వాషింగ్టన్: విదేశాల నుంచి దిగుమతి చేసుకునే జనరిక్ ఔషధాలపై భారీ సుంకాలను విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈమేరకు ఆగస్టు 2028 నుండి దిగుమతి చేసుకునే జెనరిక్ మందులపై భారీ సుంకాలు విధించనున్నారు. అటువంటి ఔషధ ఉత్పత్తుల తయారీని దేశీయంగా (అమెరికాలోనే) చేపట్టేలా ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికాకు అత్యధికంగా జెనరిక్ మందులను ఎగుమతి చేసే దేశం భారత్ కావడంతో, ఈ నిర్ణయం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈమేరకు తన ‘ట్రూత్ సోషల్’ (Truth Social) వేదిక ద్వారా స్పందిస్తూ, ఈ దశలవారీ సుంకాల విధానం ఆగస్టు ఒకటి నుండి అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. మొదటి రెండేళ్లపాటు దేశంలోకి వచ్చే అన్ని జెనరిక్ మందులపై సుంకం సున్నా శాతంగానే ఉంటుందని, మూడవ సంవత్సరంలో సుంకం 100 శాతానికి, ఆ తర్వాత 200 శాతానికి పెంచుతామని ఆయన చెప్పారు. నిర్దేశిత గడువులోగా ప్లాంట్లు, పరికరాలను ఏర్పాటు చేయని కంపెనీలకు జరిమానా విధించడం జరుగుతుందని కూడా ట్రంప్ తెలిపారు. అమెరికా ప్రజలను రక్షించడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని అధ్యక్షుడు పేర్కొన్నారు.
“పేటెంట్ పొందిన, బ్రాండెడ్ లేదా వినూత్నమైన (innovative) మందులకు సంబంధించిన విధానం – ఇది ఇప్పటికే ఎంతో విజయవంతమైంది – యథాతథంగా కొనసాగుతుంది,” అని ఆయన చెప్పారు.
ఈ నిర్ణయం భారత్‌పై ఎలా ప్రభావం చూపుతుంది?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు జెనరిక్ మందులను సరఫరా చేస్తున్నందున భారత్‌ను తరచుగా “ప్రపంచ ఔషధ కేంద్రం” (pharmacy of the world) అని పిలుస్తుంటారు. అమెరికాలో వినియోగించే జెనరిక్ మందులలో పరిమాణం పరంగా దాదాపు 40 శాతం వాటా భారతీయ మందులదే ఉంది. ‘గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్’ నివేదిక ప్రకారం, 2024-2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికాకు 9.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. ఇది భారత్ మొత్తం ప్రపంచ ఔషధ ఎగుమతుల విలువ (25.8 బిలియన్ డాలర్లు)లో 38 శాతానికి సమానం.
అయితే, ట్రంప్ ప్రకటించిన ఈ కొత్త సుంకాల విధానం భారతీయ ఔషధ కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. భారతదేశం మరియు అమెరికా ఫిబ్రవరిలో ఒక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి, దీని ప్రకారం “జెనరిక్ ఫార్మాస్యూటికల్స్, వాటి తయారీకి కావలసిన పదార్థాల విషయంలో భారతదేశం చర్చల ద్వారా సాధించిన ఫలితాలను పొందుతుంది.”
కానీ ఫార్మా సరఫరాదారులపై సుంకాలు విధిస్తామన్న ఆయన గత బెదిరింపులు, భారతదేశం నుండి చౌకగా లభించే సరఫరాలను ప్రమాదంలో పడేశాయి. అధిక రక్తపోటు, డిప్రెషన్, మధుమేహం, క్యాన్సర్, అంటువ్యాధులు, మానసిక ఆరోగ్యం కోసం భారతీయ జెనరిక్ మందులను విస్తృతంగా సూచిస్తారు. గర్భనిరోధక విషయంలో, 2024లో అమెరికాలో సూచించిన మొత్తం మాత్రలలో సుమారు 65 శాతం, భారతదేశానికి చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, లుపిన్ అనే రెండు కంపెనీల ద్వారానే తయారు చేస్తాయని ఫైనాన్షియల్ పోస్ట్ నివేదికలో వెల్లడైంది. ఏదేమైనా ఈ నిర్ణయం అమెరికా మార్కెట్‌పై భారీగా ఆధారపడిన భారత ఫార్మా కంపెనీలలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
