న్యూఢిల్లీ: జాతి నిర్మూలన నేరాలకు పాల్పడుతూ, పాలస్తీనియన్లు ఒక సమూహంగా గాజాలో కొనసాగకుండా నిరోధించడానికి ఇజ్రాయెల్ వ్యవస్థీకృత వ్యూహాలను అమలు చేస్తోందని ఐక్యరాజ్యసమితి నియమించిన స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్ ఛైర్‌పర్సన్, ప్రముఖ భారతీయ న్యాయకోవిదుడు జస్టిస్ ఎస్. మురళీధర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘ది హిందూ’ పత్రిక నిర్వహిస్తున్న “ది వ్యూ ఫ్రమ్ ఇండియా” పాడ్‌కాస్ట్ సిరీస్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు.
జాతి నిర్మూలన వ్యూహాలు:
పాలస్తీనా జనాభాను క్రమంగా తగ్గించాలని, భూభాగాల ఆక్రమణను గరిష్ఠ స్థాయికి పెంచుకోవాలని ఇజ్రాయెల్ కుట్ర పన్నుతోందని కమిషన్ నిర్ధారించింది. ఉద్దేశపూర్వక హత్యలు, జీవనాధార పరిస్థితుల విధ్వంసం, బలవంతపు స్థానభ్రంశం వంటి చర్యలకు ఇజ్రాయెల్ పాల్పడుతోంది.
పిల్లలే లక్ష్యంగా దాడులు:
పాలస్తీనీయులు ఒక సమూహంగా భవిష్యత్తులో ఉండకూడదనే దురుద్దేశంతోనే దాడుల సరళి కొనసాగుతోందని, ముఖ్యంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని జస్టిస్ మురళీధర్ ఆందోళన వ్యక్తం చేశారు. తల, మెడను టార్గెట్ చేయడం, చేతులు పైకెత్తిన వారిని కాల్చడం, అంబులెన్స్‌లను అడ్డుకోవడం వంటివి ఇందుకు నిదర్శనం.
వెస్ట్ బ్యాంక్‌లోనూ అదే పరిస్థితి: గాజాలో కనిపించిన హింసాత్మక దాడుల సరళి ఇప్పుడు వెస్ట్ బ్యాంక్‌లోనూ పునరావృతమవుతోంది. 1967 తర్వాత వెస్ట్ బ్యాంక్‌లోనే అత్యధిక సంఖ్యలో పాలస్తీనీయులు నిర్వాసితులవుతున్నారు. ఇజ్రాయెల్ భద్రతా దళాలు అక్కడి వలసదారులను (సెటిలర్లను) ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నాయి.
కాగా, 1947-49 మధ్య కాలం నుంచే భూభాగాలను ఆక్రమించి, పాలస్తీనా జనాభాను తగ్గించే విధానం కొనసాగుతోంది. నాటి రెండు దేశాల ఏర్పాటు ప్రతిపాదన పూర్తిగా నీరుగారిపోయింది. ప్రస్తుతం గాజాలో దాదాపు 70 శాతం భూభాగం ఇజ్రాయెల్ నియంత్రణలోనే ఉంది.
దారుణమైన మానవతా సంక్షోభం:
గాజాలోని సుమారు 23 లక్షల మంది ప్రజలు పూర్తిగా నిర్వాసిత శిబిరాలకే పరిమితమయ్యారని, తాగునీరు, ఆశ్రయం, పారిశుధ్యం, విద్య, వైద్యం వంటి కనీస వసతులు పూర్తిగా కరువయ్యాయని ఆయన తెలిపారు. రఫా సరిహద్దు దాటడానికి గానీ, వెస్ట్ బ్యాంక్‌కు ప్రయాణించడానికి గానీ ప్రజలను అనుమతించడం లేదు.
మరోవంక ఐక్యరాజ్యసమితి కమిషన్ నివేదికను “చారిత్రక కల్పన” అంటూ కొట్టిపారేస్తున్న ఇజ్రాయెల్, విచారణ అధికారుల విశ్వసనీయతను దెబ్బతీయడానికి భారీగా (సుమారు 700 మిలియన్ డాలర్లు) నిధులు వెచ్చిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోందని యునైటెడ్ నేషన్స్ ప్రతినిధి విమర్శించారు.
అంతేకాదు ఆయుధ సరఫరాలతో సహా ఇజ్రాయెల్‌తో సైనిక, సాంకేతిక సహకారాన్ని దేశాలు నిరుత్సాహపరచాలని, చిన్న ఆయుధాలను సరఫరా చేస్తున్న దేశాలలో భారత్ కూడా ఉందని ఐక్యరాజ్యసమితి నియమించిన స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్ ఛైర్‌పర్సన్, ప్రముఖ భారతీయ న్యాయకోవిదుడు జస్టిస్ ఎస్. మురళీధర్ గుర్తుచేశారు.
కాగా, పిల్లలపై, తాజా పరిణామాలపై కమిషన్ ఇచ్చిన నివేదికలపై భారతదేశం నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదని, దానికోసం ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా స్పందించి సార్వత్రిక న్యాయ పరిధి ద్వారా బాధ్యులను జవాబుదారీ చేయాలని, ద్వి-దేశ పరిష్కార మార్గాన్ని వదిలిపెట్టకూడదని జస్టిస్ మురళీధర్ పిలుపునిచ్చారు.
