బెంగళూరు: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తన శత వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆ సంస్థను రిజిస్టర్ చేసుకోవాలని, దాని చట్టపరమైన హోదాను స్పష్టం చేయాలని, అలాగే దాని నిధుల మూలాలు, ఆదాయ-వ్యయాలు,ఆస్తులను వెల్లడించాలని కోరారు. ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్‌కు రాసిన లేఖలో, ఆర్ఎస్ఎస్ తప్పనిసరిగా పారదర్శకతను, రాజ్యాంగబద్ధమైన జవాబుదారీతనాన్ని పాటించాలని ఖర్గే పేర్కొన్నారు.
“భారతదేశం, విదేశాలలో 60,000కు పైగా శాఖలు, కోట్లాది స్వయంసేవకులు ఉన్నారని చెప్పుకుంటున్న ఒక సంస్థ… శతాబ్ధి ఉత్సవాలను కేవలం వేడుకలకే కాకుండా ఆత్మపరిశీలన కోసం కూడా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆత్మావలోకం చేసుకుని లాంఛనంగా సంస్థను రిజిస్టర్ చేయించుకోవాలని, ఆర్థిక వనరులు, కార్యకలాపాలను వెల్లడించాలని, అర్హమైన పన్నులన్నీ చెల్లించాలని, భారత చట్టాల ప్రకారం పారదర్శకత, జవాబుదారీ కలిగిన సంస్థగా కార్యకలాపాలను నిర్వహించాలని కోరారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడైన ఖర్గే, ఈ సందర్భంగా ఆ సంస్థ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన అఖిల్ భారతీయ ప్రతినిధి సభ (ABPS) 2025–26 కర్ణాటక నివేదికను ఉటంకించారు. ఆ నివేదిక ప్రకారం, కర్ణాటకలో ఆర్ఎస్ఎస్కు 4,127 రోజువారీ శాఖలు, 1,389 వారపు మిలన్లు, 60 నెలవారీ మండలిలు ఉన్నాయి. ఇది దాదాపు 20 లక్షల మంది పాల్గొన్న 2,194 సమాజ్వోత్సవాలను నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా యూనిఫాం ధరించిన పాల్గొనేవారితో 562 రూట్ మార్చ్‌లను నిర్వహించింది.
ఇంత పెద్ద సంస్థాగతమైన ఉనికి ఉన్న ఒక సంస్థను ప్రైవేటు సంస్థగానో, అనధికార ఏర్పాటుగానో భావించలేమని ఆ లేఖలో ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. “అంతటి భారీ స్థాయి కలిగిన ఒక సంస్థ, చట్టపరమైన సంస్థగా లేదా ‘వ్యక్తుల సమూహం’గా (body of individuals) అధికారికంగా నమోదు కాకుండానే ఎలా కొనసాగుతుందో వివరించాలనిమేము RSSను కోరుతున్నాము అని ఖర్గే లేఖలో రాసారు.”
పౌరులు, కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు (NGOలు), ట్రస్టులు, దేవాలయాలు, కంపెనీలు నమోదు చేసుకోవడం, వివరాలు వెల్లడించడం, చట్టాన్ని పాటించడం తప్పనిసరి అయినప్పుడు, RSSకు మాత్రం ఎందుకు మినహాయింపు ఉండాలని ఆయన ప్రశ్నించారు.
“ఈ నేపథ్యంలో RSS దాని చట్టపరమైన హోదా, సంస్థాగత నిర్మాణం, కార్యవర్గ సభ్యులు, అధీకృత ప్రతినిధుల వివరాలు, విరాళాలు-సహకారాలు-ఆదాయ వనరులు, అలాగే వ్యయం, ఆస్తుల వివరాలు వెల్లడించాలని” ఆ లేఖ పేర్కొంది.
చట్టం ప్రకారం పన్నులు చెల్లిస్తున్నారా లేదా, అధికారిక నమోదు లేకుండా కార్యకలాపాలు నిర్వహించడానికి ఉన్న చట్టపరమైన ఆధారం ఏమిటి, ఇంత భారీ స్థాయిలో పనిచేయడానికి అనుసరిస్తున్న రాజ్యాంగపరమైన విధానం ఏమిటి అనే అంశాలపై ఆయన స్పష్టత కోరారు.దేశభక్తి, క్రమశిక్షణ, బాధ్యత గురించి తరచుగా ప్రస్తావించే సంస్థ, పారదర్శకత, నిబంధనల పాటించడం, రాజ్యాంగం పట్ల గౌరవం చూపడం ద్వారా ఆ విలువలను ఆచరణలో కూడా నిరూపించుకోవాలని ఖర్గే అన్నారు.
తాము మాత్రం ఆ ప్రమాణాల నుండి మినహాయింపు పొందుతూ, పౌరులు మాత్రం నిబంధనలు పాటించాలని RSS ఆశించకూడదని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే అభిప్రాయపడ్డారు. తన లేఖపై అధికారికంగా స్పందించాలని ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కోరారు.
దీనిపై కర్ణాటక బీజేపీ విభాగం వెంటనే స్పందించింది. తొలిసారి హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉత్సాహంలో, తన నాయకుడు రాహుల్ గాంధీ మెప్పు పొందేందుకు ఖర్గే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ఆ పార్టీ వ్యాఖ్యానించింది.

