Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

వాతావరణ మార్పులతో తీవ్రంగా నష్టపోతున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటి!

Share It:

బెంగళూరు: వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న విపత్తులపై క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ (CRI) 2027 విడుదల చేసిన నివేదిక చాలా ఆందోళనకరమైన విషయాలను వెల్లడించింది. గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సంబంధిత విపత్తుల వల్ల 9.16 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్తుల బారిన అత్యధికంగా ప్రభావితమైన పది దేశాల జాబితాలో భారతదేశం కూడా చోటు దక్కించుకుందని ఈ నివేదిక వెల్లడించింది.

ప్రఖ్యాత సంస్థ జర్మన్‌వాచ్ ప్రచురించిన ఈ నివేదికను డేవిడ్ ఎక్‌స్టీన్, ఇతరులు సంయుక్తంగా అధ్యయనం చేశారు. వాతావరణ తీవ్రతలు దేశాలపై చూపే ప్రభావాన్ని విశ్లేషిస్తూ రూపొందించిన ఈ నివేదికలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కేవలం ప్రాణనష్టమే కాకుండా, దీనివల్ల జరిగిన ప్రత్యక్ష ఆర్థిక నష్టాలు దాదాపు రూ. 439 లక్షల కోట్లు పైగా ఉన్నట్లు అంచనా వేశారు.

కరేబియన్ ద్వీప దేశమైన డొమినికా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవగా, భారత్‌ 10వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మయన్మార్, హోండురాస్, లిబియా, హైతీ, గ్రెనడా, ఫిలిప్పీన్స్, నికరాగ్వా , బహామాస్ దేశాలు కూడా ఉన్నాయి.

భారత్‌పై తీవ్ర ప్రభావం
గత మూడు దశాబ్దాలలో భారత్‌ ఏకంగా 436 తీవ్ర వాతావరణ సంఘటనలను ఎదుర్కొంది. దీనివల్ల దేశంలో 78,000 మంది మరణించగా, $170 బిలియన్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లింది. తుఫానులు, కరువులు, వరదలు, భయంకరమైన వడగాలుల కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

దేశాన్ని వణికించిన కొన్ని ప్రధాన విపత్తులను పరిశీలిస్తే… 1998 గుజరాత్, 1999 ఒడిశా తుఫానులు, అలాగే 2014, 2020 సంవత్సరాలలో వచ్చిన హుద్‌హుద్, అంఫాన్ తుఫానులు భారీ నష్టాన్నే తెచ్చిపెట్టాయి.

ఇక వరదల విషయానికి వస్తే… 2013లో బీభత్సం సృష్టించిన ఉత్తరాఖండ్ వరదలు, 2019లో ఏకంగా 13 రాష్ట్రాలను ముంచెత్తిన తీవ్ర వరదలతో మన దేశం తీవ్రంగా నష్టపోయింది.

అలాగే 1998, 2002, 2003,2015 సంవత్సరాలలో దాదాపు 50°C ఉష్ణోగ్రతలతో అసాధారణంగా చెలరేగిన వడగాలుల వల్ల అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

వడగాలులు ఒంటరిగా రాకుండా కరువు వంటి ఇతర విపత్తులతో జతకడుతున్నాయని అధ్యయనం హెచ్చరించింది. పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలే ఈ తీవ్రమైన వేడికి ప్రధాన కారణమని, అంచనా వేసిన విపత్తులలో 77% సంఘటనల తీవ్రతను వాతావరణ మార్పు పెంచిందని నివేదిక స్పష్టం చేసింది. ఈ పరిణామాలు వ్యవసాయ రంగాన్ని, ఆహార భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.

మున్ముందు మరింత ముప్పు!
ఈ నివేదిక సహ రచయిత్రి వేరా కుంజెల్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పు ప్రతి దేశానికి ప్రమాదాన్ని పెంచుతోందని, ఒకప్పుడు అసాధారణంగా ఉండే విపత్తులు నేడు “నిరంతర ముప్పుగా” మారుతూ ఒక కొత్త సాధారణ పరిస్థితిని సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వనరులు తక్కువగా ఉండి, విపత్తులను ఎదుర్కొనే సత్తా తక్కువగా ఉన్న దేశాలకు ఇది మరింత కష్టతరంగా మారుతుందని ఆమె హెచ్చరించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.