ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలో బిల్డర్లు ‘హౌసింగ్ జిహాద్’ కుట్ర పన్నారని, హిందువులకు ఉద్దేశించిన ఇళ్లను ముస్లింలకు కేటాయించారని శివసేన రాజకీయ నాయకుడు సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. నగరంలోని రెండు మురికివాడల పునరాభివృద్ధి ప్రాజెక్టులలో, కొంతమంది బిల్డర్లు ముస్లింలకు 51 కొత్త ఇళ్లను కేటాయించారని పిటిఐ నివేదిక తెలిపింది.
“ముస్లింలు హిందువుల కోసం ఉద్దేశించిన ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు, ఇప్పుడు మొత్తం ప్రాంతం ముస్లింల ఆధిపత్యంలో ఉంది” అని ఆయన ఆరోపించారు. ఈ ఇళ్లలో 30 ఇళ్ళు అబ్దుల్ ఘని కితాబుల్లా అనే బిల్డర్ కుమారుల పేరిట కేటాయించారని ఆయన అన్నారు.
శ్రీ శంకర్ మురికివాడల పునరాభివృద్ధి పథకం కింద, ఈ ప్రాంతంలో ఆరు ముస్లిం కుటుంబాలతో 67 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. పునరాభివృద్ధి తర్వాత, ఇళ్ల సంఖ్య 123కి పెరిగిందని, ముస్లింలకు అదనపు యూనిట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు.
ఈ ప్రాంతంలో గతంలో గణేష్ ఆలయం, దేవి మండపం కోసం బహిరంగ ప్రదేశం ఉండేవని, కానీ ఇప్పుడు రెండింటినీ తొలగించి మదర్సా నిర్మించారని నిరుపమ్ ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలకు ఇంకా అధికారిక నిర్ధారణ లేదు.