హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గం నుంచి తనను తొలగించిన కొద్దిసేపటికే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల ప్రాతిపదికన తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ కొండా సురేఖ కాంగ్రెస్ హైకమాండ్‌కు లేఖ రాశారు. రేవంత్ తన నిర్ణయాలను అడ్డుకున్నారని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే నేరుగా ఆదేశాలు జారీ చేస్తూ, మంత్రిగా తన అధికారాలను పరిమితం చేశారని ఆరోపించారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి రాసిన తన లేఖలో, తనను పక్కన పెట్టారని భావించిన పలు నిర్ణయాలను ఆమె ప్రస్తావించారు. “నన్ను సంప్రదించకుండానే కీలకమైన శాఖాపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా, యాదాద్రి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రక్రియ నుంచి నన్ను దూరంగా ఉంచారు, సమ్మక్క-సారలమ్మ ఆలయ నిధులను నాకు తెలియజేయకుండానే రోడ్లు, భవనాల శాఖకు తరలించారు. రామనవమి సందర్భంగా ప్రభుత్వ ప్రకటనల నుంచి నా ఫోటోను తొలగించారని ఆమె లేఖలో పేర్కొన్నారు.
“రాజకీయంగా, పరిపాలనాపరంగా నన్న క్రమంగా అణచివేసినట్లు భావిస్తున్నాను. ఇది నాకు తీవ్రమైన బాధను కలిగించింది. నా అధికార హోదాలో నాకు దక్కాల్సిన కనీస గుర్తింపు, గౌరవాన్ని కూడా ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తున్నారనే బలమైన అభిప్రాయం కలిగిందని” ఆ లేఖలో పేర్కొన్నారు.
ఓఎస్‌డీ సుమంత్ వివాదం
తన ఓఎస్‌డీ అధికారి సుమంత్‌ను అరెస్టు చేయడానికి దారితీసిన పోలీసుల చర్యను ఆ లేఖలో వివరించారు. అతడిని అరెస్టు చేసే ప్రయత్నంలో పోలీసులు తన అధికారిక మంత్రి నివాసానికి వచ్చారని కొండా సురేఖ ఆరోపించారు.
“ఈ సంఘటనను నా వ్యక్తిగత గౌరవానికి అవమానంగానే కాకుండా, అధికారంలో ఉన్న మంత్రి గౌరవం, హోదా పట్ల తీవ్రమైన అగౌరవంగా కూడా నేను భావిస్తున్నాను,” అని ఆమె అన్నారు.
‘కొండా కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగా ఏకాకిని చేశారు’
తాను ఎమ్మెల్యేగా ఉన్న తూర్పు వరంగల్ నుండి తన కుటుంబాన్ని ఏకాకిని చేయడానికి పథకం ప్రకారం రాజకీయ దాడి జరుగుతోందని కూడా ఆమె ఆరోపించారు. “నా నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను, ముఖ్యంగా ‘స్మార్ట్ సిటీ మోడల్ బస్ స్టాండ్’, ‘బొంది వాగు’ పనులను నిరంతరం నిర్లక్ష్యం చేస్తున్నారు.”
తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు తనను ఎలా బాధ్యురాలిని చేస్తారని ప్రశ్నిస్తూ, ఆ విషయంలో తనకు జారీ చేసిన ‘షో-కాజ్’ నోటీసుపై సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై నిష్పాక్షికమైన, సమగ్రమైన విచారణ జరపాలని రాహుల్ గాంధీని కోరుతూ ఆమె ఆ లేఖను ముగించారు.
“కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, సూత్రాలపై నాకున్న నమ్మకమే ఈ సమస్యలను మీ దృష్టికి తీసుకువచ్చే ధైర్యాన్ని నాకు ఇచ్చింది,” అని ఆ లేఖలో పేర్కొన్నారు.
బీజేపీలో చేరడం లేదు: కొండా సురేఖ
అనంతరం, తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీతో తనకున్న సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపవని కొండా సురేఖ మీడియాతో స్పష్టం చేశారు. “నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. నేను కాంగ్రెస్‌లోనే కొనసాగుతాను. ఎమ్మెల్యేగా నా బాధ్యతలను నిర్వర్తిస్తాను. నా నాయకుడి పట్ల, నా ప్రజల పట్ల బాధ్యతగా ఉంటాను,” అని తెలంగాణ మంత్రివర్గం నుండి తొలగించిన తర్వాత కొండా సురేఖ అన్నారు.


