Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

మోదీ ఫిక్కీ ప్రసంగంపై రాహుల్ మండిపాటు!

Share It:

న్యూఢిల్లీ: ఫిక్కీ శతాబ్ది వేడుకలో భారత పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ప్రధాని వ్యాఖ్యలు వాస్తవానికి ఆయన ప్రభుత్వ ఆర్థిక వైఫల్యాలకు సంబంధించిన ‘సొంత అంగీకారం (కబూల్ నామా)’ అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

పెద్ద నోట్ల రద్దు, లోపభూయిష్టమైన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాల ద్వారా కేంద్ర ప్రభుత్వం చిన్న వ్యాపారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు) తీరని నష్టం కలిగించిందని ఆయన ఆరోపించారు. దేశంలో ఉపాధి కల్పనకు ఈ రంగాలే ప్రధాన వనరులని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

పారిశ్రామికవేత్తల ఆకలి ఎప్పటికీ తీరదని ప్రధాని అనడాన్ని ప్రస్తావిస్తూ, ఎవరి ఆకలి తీరడం లేదో దేశం మొత్తానికి తెలుసని వ్యాఖ్యానించారు. విమానాశ్రయాలు, ఓడరేవులు, గనులు, అడవులు, విద్యుత్తు, బొగ్గు, రోడ్లు వంటి రంగాలన్నింటినీ కొందరి చేతుల్లో పెట్టారని, వారు ఎన్ని ఉద్యోగాలు సృష్టించారని ఆయన ప్రశ్నించారు.

పెద్ద కార్పొరేట్ సంస్థలతో నిష్పక్షపాతంగా పోటీపడే చిన్న కంపెనీలను దెబ్బతీయడం ద్వారా ప్రభుత్వ విధానాలు పోటీతత్వాన్ని బలహీనపరిచాయని ఆయన విమర్శించారు. “గుత్తాధిపత్యం ఉద్యోగాలు సృష్టించదు; అది ధరలను పెంచి, మార్కెట్‌లో పోటీని నిర్మూలిస్తుంది,” అని రాహుల్‌ పేర్కొన్నారు.

సామాన్య ప్రజలకు హాని కలిగించిన విధానాల వల్ల ప్రధాని, ఆయన సన్నిహితులు మాత్రమే లబ్ధి పొందుతున్నారని ఆరోపించిన ఆయన, మోదీ వ్యాఖ్యలనే ఆయనకు వ్యతిరేకంగా తిప్పికొట్టారు.

ఫిక్కీ (FICCI) కార్యక్రమంలో ప్రేక్షకుల నుంచి తగినంతగా చప్పట్లు రాకపోవడంపై మోదీ చేసిన వ్యాఖ్యలను రాహుల్‌ తప్పుబట్టారు. ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపారులు, పేదలు, మధ్యతరగతి వర్గాలు, నిరుద్యోగ యువతలో ఏ ఒక్కరూ ప్రశంసించే స్థితిలో లేరని ఆయన అన్నారు.

“మీ విధానాలు చప్పట్లు కొట్టేవారిని ఎవరినీ మిగల్చలేదు — పారిశ్రామికవేత్తలను కాదు, చిన్న వ్యాపారులను కాదు, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలను కాదు, నిరుద్యోగ యువతను కాదు. మీకు మిగిలి ఉన్న అనుచరుల చేతనే మీ చప్పట్లు, మీ పళ్ళెం కొట్టించుకోండి,” అని రాహుల్ గాంధీ ఘాటుగా వ్యాఖ్యానించారు.

మొత్తంగా భారత కార్పొరేట్ రంగానికి ప్రధానమంత్రి చేసిన విజ్ఞప్తి… రాజకీయ వాద ప్రతివాదాలకు దారితీసింది. ఆర్థిక వ్యవస్థలోని లోపాలకు బాధ్యతను నరేంద్ర మోదీ పారిశ్రామికవేత్తలపైకి మళ్లిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.