న్యూఢిల్లీ: వాట్సాప్ ప్రతిపాదిత యూజర్‌నేమ్ ఫీచర్ వల్ల నకిలీ ఖాతాలు, మోసాలు, ఇతర ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళనల నేపథ్యంలో, ఈ ఫీచర్‌కు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఆ వర్గాల సమాచారం ప్రకారం… మెటా యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌కు, ఈ ఫీచర్ వివరాలు, దాని భద్రతా చర్యలు, దాని వల్ల సంభవించే పరిణామాల గురించి కోరుతూ కేంద్రం నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. చట్ట అమలు సంస్థలు కూడా ఈ ప్రతిపాదనను పరిశీలించే అవకాశం ఉంది.
ఒకవేళ ఈ ఫీచర్ వినియోగదారులకు ప్రమాదకరం అని తేలితే, దానిపై ఆంక్షలు విధించడానికి ప్రస్తుత చట్టపరమైన నిబంధనలు అనుమతిస్తాయో లేదో అధికారులు అంచనా వేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. “ఈ ఫీచర్‌పై ఉన్న సహేతుకమైన ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, చట్టబద్ధమైన అధికార సంస్థగా ప్రభుత్వం ఇది ఎలాంటి ప్రమాదాలను కలిగించదని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది,” అని ఒక వర్గం తెలిపింది.
వాట్సాప్ స్పందన సంతృప్తికరంగా లేకపోతే, ఈ ఫీచర్‌ను ప్రారంభించకుండా నిరోధించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. “వారు హామీ ఇచ్చి, ఒప్పించగలిగేంత వరకు ముందుకు వెళ్లలేరు,” అని ఒక వర్గం తెలిపింది. వాట్సాప్ ఈ ఫీచర్‌ను ఒక గోప్యతా సాధనంగా అభివర్ణించిందని కూడా ఆ వర్గం పేర్కొంది.
ఈ విషయంపై స్పందించాలని కోరుతూ వాట్సాప్‌కు పంపిన ఈమెయిల్‌కు ఆ సంస్థనుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రతిపాదిత ఫీచర్, వినియోగదారులు తమ ఫోన్ నంబర్లను షేర్ చేయడానికి బదులుగా యూజర్‌నేమ్‌లను ఉపయోగించి సంభాషించడానికి అనుమతిస్తుంది. ప్రభుత్వ వర్గాల ప్రకారం…మోసగాళ్లు వివిధ బ్యాంకులు, ప్రముఖ బ్రాండ్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు లేదా ప్రభుత్వ అధికారుల పేర్లను పోలిన (Look-alike) యూజర్‌నేమ్‌లను చాకచక్యంగా సృష్టించి సామాన్యులను డిజిటల్ లూటీ చేసే ప్రమాదం ఉందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నప్పుడు ప్రభుత్వం జాతీయ భద్రత లేదా ప్రజా భద్రత విషయంలో రాజీపడదని అధికారులు తెలిపారు.
భారతదేశంలో సుమారు 50 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్, ఈ ఏడాది చివర్లో ఈ ఫీచర్ అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే వినియోగదారులు యూజర్‌నేమ్‌లను రిజర్వ్ చేసుకోవడం ప్రారంభించవచ్చని ఈ వారం ప్రకటించింది. ఒక బ్లాగ్ పోస్ట్‌లో, ఫోన్ నంబర్లను పంచుకోవాల్సిన అవసరాన్ని తొలగించడం ద్వారా, ముఖ్యంగా గ్రూప్ చాట్‌లు, కొత్త పరిచయాలతో సంభాషణలలో వినియోగదారుల గోప్యతను మెరుగుపరచడానికి ఈ ఫీచర్ రూపొందించామని కంపెనీ పేర్కొంది.
అయితే, ఈ ప్రకటన పలువురు పారిశ్రామికవేత్తలు,సైబర్ సెక్యూరిటీ నిపుణుల నుండి విమర్శలను ఎదుర్కొంది. ఈమేరకు పేటీఎం వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ శేఖర్ శర్మ, తగిన ధృవీకరణ యంత్రాంగాలను ప్రవేశపెట్టకపోతే, ఒకేలా కనిపించే యూజర్‌నేమ్‌లు నకిలీ ఖాతాలు,మోసాలకు ప్రధాన మార్గంగా మారవచ్చని హెచ్చరించారు.
నాట్‌డేటింగ్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జస్వీర్ సింగ్ కూడా ఈ ప్రతిపాదనను ప్రశ్నిస్తూ, జవాబుదారీతనం ఖర్చుతో గోప్యత రాకూడదని అన్నారు. బ్రాండ్‌లు, ప్రభుత్వ సంస్థ, ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన యూజర్‌నేమ్‌ల దుర్వినియోగాన్ని నివారించడాని, గుర్తింపులను ధృవీకరించడానికి వాట్సాప్ ఎలా ఉద్దేశిస్తోందనే దానిపై సాంకేతిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
భారతీయ ఫిన్‌టెక్ సంస్థ అయిన క్రెడ్‌లో రూ. 8,550 కోట్లు (సుమారు 900 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టిన అనంతరం, మెటా ఆ సంస్థ వ్యవస్థాపకుడు కునాల్ షాను వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా నియమించిన కొద్దికాలానికే ఈ పరిణామం చోటుచేసుకుంది.
