హైదరాబాద్: నగర జీవితాన్ని ఎన్నడూ చూడని గిరిజన బృందం ఒకటి, ‘ఆదివాసి పర్యాటక అనుభవ కార్యక్రమం’లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌కు రానుంది. ‘రివర్స్ టూరిజం’ కార్యక్రమం కింద జరిగే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉదయం 6 గంటలకు ఉట్నూరులో జెండా ఊపి ప్రారంభించారు.
ఈ ఆదివాసి బృందం మధ్యాహ్నం 12:30 గంటలకు తారామతి బారాదరికి చేరుకుంటుంది. అక్కడ వారితో సంభాషణ కార్యక్రమం, అనంతరం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర రాజధానిలోని సాంస్కృతిక, వారసత్వ సంపదను గిరిజన యాత్రికులకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అధికారులు తెలిపారు.
గిరిజన పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పర్యాటకులను అడవికి తీసుకెళ్లడమే కాకుండా అడవి బిడ్డలను నగరానికి తీసుకొచ్చి ఇక్కడి చారిత్రక, వారసత్వ సంపదను చూపేలా ఈ టూర్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అటవీ ప్రాంతాల్లోని మారుమూల గూడేలు, గ్రామాల్లో నివసించె ఆదివాసీలు, గిరిజనులను ఎంపికచేసి వారిని హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. మొదటి విడతలో సుమారు 200 మందికి ఈ అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. పర్యాటక శాఖ ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది.
ఆదివాసీ, గిరిజనుల కోసం హైదరాబాద్‌కు ఉచితంగా మెట్రోపాలిటన్ ఎక్స్పోజర్ టూర్ ఏర్పాటు చేయనున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇది వరకే ప్రకటించారు. నగర జీవితం, హైదరాబాద్‌లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి గురించి ఆదివాసీ, గిరిజనులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
మారుమూల గూడేల్లోని గిరిజన తెగలకు, ఆధునిక ప్రపంచానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని జూపల్లి పేర్కొన్నారు. ఈ ఎక్స్పోజర్ టూర్ కోసం ఆదివాసీలను వారి గ్రామాల నుంచి నగరానికి ప్రత్యేక బస్సుల్లో ఎటువంటి ఖర్చు లేకుండా తీసుకెళ్తున్నామని మంత్రి చెప్పారు.
