Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

మన ఇళ్లల్లో మూగబోయిన మాటలు!

Share It:

ముహమ్మద్ ముజాహిద్…✍️

మనసనేది ఒకటుంది అని గుర్తుపెట్టుకోవడానికే ఇవాళ ఒక వ్యాసం రాసుకోవాల్సి రావడం కంటే పెద్ద దురదృష్టం ఇంకేముంటుంది? వింటున్నాం… రోజూ వింటూనే ఉన్నాం.

కానీ వినడం వేరు, ఆ ఆలకించడంలో ఒక ప్రాణాన్ని, ఒక స్పందనను పట్టుకోవడం వేరు. ఈ సమాజంలో శబ్దాలు ఎక్కువయ్యాయి, కానీ సంభాషణ చచ్చిపోయింది!

ఒకప్పుడు ఇంట్లో మనుషులుంటే ఆ ఇల్లు కళకళలాడేది. మాటలు చిందేవి, నవ్వులు విరిసేవి. ఇవాళ? ఒకే కప్పు కింద నలుగురు మనుషులు ఉంటారు. ఎవరి చేతిలో చూసినా ఒక మెరిసే కాంతి తెర — ఆ స్మార్ట్‌ఫోన్! నలుగురూ నాలుగు మూలలా కూర్చుంటారు. దూరంగా చూసేవాడికి ఆ ఇల్లు మహా ప్రశాంతంగా, సుఖసంతోషాలతో తులతూగుతున్నట్టు కనిపిస్తుంది. కానీ, లోపలికి తొంగి చూస్తే… అక్కడ ఉంది ప్రశాంతత కాదు, శ్మశాన నిశ్శబ్దం! మనుషులు పక్కపక్కనే ఉన్నారు, కానీ వారి మనసుల మధ్య ఆకాశమంత దూరం పెరిగిపోయింది.

మనుషుల మధ్య ‘టెక్నాలజీ’ గోడలు

టెక్నాలజీ పెరిగింది. సెకన్లలో అమెరికాలో ఉన్నవాడితో వీడియో కాల్ మాట్లాడేస్తున్నాం. కానీ పక్క గదిలో ఉన్న కన్నతండ్రి ఏం ఆలోచిస్తున్నాడో, కడపటి చెల్లెలు ఎందుకు మూగబోయిందో తెలుసుకునే తీరిక లేదు, ఆత్రుత లేదు. “నాకు అన్నీ తెలుసు, ఈ కాలం కుర్రాడికి తెలిసింది మా నాన్నకేం అర్థమవుతుందిలే!” అనే ఒకరకమైన అహంకారం, అలసత్వం ఇవాళ సంబంధాలను దిగమింగేస్తున్నాయి.

సంభాషణ అంటే కేవలం సమాచారం బదిలీ చేసుకోవడం కాదు రాజా! ఎదుటి మనిషి సంతోషాన్ని, బాధని, అలసటని నీ గుండెల్లోకి అనుభవపూర్వకంగా ఆహ్వానించడం. నీ కోడింగ్ గురించో, కార్పొరేట్ ఉద్యోగం గురించో మీ అమ్మకు అర్థం కాకపోవచ్చు. కానీ, పొద్దున్నుంచి నువ్వు పడ్డ ఆరాటం, నీ కళ్లల్లోని అలసట ఆమెకు అర్థమవుతుంది. ఆ మాత్రం చిన్న స్పర్శని, ఆ పలకరింపుని మనం ఈ యంత్రాల ప్రపంచంలో కోల్పోతున్నాం.

స్వార్థపు కొలతలు… పడిపోయిన బంధాలు

ఇవాళ సంభాషణలు కూడా వ్యాపారమైపోయాయి. “అవసరం ఉంటేనే ఫోన్ చేస్తాడు” అనే స్థాయికి దిగజారిపోయాం. ఆస్ట్రేలియా ప్రొఫెసర్ మార్టిన్ బుబెర్ ఒక మాటన్నాడు — ‘నేను – అది’ (I and It) బంధాల గురించి. ఎదుటి మనిషిని ఒక వస్తువుగా, ఒక అవసరంగా చూసే రోగం ఇది. ‘నాకేంటి లాభం?’ అనుకున్న క్షణాన సంభాషణలో ఆత్మ చచ్చిపోతుంది.

అదే ‘నేను – నువ్వు’ (I and Thou) అనుకో! అక్కడ స్వార్థం ఉండదు. ఒక ఆధ్యాత్మిక లోతు ఉంటుంది. నీ ఇంట్లో ఉన్న మనుషులను ఒక జీవమున్న ప్రాణులుగా, ఆత్మ ఉన్న వ్యక్తులుగా నువ్వు గుర్తించినప్పుడు… “ఏం మాట్లాడాలిరా దేవుడా?” అనే ప్రశ్నే పుట్టదు. మాటలు అవే పారతాయి.

కాస్త అహాన్ని పక్కన పెడదాం!

ఇప్పుడేం చేయాలి? చాలా సింపుల్!
ఈ గోడలను బద్దలు కొట్టడానికి పెద్ద పెద్ద తత్వశాస్త్రాలు అక్కర్లేదు.

ఈ సాయంత్రం ఫోన్ పక్కన పడేసి మీ నాన్న పక్కన కూర్చోండి. “నాన్న, చిన్నప్పుడు నీకు బాగా నచ్చిన ఆట ఏంటి?” అని అడగండి. ఆ ముసలాయన కళ్లల్లో వెలిగే కాంతిని చూడండి.

మీ పిల్లలతో రిపోర్టింగ్‌లా కాకుండా, స్నేహితుడిలా మాట్లాడండి.

ఎదుటి మనిషి చెబుతున్నప్పుడు మధ్యలో దూరి సలహాలు ఇచ్చేయకండి. నిశ్శబ్దంగా, శ్రద్ధగా వినడం నేర్చుకోండి. వినడం కూడా ఒక గొప్ప కళ!

రెండు చక్రాలు సరిగ్గా తిరిగితేనే బండి ముందుకు సాగుతుంది. “వాడే ఫోన్ చేయలేదు, నేనెందుకు చేయాలి?” అనే ఈ అహాన్ని, పట్టుదలను, బద్ధకాన్ని కాస్త పక్కన పెడదాం. మౌనం ఉండాల్సిన చోట మౌనంగా ఉందాం, కానీ మనుషులను గెలుచుకోవాల్సిన చోట మనసు విప్పి మాట్లాడదాం. మాటలు ఆగిపోతే… బంధాలు చచ్చిపోతాయి. మాట్లాడదాం… మనుషులను గెలుచుకుందాం!

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.