న్యూఢిల్లీ: దేశ రాజధాని లోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదానంలో ప్రతిపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఓటర్ల జాబితాలో అక్రమాలు, పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు నిరసనగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి, జైలుకు పంపడం ఖాయమని, ఆ తర్వాత ఓట్ల చోరీకి (Vote Chori) పాల్పడినందుకు నరేంద్ర మోదీ, అమిత్ షాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ నినాదమైన “మోదీ ఎక్కడికీ వెళ్లరు” అనే మాటను ప్రస్తావిస్తూ.. “ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లలేరు, ఆయన వెళ్లాలనుకున్నా మేము వెళ్లనివ్వం” అని రాహుల్ వ్యాఖ్యానించారు.
“దేశానికి న్యాయం జరుగుతుంది. అదానీ కోసం చేసిన ఓటు దొంగతనానికి దేశం న్యాయం కోరుతుంది, పారిపోవాలని ఆలోచించకండి. మీరు పారిపోలేరు… మీరు, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ చట్టపరమైన చర్యలను ఎదుర్కోక తప్పదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
”రామ్‌లీలా మైదానంలో జరిగిన భారీ సభను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “ఓట్ చోరీ అనేది ఏదో దుకాణంలో వస్తువులు దొంగిలించడం లాంటి సాధారణ విషయం కాదు. ఇది దేశంలోని ప్రతి పౌరుడి ఓటును, గొంతును దొంగిలించడం. దేశ రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఇది ముమ్మాటికీ దేశద్రోహమే” అని మండిపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 15 శాతం మంది ఓటర్లను అక్రమంగా తొలగించారని ఆరోపించారు. “నేను మాత్రమే ఈ మాట చెప్పడం లేదు, ఎన్నికల సంఘం డేటానే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కబ్జా చేశారు” అని ధ్వజమెత్తారు.
రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రతిపక్షం తమ కార్యకర్తలను భారీ స్థాయిలో సమీకరించింది. కాంగ్రెస్, దాని విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ), సిపిఐ (మార్క్సిస్ట్), సిపిఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ వంటి వామపక్ష పార్టీల జెండాలు రెపరెపలాడాయి.


