ఒమర్ రషీద్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్…✍️
న్యూఢిల్లీ: ప్రయాగ్రాజ్లోని పరేడ్ గ్రౌండ్లో నవంబర్ 1న జరిగిన ‘విశాల్ ప్రబుద్ధ మహాకుంభ్’ వేదికగా ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్థానిక బ్రాహ్మణ సంఘం ‘రాష్ట్రీయ పరశురామ సేన (బ్రాహ్మణవాహిని)’ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ముఖ్య అతిథిగా ప్రసంగిస్తుండగా.. ప్రేక్షకుల మధ్య ఉన్న రోహిత్ తివారీ ‘కాకా’ అనే యువ న్యాయవాది ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు.
ప్రతిపక్ష పార్టీలపై మౌర్య విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. తివారీ వేదిక వైపు చూస్తూ, “కేశవ్ జీ, మా గురించి కూడా ఏదైనా చెప్పండి. యూజీసీ (UGC) గురించి మాట్లాడండి” అని డిమాండ్ చేశారు. కుల వివక్ష నివారణకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) రూపొందించిన 2026 ముసాయిదా నిబంధనలను ఉపసంహరించుకోవాలని పలు అగ్రవర్ణ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రస్తావన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉపముఖ్యమంత్రి అసహనం – వేదికపై ఉద్రిక్తత
ఈ అనూహ్య పరిణామానికి అసహనానికి గురైన మౌర్య.. “ఇప్పుడు మీరు ఊరుకోండి, వెళ్ళండి” అని మందలించారు. అయినప్పటికీ తివారీ వెనకడుగు వేయకుండా యూజీసీ మార్గదర్శకాల గురించి మళ్లీ ప్రశ్నించడంతో, “నేను అన్నింటి గురించి మాట్లాడతాను. ఏ విషయంపైనైనా మాట్లాడటానికి ఎప్పుడూ వెనుకాడను” అని మౌర్య బదులిచ్చారు.
పోలీసులు తివారీని, మరో వ్యక్తిని ప్రధాన వేదిక ప్రాంతం నుండి బయటకు తీసుకెళ్తుండగా మౌర్య పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకుడు విమల్ తివారీ తనకు అందజేసిన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పరిశీలిస్తానని హామీ ఇస్తూ.. కేవలం ప్రసంగాలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావని, వాటిని సాధించే మార్గాన్ని అన్వేషించాలని ఆయన వ్యాఖ్యానించారు.
ఘర్షణలు – సోషల్ మీడియాలో వైరల్
పోలీసులు తివారీని బయటకు తీసుకెళ్తున్న సమయంలో, మౌర్యకు సన్నిహితుడైన ప్రయాగ్రాజ్ అల్లాపూర్ కౌన్సిలర్ వినయ్ మిశ్రా ‘సీతూ’ తివారీపై చేయి చేసుకున్నట్లు (చెంపదెబ్బ కొట్టినట్లు) ఆరోపణలు వచ్చాయి. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
బాధిత యువకుడు తివారీ ఫిర్యాదు మేరకు నవంబర్ 2న బీజేపీ కౌన్సిలర్ మిశ్రాపై స్వచ్ఛందంగా గాయపరచడం, శాంతిభంగం, బెదిరింపుల ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైంది. రెండు గంటల పాటు పోలీసుల అదుపులో ఉన్న తివారీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బద్ధంగానే తాను భావప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకున్నానని, సమాజానికి హానికరమైన యూజీసీ మార్గదర్శకాలపై డిప్యూటీ సీఎం స్పందించాలని కోరినట్లు ‘ది వైర్’కు తెలిపారు.
రాజకీయ రంగు పులుముకున్న వైనం
అలహాబాద్ నార్త్ సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే, స్వయంగా బ్రాహ్మణుడైన హర్ష్ వర్ధన్ బాజ్పాయ్ ఈ ఘటనలో తివారీకి మద్దతుగా నిలవడం రాజకీయంగా కలకలం రేపింది. “ప్రతి బ్రాహ్మణ/అగ్రవర్ణ వ్యక్తికి యూజీసీని వ్యతిరేకించే హక్కు ఉంది,” అని ఆయన ఫేస్బుక్ వేదికగా స్పందించారు. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ, ఈ చిన్న ఘటన అధికార పార్టీలోని అంతర్గత ఉద్రిక్తతలను బట్టబయలు చేసింది.
బీజేపీకి కుల సమీకరణాల సవాళ్లు
ఓబీసీ, దళిత హిందువుల ఏకీకరణే ప్రధాన అజెండాగా సాగుతున్న బీజేపీకి, సంప్రదాయ అగ్రవర్ణ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లు పెద్ద సవాలుగా మారుతున్నాయి. జనరల్ కేటగిరీ కమిషన్ (సవర్ణ ఆయోగ్) ఏర్పాటు, బ్రాహ్మణ గుర్తింపు పరిరక్షణ చట్టం వంటి డిమాండ్లతో పాటు యూజీసీ నిబంధనలపై వ్యక్తమవుతున్న అసంతృప్తి పార్టీకి తలనొప్పిగా మారింది. ఇటీవల ఆర్ఎస్ఎస్ కూడా ఈ నిబంధనలు “అసమతుల్యంగా” ఉన్నాయని పేర్కొనడం గమనార్హం.
మరోవైపు, 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్లపై చెలరేగిన వివాదాల నష్టాన్ని మరువకముందే.. తాజాగా ఉప ముఖ్యమంత్రులు బ్రజేష్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్యల వ్యవహారశైలితో కులపరమైన చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
(ద వైర్ సౌజన్యంతో)

