కూల్చివేత ముప్పు నెలకొనడంపై ఆ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నమాజీల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మసీదును అందుబాటులో ఉంచాలని కోరింది.జమాతె ఇస్లామీ హింద్ నాయిబ్ అమీరే మలిక్ ముతసిమ్ ఖాన్ నేడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఈ మేరకు డిమాండ్లు చేశారు. రేస్‌కోర్స్ మసీదులో అనేక సంవత్సరాలుగా ప్రార్థనలు జరుగుతున్నాయని, 1977 నుంచి ప్రభుత్వ గెజిట్‌లో ఈ మసీదు వక్ఫ్ ఆస్తిగా నమోదై ఉందని ఆయన పేర్కొన్నారు. మసీదుకు సంబంధించిన అధికారిక పత్రాలు, రికార్డులను పరిగణనలోకి తీసుకుని దాని పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
**విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించాలి**
మసీదుకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం, మసీదును ఖాళీ చేయాలంటూ ఇమామ్‌పై ఒత్తిడి తీసుకురావడం పట్ల మలిక్ ముతసిమ్ ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్, నీటి సౌకర్యాలను వెంటనే పునరుద్ధరించాలని, నమాజీల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు కల్పించకూడదని డిమాండ్ చేశారు. పరిపాలనా చర్యలు చట్టబద్ధంగా ఉండాలని, ప్రార్థనా స్థలాల పట్ల గౌరవాన్ని కాపాడాలని సూచించారు.
**వక్ఫ్ బోర్డు చొరవ తీసుకోవాలి**
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ బాధ్యత కలిగిన సంస్థలు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన అన్నారు. మసీదును ఖాళీ చేయించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు సమర్థవంతమైన న్యాయపోరాటం చేయడం లేదన్న సమాచారం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తులకు ముప్పు ఏర్పడినప్పుడు సంబంధిత సంస్థలు సకాలంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
**మత సామరస్యాన్ని కాపాడాలి**
రేస్‌కోర్స్ మసీదుతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఖబరిస్తాన్ను కూడా పరిరక్షించాలని జమాతె ఇస్లామీ హింద్ డిమాండ్ చేసింది. మసీదును కూల్చివేసే చర్యలను పూర్తిగా నిలిపివేయాలని, ఈ వ్యవహారాన్ని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా పరిష్కరించాలని కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలను కోరింది.ప్రార్థనా స్థలాల విషయంలో పరిపాలనా అధికారాల దుర్వినియోగానికి తావివ్వకూడదని, మైనారిటీలపై ద్వేషాన్ని పెంచే పరిణామాలను నివారించాలని మాలిక్ ముతసిమ్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. దేశంలో సమానత్వం, ప్రజల విశ్వాసం, మత సామరస్యం కొనసాగాలంటే అన్ని ప్రార్థనా స్థలాలకు సమాన రక్షణ కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.
