Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

వృద్ధుల హక్కులకు ఢిల్లీ హైకోర్టు బాసట!

Share It:

న్యూఢిల్లీ: వృద్ధుల ఇష్టానికి వ్యతిరేకంగా పిల్లలతో కలిసి వారిని ఇంట్లో నివసించమని బలవంతం చేయలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా వేధింపులు, దుష్ప్రవర్తన ఆరోపణల నేపథ్యంలో 85 ఏళ్ల వృద్ధుడి స్వార్జిత ఇంటిని నాలుగు వారాల్లోగా ఖాళీ చేయాలని అతని పెద్ద కుమారుడు, కోడలిని ఆదేశించింది.

నవంబర్ 20న ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అమిత్ మహాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలతో సంబంధాలు న్యాయపోరాటం, పోలీసు జోక్యం అవసరమయ్యే స్థాయికి క్షీణించినప్పుడు, ప్రతి వృద్ధుడికీ తన సొంత ఇంట్లో ప్రశాంతంగా, గౌరవంగా జీవించే హక్కు ఉంటుందని తెలిపారు.

“85 ఏళ్ల పిటిషనర్ తన సొంత ఇంట్లో ప్రశాంతంగా, గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉన్నారు” అని ధర్మాసనం పేర్కొంది. కుమారుల మధ్య ఉన్న వ్యాపార వివాదాలను సాకుగా చూపి, వృద్ధుడి ఆరోపణల వాస్తవికతను ప్రశ్నించడం లేదా చట్టబద్ధమైన రక్షణను నిరాకరించడం సరికాదని తేల్చి చెప్పింది.

కేసు నేపథ్యం
భరణంతో పాటు తన స్వార్జిత ఆస్తి నుంచి పెద్ద కుమారుడు, కోడలిని ఖాళీ చేయించాలని కోరుతూ ఆ వృద్ధుడు ‘తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమ చట్టం, 2007’ కింద జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. అయితే, దుష్ప్రవర్తన, వేధింపుల ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ మేజిస్ట్రేట్ ఫిర్యాదును మూసివేశారు. కుమారుల మధ్య వ్యాపార తగాదాల కోసం చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ అభిప్రాయపడ్డారు.

ఈ ఉత్తర్వులను హైకోర్టు తప్పుబట్టింది. కుటుంబాలలో జరిగే వేధింపులకు సంబంధించిన ఘటనలు… తలుపు వెనుక జరుగుతుంటాయని, వాటిని స్వతంత్ర సాక్ష్యాలతో నిరూపించడం కష్టమని న్యాయమూర్తి గుర్తు చేశారు.

ఖాళీ చేయించే ఆదేశాలు ఇచ్చేందుకు వయోవృద్ధ పిటిషనర్ కఠినమైన, నిశ్చయాత్మక సాక్ష్యాలు సమర్పించాల్సిన అవసరం చట్టంలో లేదని హైకోర్టు స్పష్టం చేసింది. “తన ఆస్తి నుంచి పిల్లలను ఖాళీ చేయించాలనుకునే వృద్ధుడు, వారు తనను సరిగా చూసుకోలేదని నిరూపించాల్సిన పనిలేదు. ప్రశాంతంగా, గౌరవంగా బతికేందుకు తన ఆస్తికి రక్షణ అవసరమని చూపిస్తే సరిపోతుంది” అని ధర్మాసనం వివరించింది.

పోలీసులకు ఆదేశాలు
నాలుగు వారాల్లోగా ఇంటిని ఖాళీ చేయాలని కుమారుడు, కోడలిని ఆదేశించిన హైకోర్టు.. ఈ ఆదేశాల అమలుకు అవసరమైతే వృద్ధుడికి తగిన సహాయం అందించాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ (SHO)కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

వివాదానికి కారణమిదే
2008లో తన చిన్న కుమారుడి వివాహం జరిగినప్పటి నుంచి ప్రత్యామ్నాయ వసతి చూసుకొని ఇల్లు ఖాళీ చేయాలని పెద్ద కుమారుడు, కోడలిని కోరుతున్నట్లు పిటిషనర్ తెలిపారు. వారు ఇల్లు ఖాళీ చేయకపోగా, తన పట్ల ప్రవర్తన మరింత దిగజారిందని, ఆర్థిక సహాయం కూడా నిలిపివేశారని ఆరోపించారు. 2020లో తన భార్య మరణించిన తర్వాత వేధింపులు మరింత తీవ్రమయ్యాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.