హైదరాబాద్: అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం A171 దురదృష్టకర ప్రమాదం సంభవించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, విమానంలో 230 మందికి పైగా ప్రయాణికులు, 12 మంది ఉన్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ విఫాద సంఘటనలో మృతిచెందిన ప్రయాణీకులు, సిబ్బంది ఆత్మ శాంతి కోసం సీఎం ప్రార్థనలు చేశారు. బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి త్వరితగతిన సహాయ చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కాగా, ఈ ఘోర విషాదంపై ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. ఏఐ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో (ఏఐ171) ప్రయాణించిన 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించింది. ప్రమాదం నుంచి ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని, ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాయడని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపింది.
మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా.. 12 మంది సిబ్బంది ఉన్నారని పేర్కొంది. వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ వాసులు, కెనడా దేశస్థుడు ఒకరు చొప్పున ఉన్నారని తెలిపింది. గాయపడిన వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడని, అతడు చికిత్స పొందుతున్నాడని తెలిపింది. అయితే విమానం మెడికల్ కాలేజీ భవనంపై కూలిపోవడంతో 24 మంది మెడికోలు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది.
కాగా, విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఎయిర్ ఇండియా ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో అండగా ఉంటామని వెల్లడించింది. మృతులకు కోటిరూపాయల పరిహారం చెల్లిస్తామని పేర్కొంది.