Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

అక్షర సాక్షిగా.. రాజ్యమేలుతున్నఅణచివేత !

Share It:

ముహమ్మద్ ముజాహిద్…✍️

భారతదేశంలో మీడియా వృత్తి నిపుణుల పరిస్థితిపై ఉన్న ఆందోళనలు అక్షర సత్యాలు, ఎంతో బాధాకరమైన వాస్తవాలు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వేచ్ఛకు దేశ రాజధాని నడిబొడ్డున పడుతున్న మచ్చ ఇది. ప్రజాస్వామ్యానికి నాలుగవ స్థంబంగా వర్ధిల్సాల్సిన పత్రికా రంగం నేడు భయానక వాతావరణంలో, సంకెళ్ల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

ఢిల్లీలోని సాకేత్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు మహిళా జర్నలిస్టులు షహీన్ ఖాన్, నఫీసాలపై జరిగిన దాడి ఉదంతం కేవలం ఒక భౌతిక దాడి మాత్రమే కాదు; అది ప్రశ్నించే గొంతుకలపై, నిజాన్ని నిలదీసే ధైర్యంపై వ్యవస్థీకృత దాడి. ప్రజల ముందుంచాల్సిన అవకతవకలను, ‘సైకిల్ కుంభకోణం’ వంటి ప్రజాధన లూటీని నిలదీసినందుకు జర్నలిస్టులను పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకెళ్లి, మతపరమైన గుర్తింపును చూపి శారీరకంగా హింసించడం దారుణం. ఇది కేవలం బాధ్యతారహితమైన పోలీస్ చర్య మాత్రమే కాదు, పాలకులను ప్రశ్నిస్తే ఎదురయ్యే వికృత రూపానికి నిదర్శనం.

అణచివేతకు గురవుతున్న స్వతంత్ర స్వరం
నేడు భారతదేశంలో జర్నలిజం ఒక వృత్తిగా కాక, ప్రాణాలను పణంగా పెట్టే సాహస యాత్రగా మారింది.

ప్రభుత్వ విధానాలను, లోపాలను ఎత్తిచూపే నిజాయితీపరులైన జర్నలిస్టులపై UAPA, దేశద్రోహ చట్టాల వంటి కఠిన నిబంధనలను అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు.

జర్నలిస్టుల అరెస్టులు, సంవత్సరాల తరబడి నిర్బంధాలు స్వతంత్ర గొంతుకలను మూయించే కుట్రలో భాగమే.

ముఖ్యంగా ముస్లిం జర్నలిస్టులు, అందునా మహిళా జర్నలిస్టులు (రానా అయ్యూబ్, అర్ఫా ఖానుమ్ షెర్వాణి వంటి వారు) ముమ్మరమైన సోషల్ మీడియా వేధింపులు, ఆన్‌లైన్ ట్రోలింగ్‌లు, వ్యక్తిగత దూషణలను నిత్యం ఎదుర్కొంటున్నారు.

దిగజారుతున్న పత్రికా స్వేచ్ఛా సూచీ
2026 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో 180 దేశాలకు గాను భారత్ 157వ స్థానానికి పడిపోవడం మన దేశ పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చే పరిణామం. ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ నివేదికలు స్పష్టం చేస్తున్నట్లుగా, చట్టపరమైన బెదిరింపులు, భౌతిక దాడులు, సెన్సార్‌షిప్ భారత్‌లో పత్రికా స్వేచ్ఛను శ్వాస లేకుండా చేస్తున్నాయి. ప్రధాన స్రవంతి మీడియాలో సముచిత ప్రాతినిధ్యం కరువై, అణగారిన వర్గాల గొంతు మూగబోతున్న వేళ, నిజాన్ని నిలదీసే జర్నలిస్టులు మరింత ఒంటరైపోతున్నారు.

“నిజం నిర్భయంగా బయటకు రావలసిన చోట, భయం రాజ్యమేలుతుంటే.. అక్కడ ప్రజాస్వామ్యం శవమై పడి ఉందని అర్థం.”

ప్రభుత్వాలు మారవచ్చు, విధానాలు మారవచ్చు కానీ పాలకుల తప్పులను ఎత్తిచూపే జర్నలిజం యొక్క ఆత్మను చంపేయాలని చూస్తే చరిత్ర ఎప్పటికీ క్షమించదు. బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని, జవాబుదారీతనాన్ని నిర్ధారించకపోతే.. ఈ దేశంలో ప్రశ్నించే హక్కు కేవలం ఒక కలగా మిగిలిపోతుంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.