హైదరాబాద్: “హైదరాబాద్ మరో ఢిల్లీగా మారడం మాకు ఇష్టం లేదు,” అని కేబీఆర్ జాతీయ పార్క్ ప్రధాన ద్వారం వెలుపల కొనసాగుతున్న హెచ్-సిటీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు.
కాగా, భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో చేపట్టిన ‘హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ (హెచ్-సిటీ) ప్రాజెక్టు పనులు… పార్క్ చుట్టూ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణాలకుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ‘ స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన చేపట్టారు.
‘సేవ్ కేబీఆర్’ అంటూ నినాదాలు చేస్తూ, ఇటీవల అనేక చెట్లను కూకటివేళ్లతో సహా పెకిలించారని ఆరోపిస్తూ, పర్యావరణంపై దాని ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
‘సిటిజన్స్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ కేబీఆర్ నేషనల్ పార్క్’ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం… హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా పార్క్ 5 కిలోమీటర్ల పరిధిలో ఆరు బహుళస్థాయి ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మించనున్నారు. దీనికి 60,000 మెట్రిక్ టన్నుల సిమెంట్, 5,000 మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరమవుతుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా 1,942 చెట్లను కూల్చివేయనున్నారు. దీనివల్ల ఉష్ణోగ్రత రెండు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చని, ఇది హైదరాబాద్ గాలి నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ ప్రకటన తెలిపింది.
ఈ ఏడాది తెలంగాణను తీవ్రమైన వడగాలులు చుట్టుముట్టాయి. భూగర్భ జలమట్టాలు తగ్గిపోతున్నాయనే నివేదికలు, ఉష్ణోగ్రతను నియంత్రించే దాని సహజ సామర్థ్యాన్ని మరింత పరిమితం చేస్తున్నాయి. రామగుండం, మంచిర్యాల, కొత్తపేట, ఆదిలాబాద్ ప్రపంచంలోని అత్యంత వేడి ప్రదేశాలలో మొదటి 100 స్థానాలలో నిలిచాయి. ఈ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 43 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి.
“ఉదయం, సాయంత్రం వేళల్లో అనేక కుటుంబాలు నాణ్యమైన సమయాన్ని గడిపే ప్రధాన ప్రదేశాలలో కేబీఆర్ పార్క్ ఒకటి. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ గాలి నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుందని” నిరసన తెలుపుతున్న ఒక స్థానికుడు అన్నారు. “హైదరాబాద్ మరో ఢిల్లీగా మారడం మాకు ఇష్టం లేదు,” అని ఆయన అన్నారు.

