హైదరాబాద్: రాంపూర్‌లోని మహమ్మద్ అలీ జౌహర్ విశ్వవిద్యాలయానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన కూల్చివేత నోటీసును ఖండిస్తూ, ఇక్కడి మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (MANUU) విద్యార్థులు ‘MANUU స్టూడెంట్ కలెక్టివ్’ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే ఢిల్లీలో విద్యార్థి నిరసనకారులపై పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు.
ఈమేరకు మనూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మతీన్ అష్రఫ్ మాట్లాడుతూ… విద్యార్థుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాంపూర్ విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా జారీ చేసిన కూల్చివేత నోటీసును ఆయన ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు.
SIO జాతీయ క్యాంపస్ కార్యదర్శి తల్హా మన్నన్ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని నిరూపించారని, గత 15 ఏళ్లుగా విద్యార్థులలో నెలకొన్న భయాందోళన వాతావరణాన్ని తమ పోరాటంతో ఛేదించారని ఆరోపించారు. విద్యార్థులు ఒత్తిళ్లకు తలొగ్గబోరని, తమ ఉద్యమం కొనసాగుతుందని ఆయన అన్నారు.
‘జౌహర్ యూనివర్సిటీ కూల్చివేత ముస్లిం వ్యతిరేకం’
జౌహర్ విశ్వవిద్యాలయంపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన కూల్చివేత నోటీసు ముస్లిం, మైనారిటీ వ్యతిరేక మనస్తత్వంతో కూడుకున్నదని, పేద లేదా ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం ప్రభుత్వానికి ఇష్టం లేదని MANUU విద్యార్థి సంఘానికి చెందిన స్వాలే అన్సారీ ఆరోపించారు. అలాగే నిరసన చేస్తున్న విద్యార్థులపై కేంద్రం లాఠీచార్జి చేయడం “నిరంకుశ, విద్యార్థి వ్యతిరేక” వైఖరిని ప్రతిబింబిస్తోందని కూడా ఆయన ఆరోపించారు.
విద్యార్థిని ఫాతిమా మాట్లాడుతూ… కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయగా, న్యాయశాస్త్ర విద్యార్థి అబిద్ రజా, విశ్వవిద్యాలయంపై జారీ చేసిన కూల్చివేత ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుని, విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రజాస్వామ్య వాణిని అణచివేసే ఏ ప్రయత్నమైనా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని వారు పేర్కొన్నారు.
జౌహర్ విశ్వవిద్యాలయం కూల్చివేత నోటీసు
ఉత్తర ప్రదేశ్ పట్టణ ప్రణాళిక, అభివృద్ధి చట్టం-1973 ప్రకారం అనధికార నిర్మాణం జరిగిందని పేర్కొంటూ, మౌలానా మహమ్మద్ అలీ జౌహర్ విశ్వవిద్యాలయంలోని 40 భవనాలలో 38 భవనాలను కూల్చివేయాలని రాంపూర్ అభివృద్ధి అథారిటీ జూలై 15న నోటీసు జారీ చేసింది. ఆ నిర్మాణాలను తొలగించడానికి విశ్వవిద్యాలయానికి 15 రోజుల గడువు ఇచ్చింది.
సుమారు 3,000 మంది విద్యార్థులు ఉన్న ఈ విశ్వవిద్యాలయాన్ని, జైలులో ఉన్న మాజీ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ స్థాపించిన ఒక ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ నోటీసు రాజకీయ ప్రేరేపితమని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీలు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ దీనిని విమర్శించాయి.


