హైదరాబాద్: ధరణి, భూ-భారతి పోర్టల్స్‌కు సంబంధించి వెలుగులోకి వచ్చిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోందని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ తెలిపారు. సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ అంశంపై సమగ్ర సమీక్ష నిర్వహించారని ఆయన వెల్లడించారు. ధరణి పోర్టల్‌కు సంబంధించి జరుగుతున్న ఫోరెన్సిక్ ఆడిట్ సమీక్షలో కొన్ని ఆందోళనకరమైన అంశాలు మంత్రి దృష్టికి వచ్చాయని లోకేష్ కుమార్ పేర్కొన్నారు.
ధరణి పోర్టల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్‌లో అంతర్గత భద్రతా లోపాలు ఉన్నట్లు గుర్తించామని, దుండగులు ఈ బలహీనతలను ఆసరాగా చేసుకుని నిర్దిష్ట మాడ్యూల్స్ ద్వారా అనధికారిక నమోదు (unauthorized entries) చేశారని ఆయన వివరించారు. ధరణి పోర్టల్ మాదిరిగానే అదే సాంకేతిక నిర్మాణాన్ని (technology architecture) అనుసరించడం వల్ల, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) అభివృద్ధి చేసిన భూ-భారతి పోర్టల్ కూడా అటువంటి లోపాలకు గురయ్యే అవకాశం ఉందని లోకేష్ తెలిపారు. ధరణి పోర్టల్ కోసం మాడ్యూల్స్‌ను మొదట అభివృద్ధి చేసిన వ్యక్తుల ప్రమేయం కూడా ఇందులో ఉండవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అనుమానిస్తోంది.
ఈ నేపథ్యంలో, బాధ్యులను గుర్తించడం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలను సిఫార్సు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని లోకేష్ ప్రకటించారు. ఈ కమిటీ మిక్కిలినేని మను చౌదరి (కలెక్టర్, మేడ్చల్-మల్కాజిగిరి), ప్రతీక్ జైన్ (కలెక్టర్, సంగారెడ్డి), అనుదీప్ దురిశెట్టి (జాయింట్ సెక్రటరీ, ఐటీ & కమ్యూనికేషన్స్ శాఖ), హర్ష వర్ధన్ (తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో), అపూర్వ్ చౌహాన్ (ప్రాజెక్ట్ డైరెక్టర్, CMRO), మంద మకరంద్ (ప్రాజెక్ట్ ఆఫీసర్, ITDA, ఉట్నూర్), ఎ. సంపత్ (DSP, తెలంగాణ CIB, సైబర్ క్రైమ్స్), ఎం. సుభాషిని (DIG, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ), ఎ. శ్రీనివాస సుబ్బారావు (సీనియర్ డైరెక్టర్ – IT, NIC) సభ్యులుగా నియమించారు.
మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు, అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే సరికొత్త సిస్టమ్ ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేయాలని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌ను కోరినట్లు తెలిపారు. భూ రికార్డుల భద్రత, సమగ్రత, పారదర్శకత విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కమిటీ 15 రోజుల్లోగా ప్రభుత్వానికి తన నివేదికను సమర్పిస్తుందని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

