న్యూఢిల్లీ: ఈ దేశ మట్టిలో అందరి రక్తం కలిసే ఉంది. హిందుస్థాన్ ఎవడబ్బ సొత్తు కాదని ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ ఘాటుగా స్పందించారు. ఇండోర్‌లో జరగాల్సిన తన కన్సర్ట్‌ను అడ్డుకోవడానికి జరిగిన ప్రయత్నాలపై పంజాబీ గాయకుడు సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ షోకు బాంబు బెదిరింపులు, కొన్ని పాటలపై అభ్యంతరాలు, అనుమతుల విషయంలో అనిశ్చితి ఉన్నప్పటికీ, ఆదివారం ఆయన ఇండోర్‌లో తన ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని “జై శ్రీ మహాకాల్” అనే నినాదంతో ప్రారంభించిన ఆయన, అభిమానులకు ఇచ్చిన మాట తప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఈ ఇండోర్ ప్రదర్శన, అక్టోబర్ 30న ఢిల్లీలో మొదలైన దిల్జీత్ దోసాంజ్ ‘ఆరా (AURA) ఇండియా టూర్ 2026’లో భాగంగా జరిగింది. ఢిల్లీ కన్సర్ట్ కూడా పోలీసు అనుమతులు, భద్రతా ఏర్పాట్ల విషయంలో అనిశ్చితిని దాటుకుని సాగింది. డిసెంబర్ 20 వరకు తాను భారతదేశంలోనే ఉండి, మిగిలిన అన్ని ప్రదర్శనలను పూర్తి చేస్తానని దోసాంజ్ తెలిపారు.
42 ఏళ్ల ఈ గాయకుడు, ఇండోర్ కన్సర్ట్‌ను ప్రారంభిస్తూ ప్రేక్షకులతో “జై శ్రీ మహాకాల్” అని అనిపించారు. ఆ తర్వాత తన పర్యటనను అడ్డుకోవడానికి జరిగిన ప్రయత్నాల గురించి ప్రస్తావిస్తూ, తాను ఏమాత్రం భయపడలేదని చెప్పారు.
“ఇది మహాకాలుడి భూమి, ఇక్కడికి రాకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. మేము గతంలో భయపడలేదు, ఇప్పుడు కూడా భయపడటం లేదు. ఇక మీరు భయపడాల్సిన అవసరమేముంది? మీలో ఉన్న ధైర్యమే మమ్మల్ని ఈరోజు ఇక్కడికి తీసుకువచ్చింది” అని ఆయన ప్రేక్షకులతో అన్నారు. ఇండోర్‌కు రాకుండా తనను అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని, కానీ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తాను నిర్ణయించుకున్నానని దోసాంజ్ చెప్పారు. “ఇక్కడికి రాకుండా నన్ను ఆపడానికి చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ, నేను వచ్చాను. ఒకసారి వస్తానని మాట ఇచ్చానంటే, ఆ మాట నుంచి నేను ఎప్పటికీ వెనక్కి తగ్గను” అని ఆయన అన్నారు.
ఈ ఆంక్షలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇండోర్‌కు చెందిన ప్రముఖ కవి రాహత్ ఇండోరి రాసిన ఐకానిక్ గజల్‌లోని పంక్తులను ఆయన ఆలపించి అభిమానులలో జోష్ నింపారు:
“అగర్ ఖిలాఫ్ హై తో హోనే దో, జాన్ థోడీ హై…
సభీ కా ఖూన్ హై షామిల్ యహా కీ మిట్టీ మే,
కిసీ కే బాప్ కా హిందుస్తాన్ థోడీ హై!”
(వ్యతిరేకిస్తే వ్యతిరేకించనివ్వండి, ఇదేం ప్రాణం పోయే విషయం కాదు… ఈ మట్టిలో అందరి రక్తం కలిసి ఉంది, హిందుస్తాన్ ఎవరి అబ్బ సొత్తూ కాదు!)
మొత్తంగా బెదిరింపులు, ఆంక్షలు ఎదురైనప్పటికీ దిల్జిత్ తన అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం ఇండోర్ వచ్చి విజయవంతంగా షో ముగించారు. రాహత్ ఇండోరి కవితను ఆయన చదివిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
