టెహ్రాన్: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఇరాన్‌లోని లారాక్ ద్వీపంపై అమెరికా జరిపిన దాడికి ప్రతిస్పందనగా, జోర్డాన్‌లోని రెండు అమెరికా స్థావరాలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ బాలిస్టిక్ క్షిపణి దాడులు జరిపినట్లు రాయిటర్స్ తెలిపింది. హార్ముజ్ జలసంధిలో సీ మైన్స్ అమర్చేందుకు ఇరాన్ సైన్యం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తూ అమెరికా ఈ దాడులకు పాల్పడింది. దీంతో ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇరాన్ గంటలోనే ప్రతిదాడికి దిగింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి, ఆ ప్రాంతంలోని లక్ష్యాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది.
కాగా, అమెరికా వైమానిక దాడుల కారణంగా దక్షిణ నగరమైన సిరిక్‌లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ విడిగా నివేదించింది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ జరిపిన దాడులతో వీటికి సంబంధం ఉండవచ్చని పేర్కొంది.
ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సీనియర్ చట్టసభ సభ్యుడు ఇబ్రహీం అజీజీ హెచ్చరించారు. “మా సంకల్పాన్ని మరోసారి పరీక్షిస్తే, భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది,” అని అజీజీ అమెరికా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో రాశారు.
“ఏ స్థాయిలో దాడి జరిగినా, సమాధానం ఇవ్వకుండా వదిలిపెట్టబోము,” అని ఆయన అన్నారు. తాను వరుస ఓటములుగా అభివర్ణించిన దానిని పూర్తి చేసే “వినాశకరమైన, మరింత బాధాకరమైన, గుణపాఠం నేర్పే” ప్రతిస్పందన ఉంటుందని ఆయన హెచ్చరించారు.
కాగా, అమెరికా దాడి తర్వాత ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దక్షిణ ఇరాన్ నుండి పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి దిశగా బాలిస్టిక్, యాంటీ-షిప్ క్షిపణులను ప్రయోగించింది. వాటిలో కొన్నింటిని అమెరికా, దాని మిత్రదేశాల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. లారక్ ద్వీపంపై అమెరికా జరిపిన బాంబు దాడులకు ప్రతీకారంగా ‘యా ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్లా’ ఆపరేషన్ ను ఇరాన్ చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జోర్డాన్ లోని అమెరికా ఎయిర్ బేస్ లపై జరిపిన దాడుల్లో భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. వీటికి ప్రతీకారంగా అమెరికా దాడులు కొనసాగిస్తే చమురు రంగంపై మరోసారీ తీవ్ర ప్రభావం తప్పదు.
ఫిబ్రవరి నెలాఖరులో ఇరాన్‌పై దాడులతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలు అధికంగానే ఉన్నాయి. పాకిస్తాన్, ఖతార్‌ల మధ్యవర్తిత్వంతో జూన్‌లో ఒక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం కుదిరినప్పటికీ, జలసంధిలో నౌకాయానానికి సంబంధించి భేదాభిప్రాయాల కారణంగా జూలైలో అమెరికా రెండు వారాల పాటు బాంబుల వర్షం కురిపించి, నౌకా దిగ్బంధనాన్ని తిరిగి విధించింది.


