న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలలో విస్తృతంగా “ఓటు దొంగతనం” (ఓటు చోరీ) జరిగిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. లోక్‌సభలో ఉన్న 240 బిజెపి ఎంపీల్లో దాదాపు ప్రతి ఆరవ ఎంపి ఓటు చోరీ ద్వారా సీటు దక్కించుకున్నారు’ అని రాహుల్ ఎక్స్‌లో పోస్టు చేశారు. “ఓటు దొంగతనం ద్వారా, కొన్నిసార్లు వ్యక్తిగత సీట్లను దొంగిలిస్తారు, మరికొన్నిసార్లు మొత్తం ప్రభుత్వాన్నే దొంగిలిస్తారని” ఆయన అన్నారు. అలాంటి ఓటు చోరీకి పాల్పడే వారిని గుర్తించడం కష్టమేమీ కాదు. బీజేపీ పరిభాషలో చెప్పాలంటే వారిని ‘ఘుస్పేథియా’ (చొరబాటు దారులు) అని పిలవాలా? అంటూ వ్యంగంగా ప్రశ్నించారు.
ఉదాహరణకు హర్యానా సంగతేంటి? అక్కడ మొత్తం ప్రభుత్వమే ఒక ‘ఘుస్పేథియా’. ఓటర్ల జాబితాలను, ఎన్నికల ప్రక్రియను వక్రీకరించడానికి వారు తమ గుప్పిట్లో ఉంచుకునే, తమకు అనుకూలంగా మలచుకునే సంస్థలే స్వయంగా ‘రిమోట్ కంట్రోల్’గా మారుతున్నాయి. వారి (బిజెపి నేతలు) అసలు భయం సత్యమే. ఎందుకంటే, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే, వారు ఈ రోజు 140 సీట్లు కూడా గెలుచుకోలేరు అని రాహుల్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయాలను ప్రజా తీర్పు ‘చోరీ’ అయిందని రాహుల్ గాంధీ అభివర్ణించిన ఒక రోజు తర్వాత ఈ తాజా విమర్శనాస్త్రాలు వెల్లువెత్తాయి. ఇటువంటి మార్గాల ద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని ‘నాశనం’ చేయాలనే తమ లక్ష్యాన్ని కాషాయ పార్టీ ముందుకు తీసుకువెళ్తోందని ఆయన ఆరోపించారు.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తో కాంగ్రెస్‌కు సాంప్రదాయ వైరం ఉన్నప్పటికీ, బెంగాల్లో టీఎంసీ ఓటమిపై సంబరపడొద్దని గాంధీ పార్టీ సహచరులను, ఇతరులను కోరారు. “చిల్లర రాజకీయాలను పక్కన పెట్టండి.
ఇది ఒక పార్టీకి లేదా మరో పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది భారతదేశానికి సంబంధించిన విషయం,” అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను పక్షపాత ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే ఒక పెద్ద పోరాటంగా ఆయన అభివర్ణించారు.
సోమవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో, బీజేపీ ఇంతకుముందు పశ్చిమ బెంగాల్లో టీఎంసీని అధికారం నుంచి తొలగించి, అస్సాంలో వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. కాగా, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు భారతదేశ ఎన్నికల ప్రక్రియ సమగ్రతపై కొనసాగుతున్న రాజకీయ చర్చను మరింత వేడిక్కించాయి.
