ఖానాపూర్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR – Special Intensive Revision) ప్రక్రియను ఎటువంటి తప్పులు లేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈమేరకు నిన్న నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రాతో కలిసి ఆయన ఈ ప్రక్రియను సమీక్షించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, అర్హులైన ప్రతి ఓటరును చేర్చాలని, అలాగే మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించాలని సీఈఓ అధికారులకు సూచించారు. కుటుంబ వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, పేర్లు, వయస్సు, చిరునామాలలో ఉన్న తప్పులను సరిదిద్దాలని ఆయన బీఎల్ఓలను ఆదేశించారు.
అలాగే 18 ఏళ్లు పైబడిన యువత ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన ప్రచారాలు నిర్వహించాలని, అలాగే పౌరులు తమ పేర్లను జాబితాలో సరిచూసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ సవరణను కఠినంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ భావేష్ మిశ్రా తెలిపారు.


