కోల్‌కత: బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన వారి మధ్య స్పష్టమైన మతపరమైన భేదాన్ని చూపుతూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కొత్త వివాదాన్ని రేకెత్తించారు. బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన హిందువులను హింసకు గురైన శరణార్థులుగా, ముస్లింలను అక్రమ చొరబాటుదారులుగా పరిగణించి, వారిని దేశం నుండి బహిష్కరించాలని ఆయన వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు.
ఈమేరకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ…బంగ్లాదేశ్ హిందువులను, ముస్లింలను ఒకే వర్గంగా చూడలేమని శర్మ నొక్కి చెప్పారు. “బంగ్లాదేశీ ముస్లింలు ఒక వర్గం, బంగ్లాదేశ్ హిందువులు మరొక వర్గం. ఇవి రెండు వేర్వేరు వర్గాలు,” అని ఆయన ఆ రెండు వర్గాల మధ్య ఉన్న రాజకీయ, చట్టపరమైన విభేదాలను ఎత్తి చూపుతూ పేర్కొన్నారు.
ఈ రెండు వర్గాలను ఒకేలా చూడటం అపోహలకు దారితీస్తుందని అస్సాం సీఎం అన్నారు. ఈమేరకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను విమర్శించారు. బంగ్లాదేశ్‌లో మతపరమైన హింస నుండి పారిపోతున్న హిందూ వలసదారులు, 2019 పౌరసత్వ సవరణ చట్టం (CAA) ప్రకారం భారత పౌరసత్వానికి అర్హులని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి విరుద్ధంగా, ముస్లిం వలసదారులను అక్రమ చొరబాటుదారులుగా పరిగణిస్తారని, వారిని గుర్తించి దేశం నుండి బహిష్కరించాలని ఆయన అన్నారు.
2014 డిసెంబర్ 31న లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ముస్లిమేతర మైనారిటీలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు పౌరసత్వం పొందేందుకు CAA ఒక మార్గాన్ని అందిస్తుంది.
బీజేపీ వైఖరిని సీఎం హిమంత శర్మ పునరుద్ఘాటించారు: “మేము చొరబాటుదారులు అన్నప్పుడు, బంగ్లాదేశీ ముస్లింల గురించే మాట్లాడుతున్నాం, హిందువుల గురించి కాదు. హిందువులు శరణార్థులు, చొరబాటుదారులు కాదు అని ఆయన అన్నారు.”
బంగ్లాదేశీ ముస్లింల అనియంత్రిత చొరబాటు అస్సాంలో జనాభా మార్పుకు కారణమవుతోందని, జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తోందని ఆయన హెచ్చరించారు. అస్సాంలో ముస్లిం జనాభా దాదాపు 40 శాతానికి చేరుకుందని శర్మ పేర్కొంటూ, దీనిపై అణచివేత కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గత 24 గంటల్లో 20 మంది అక్రమ బంగ్లాదేశీయులను వెనక్కి పంపినట్లు, ఇటీవలి నెలల్లో 400 మందికి పైగా బహిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు.
బీజేపీ అనుసరిస్తున్న విధానం “నిర్ణయాత్మక రాజకీయం” అని హిమంత శర్మ అభివర్ణించారు. ముఖ్యంగా అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లోకి అక్రమ చొరబాట్లను గట్టిగా ఎదుర్కొంటూనే, హింసకు గురవుతున్న హిందూ శరణార్థులను కాపాడటమే దీని లక్ష్యమని ఆయన అన్నారు. భారతదేశం అంతటా విస్తృత పరిణామాలకు దారితీసే జనాభా మార్పులను టీఎంసీ ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో వలసలు, పౌరసత్వం వంటి సున్నితమైన అంశాలు నెలకొన్న నేపథ్యంలో, తీవ్రమైన రాజకీయ వాదోపవాదాల నడుమ ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. CAA, సరిహద్దు భద్రతకు సంబంధించి బీజేపీకి ఉన్న దీర్ఘకాలిక వైఖరికి అస్సాం సీఎం వ్యాఖ్యలు అనుగుణంగా ఉన్నప్పటికీ, వలసదారులను మత ప్రాతిపదికన విభజించడం ద్వారా లౌకిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నట్లు కనిపించడంతో అవి విమర్శలను ఎదుర్కొన్నాయి.

