న్యూఢిల్లీ: భారత ఉత్పత్తులపై 25 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించాలన్న అమెరికా ప్రతిపాదనను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. దేశంలోని ఏ పారిశ్రామిక రంగంలోనూ “నిర్మాణాత్మక మిగులు ఉత్పత్తి సామర్థ్యం” ఉందన్న అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయంఆరోపణలను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. వాణిజ్యపరమైన సమస్యలను ఏకపక్ష సుంకాలతో కాకుండా, ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది.
తమ దేశంలోని తయారీ రంగంలోగానీ, మరే ఇతర రంగంలోగానీ అవసరానికి మించిన మిగులు ఉత్పత్తి సామర్థ్యం లేదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. అమెరికా ప్రతిపాదనపై వెంటనే ప్రతీకార సుంకాలు విధించకుండా, వాషింగ్టన్‌తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని (BTA) వీలైనంత త్వరగా ఖరారు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు భారత్ తెలిపింది.
1974 నాటి వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద యూఎస్టీఆర్ జారీ చేసిన నోటీసును ప్రభుత్వం పరిశీలిస్తోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. 25% నుంచి 17%కి తగ్గింపు అవకాశం: భారత్‌పై 25 శాతం వరకు సుంకాలు విధించాలని అమెరికా ప్రతిపాదించినప్పటికీ, ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే ఆ రేటును 17 శాతానికి తగ్గించే అవకాశం ఉందని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ పేర్కొన్నారు.
16 దేశాలపై దర్యాప్తు: మార్చి 11, 2026న ప్రారంభమైన ఎనిమిది నెలల సెక్షన్ 301 విచారణలో భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, బంగ్లాదేశ్, జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, మలేసియా, సింగపూర్, స్విట్జర్లాండ్, తైవాన్, థాయ్‌లాండ్, వియత్నాం, కంబోడియా తదితర దేశాల వాణిజ్య విధానాలను అమెరికా సమీక్షించింది (మెక్సికో, నార్వేలను మినహాయించింది).
ఇతర దేశాలపై సుంకాలు: చైనాపై అదనపు సుంకాలతో కలిపి మొత్తం భారం 40% నుంచి 45% వరకు చేరేలా ప్రతిపాదనలు ఉండగా, వియత్నాంపై 35%, ఈయూ/జపాన్/దక్షిణ కొరియా/తైవాన్/స్విట్జర్లాండ్‌పై 15%, సింగపూర్‌పై 10% సుంకాల అంశం ప్రస్తావనకు వచ్చింది.
కాగా, 25శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా నిర్ణయంతో ఔషధాలు (ఫార్మా), ఉక్కు, ఐటీ, సోలార్ ఎనర్జీ, వైద్య పరికరాలు వంటి రంగాల్లో భారత ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ సుంకాలు తక్షణమే అమల్లోకి రావు. జనవరి 5లోగా అభిప్రాయ సేకరణ, జనవరి 25న బహిరంగ విచారణ అనంతరమే తుది నిర్ణయం తీసుకుంటారు.

