హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే వ్యవసాయ సీజన్ నుంచిఉపగ్రహ ఆధారిత పంట ప్రణాళికను అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో పంట విస్తీర్ణాన్ని అంచనా వేయడానికి, అలాగే మార్కెటింగ్, డిమాండ్, ఉత్పత్తి, సరఫరా, నిల్వపై నిర్ణయాలు తీసుకోవడానికి ఉపగ్రహ చిత్రాలను (శాటిలైట్ ఇమేజింగ్) ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈమేరకు సచివాలయంలో జరిగిన ఒక సమావేశంలో మంత్రి ఉపగ్రహ ఆధారిత పంట మ్యాపింగ్‌ను సమీక్షించారు. ఈ సమావేశానికి వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు హాజరయ్యారు.
నేల పరిస్థితులు, నీటి లభ్యత, పంట స్థితిని అంచనా వేయడానికి, పంట విస్తీర్ణం, సరళిపై సమాచారాన్ని అందించడానికి ఈ సాంకేతికత సహాయపడుతుందని మంత్రి అన్నారు. అంతేకాదు మ్యాపింగ్ ద్వారా సాగు ఖర్చులను తగ్గించడంతోపాటు దిగుబడులను పెంచే అవకాశాలున్నాయి. భూసార స్థితి, నీటి లభ్యత, పంటల ఆరోగ్యాన్ని ముందుగానే అంచనా వేయొచ్చు. రైతులు ఏ పంటను ఎక్కడ, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే కచ్చితమైన సమాచారంతో వారికి మెరుగైన ధరలు అందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అటవీ భూముల్లో యూకలిప్టస్, సుబాబుల్ వంటి పంటల వివరాలను సేకరించడానికి, సర్వే నంబర్ల ఆధారంగా పంట విస్తీర్ణాన్ని అంచనా వేయడంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ, అటవీ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు కూడా ఆయన తెలిపారు.


