హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను తేలికగా తీసుకోవద్దని కాంగ్రెస్ నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నిజమైన ఓటర్ల హక్కులను కాపాడేందుకు చేపట్టే ఈ కీలక ప్రక్రియలో నిర్లక్ష్యాన్ని పార్టీ సహించదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా నిన్న ప్రారంభమయిన ఈ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు,నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను ఆయన ఆదేశించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్న జూమ్ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
తమ నియోజకవర్గాల్లోని నాయకులు ఎస్‌ఐఆర్ ప్రక్రియకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న వార్తలపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణపై SIR ప్రభావం గురించి తనకు ఇప్పటికే జిల్లా స్థాయి నివేదికలు అందాయని, ఇటువంటి నిర్లక్ష్యం వల్ల పార్టీకి నష్టం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఓటర్ల ధృవీకరణ ప్రక్రియ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ సర్పంచ్‌లకు ఆయన సూచించారు. జిల్లా స్థాయి అవగాహన సమావేశాల్లో నాయకుల పనితీరుకు సంబంధించిన పూర్తి సమాచారం పార్టీ వద్ద ఉందని ఆయన తెలిపారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిని సృష్టించవద్దని నాయకులను హెచ్చరించారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా పేదలు, బలహీన వర్గాలు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఓటును కాపాడటమే పార్టీ ప్రధాన లక్ష్యం కావాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడం సమాజంలోని బలహీన వర్గాలకు అన్యాయం చేయడమేనని ఆయన నొక్కి చెప్పారు. రాబోయే 10 రోజుల్లో పనితీరును మెరుగుపరచుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని నాయకులను ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇక ఎమ్మెల్యేల పనితీరును పార్టీ నిశితంగా పర్యవేక్షిస్తోందని, సమర్థవంతంగా పనిచేయని ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తామని ఆయన స్పష్టం చేశారు.
