రాంచీ: నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలపై కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమాన్ని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. ఈ నిరసనలను తమ ప్రభుత్వం తీరును ఆయన సమర్థించుకున్నారు. నియామక ప్రక్రియలో సంస్కరణల కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో మాట్లాడుతూ…యువతను తప్పుదోవ పట్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, బీజేపీ నాయకులు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ‘విద్యార్థి ముసుగు’ వాడుకుంటున్నారని సోరెన్ ఆరోపించారు. నియామక అవకతవకలపై దర్యాప్తు ఒక కొలిక్కి రాకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు.
14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను, బకాయి ఉన్న నియామక పరీక్షలను రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సోరెన్ అన్నారు. నియామక పరీక్షలు నిర్వహించే ఏజెన్సీ అయిన టీడీపీఎల్కు సంబంధించిన పరీక్షలపై కూడా దర్యాప్తు జరుపుతామని ఆయన తెలిపారు.
నియామక వ్యవస్థను సమూలంగా మార్చడానికి, పరీక్షలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వంటి ప్రముఖ సంస్థల నైపుణ్యాన్ని ప్రభుత్వం కోరుతుందని ముఖ్యమంత్రి అన్నారు.
టీడీపీఎల్ పాత్రను ఆయన ప్రశ్నించారు. ఆ కంపెనీ ఉత్తరప్రదేశ్‌కు చెందినదని, బీహార్‌తో సంబంధాలు కలిగి ఉందని, జార్ఖండ్ యువత ప్రయోజనాలకు హాని కలిగించే ప్రక్రియలలో ఇటువంటి ఏజెన్సీలు పాలుపంచుకున్నాయని ఆయన ఆరోపించారు.
సందేహాలు, ఫిర్యాదులు వచ్చిన పరీక్షలపై విచారణ జరపడంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని సోరెన్ అన్నారు. నియామక పరీక్షలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిరసనగా జార్ఖండ్ అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించిన విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలు ఉపయోగించిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సోమవారం నాటి నిరసన సందర్భంగా యంత్రాంగం, పోలీసులు సంయమనం పాటించారని, అసెంబ్లీ, పార్లమెంట్, శాసన మండలి వంటి రాజ్యాంగ సంస్థల చుట్టూ భద్రతా ఆంక్షలు వర్తిస్తాయని సోరెన్ పేర్కొన్నారు.
నిరసనకారులలో సుమారు 90% మంది శాంతియుతంగా ఉన్నారని, కేవలం కొద్దిమంది మాత్రమే రాళ్లు రువ్వారని, భద్రతా సిబ్బందిపై బూట్లు, చెప్పులు విసిరారని పోలీసులు తెలిపారు. కొందరు నిరసనకారులు అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించడంతో వారిని చెదరగొట్టడానికి “స్వల్ప బలప్రయోగం” చేసినట్లు వారు చెప్పారు.
రాంచీలో నిరసనకారులను రెచ్చగొట్టడానికి బీజేపీ ప్రయత్నించిందన్న సోరెన్ ఆరోపణకు ఊహించని వర్గాల నుంచి మద్దతు లభించింది. జార్ఖండ్‌లో జరుగుతున్న నిరసనలకు నాయకత్వం వహిస్తున్న, సీపీఐ-ఎంఎల్‌కు అనుబంధంగా ఉన్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) ఒక హెచ్చరిక జారీ చేసింది. “బీజేపీ తీసుకొచ్చిన సంఘ విద్రోహ శక్తులు జార్ఖండ్ విద్యార్థి ఉద్యమాన్ని నేరంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తుండగా కెమెరాల్లో చిక్కారు. ఏఐఎస్ఏ శాంతియుత ప్రజాస్వామ్య నిరసనలకు మద్దతు ఇస్తుంది, అన్ని రకాల హింసను తిరస్కరిస్తుంది. ఈ మొత్తం ఉద్యమాన్ని హింసాత్మకంగా ముద్ర వేయడానికి జార్ఖండ్ ప్రభుత్వం ఈ సంఘ విద్రోహ శక్తులను ఉపయోగించుకోకూడదు” అని పేర్కొంది.
కాగా, నిరసనకారుల డిమాండ్లలో చాలా వరకు తాము అంగీకరించామని జార్ఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, 2026 కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) పరీక్షను రద్దు చేయడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. సీజీఎల్ పరీక్షను హైకోర్టు పర్యవేక్షించిందని, అందులో ఎలాంటి అవకతవకలు కనుగొనలేదని, ఆ తర్వాత సుప్రీంకోర్టు నియామక ప్రక్రియను ఆమోదించిందని ప్రభుత్వం తెలిపింది.
విద్యార్థులతో నేరుగా మమేకమయ్యేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా సోరెన్ నొక్కిచెప్పారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ, పరీక్షలను మెరుగుపరచడంపై 8,500కు పైగా సూచనలు అందినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పోర్టల్ ద్వారా సూచనలు పంపడం కొనసాగించాలని యువతకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కేవలం విద్యార్థుల సమస్యలను చర్చించడానికే ఆసక్తి చూపడం లేదని, భాగస్వాముల సహాయంతో పరిష్కారాలను కనుగొనడంలో తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు.
ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బీజేపీ, దాని విద్యార్థి విభాగమైన అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ మద్దతు ఇవ్వడంతో ఈ నిరసనలు రాజకీయ కోణాన్ని కూడా సంతరించుకున్నాయి. పోలీసుల చర్యకు నిరసనగా బీజేపీ మంగళవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి మిశ్రమ స్పందన లభించగా, పలు ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు, ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడింది. అయితే, అనేక దుకాణాలు తెరిచే ఉన్నాయి. నియామకాలలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బీజేపీ శాసనసభ్యులు కూడా అసెంబ్లీ నుండి వాకౌట్ చేసి, సభ నుండి వెళ్లే ముందు కరెన్సీ నోట్లను విసిరారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్లు నిరసనకారులకు బహిరంగంగా మద్దతు తెలుపుతూ, జంతర్ మంతర్, రాంచీలలో జరిగిన నిరసనల మధ్య పోలిక చూపడానికి ప్రయత్నిస్తుండగా… జార్ఖండ్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తన మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సోరెన్ ప్రభుత్వం నిరసనకారులతో చర్చలు ప్రారంభించి, వారి సమస్యలలో చాలా వరకు నిజమైనవేనని అంగీకరించి, సంయమనం, సానుభూతితో వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది.
