న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భారతీయ జనతా పార్టీ (BJP)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియ బీజేపీ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.
డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని భావిస్తుండగా, దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై ఘాటుగా స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ప్రతిపాదిత చట్టాన్ని ఆమోదింపజేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గురువారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, ఈ ప్రతిపాదనను “రాజ్యాంగాన్ని అవమానించడమే కాకుండా, దానిపై దాడి చేయడమే” అని ఆయన విమర్శించారు.
ఈ వివాదానికి సంబంధించిన నేపథ్యాన్ని వివరిస్తూ, 2026 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు సాయంత్రం ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లులను బహిర్గతం చేసిందని, ఆ తర్వాత ఏప్రిల్ 17 రాత్రి పార్లమెంటులో ఆ బిల్లులు వీగిపోయాయని గుర్తు చేశారు. ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమై, రాజ్యాంగపరంగా అవసరమైన మద్దతును పొందలేకపోయిన ఆ బిల్లులకు “తగిన గతే పట్టిందని” ఆయన పేర్కొన్నారు.
“2026 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు సాయంత్రం మోదీ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లులను బయటపెట్టింది, కానీ 2026 ఏప్రిల్ 17 రాత్రికి అవి వీగిపోయాయని” రమేష్ Xలో రాసుకొచ్చారు. అధికార పక్షం ఆ తర్వాత 105 రోజుల పాటు అవసరమైన సంఖ్యాబలాన్ని ఎలాగైనా సాధించేందుకు ప్రయత్నించిందని ఆరోపించిన ఆయన, ఈ ప్రక్రియను “ఆపరేషన్ లోటస్” అని అభివర్ణించారు.
“ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవం రోజున, 105 రోజుల ‘ఆపరేషన్ లోటస్’ తర్వాత, రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేయడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లభిస్తుందనే ఆశతో మోదీ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలను ప్రకటించింది” అని ఆయన పేర్కొన్నారు. ప్రతిపాదిత రాజ్యాంగ మార్పుల వెనుక ప్రభుత్వ ఉద్దేశాలను ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తూనే ఉన్న తరుణంలో కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలు వెలువడ్డం గమనార్హం.
