Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

హైదరాబాద్‌లో భూగర్భ జలాల గర్భశోకం!

Share It:

ముహమ్మద్ ముజాహిద్…✍️

హైదరాబాద్‌ను కమ్ముకుంటున్న కాలుష్య మేఘాలు!

భూగర్భంలో పెరుగుతున్న నైట్రేట్, ఫ్లోరైడ్ ముప్పు!-

హైదరాబాద్ మహా నగరం… చారిత్రక వైభవానికి, బతుకుదెరువు వెతుక్కుంటూ వచ్చే లక్షలాది ఆశలకి నిలయం. కానీ, నేడు ఈ మహానగర ప్రజల గొంతు తడుపుతున్న భూగర్భ జలాలు విషపూరితం అవుతున్న వైనం మన పాలకుల కళ్లు తెరిపించాల్సిన తీవ్రమైన హెచ్చరిక. ఉస్మానియా, జేఎన్‌టీయూ, సీఎస్‌ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు తాజాగా వెలుగులోకి తెచ్చిన సత్యాలు అక్షరాలా గుండెల్ని పిండేసేలా ఉన్నాయి.

నగరంలో వర్షాకాలానికి ముందు, ఆ తర్వాత సేకరించిన జల నమూనాలను పరిశీలిస్తే… దాదాపు మూడో వంతుకు పైగా బావుల్లో, బోర్లలో ‘నైట్రేట్’ మరియు ‘ఫ్లోరైడ్’ రూపంలో మృత్యువు ప్రవహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. త్రాగునీటిలో ఉండాల్సిన నిర్దిష్ట ప్రమాణాలను ఈ విష పదార్థాలు ఎప్పుడో దాటేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.

నైట్రేట్ కాలుష్యం ఏ స్థాయికి చేరిందో చూస్తే విస్మయం కలుగుతుంది. నిబంధనల ప్రకారం 45 మి.గ్రా./లీటర్లకు మించకూడని ఈ మూలకం… వర్షాకాలం తర్వాత ఏకంగా 40 శాతం నమూనాలలో విపరీతమైన మోతాదులో (కొన్నిచోట్ల ఏకంగా 797 మి.గ్రా. వరకు) కేంద్రీకృతమై ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నైరుతి, మధ్య ప్రాంతాల్లో దీని ప్రభావం మరింత ఎక్కువ. అడ్డగోలుగా వాడుతున్న రసాయనిక ఎరువులు, లీకవుతున్న సెప్టిక్ ట్యాంకులు, కట్టడి లేని మురుగునీటి ప్రవాహం భూగర్భ జలాలను ఇలా విషతుల్యం చేస్తున్నాయి.

మరోవైపు ఫ్లోరైడ్ భూతం ఉత్తర, దక్షిణ, నైరుతి జోన్లలో కోరలు చాచింది. వర్షాకాలం నాటి నమూనాలలో దాదాపు 64 శాతం నీరు ఫ్లోరైడ్ బారిన పడినట్లు అధ్యయనం చెబుతోంది. భూమి పొరల్లోని రాళ్లు కరగడం వంటి సహజ కారణాలతో పాటు, విపరీతమైన భూగర్భ జలాల తోడుత ఈ ముప్పు మరింత తీవ్రమవుతోంది. TDS (మొత్తం కరిగిన ఘన పదార్థాలు), నీటి కాఠిన్యం వంటి అంశాల్లోనూ మన నీరు ప్రమాదకర స్థాయిలోనే ఉంది.ఈ కాలుష్య కోరల్లో అందరికంటే ఎక్కువగా బలవుతున్నది పసిపిల్లలే. వారి సున్నితమైన శరీరాలు ఈ విషాన్ని తట్టుకోలేక అనారోగ్యాలపాలవుతున్నాయి. పిల్లల్లో హెల్త్ రిస్క్ ఇండెక్స్ (THI) ప్రమాదకర స్థాయికి చేరిందని నిపుణులు ఆందోళన వ్యక్తులతో హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికైనా కళ్లు తెరుద్దాం. కేవలం కాగితాల మీద సమీక్షలు సరిపోవు. మురుగునీటి ప్రవాహానికి శాశ్వత అడ్డుకట్ట వేయడం, కాలుష్య కారక పరిశ్రమలు, వ్యర్థాల నిర్వహణపై నిరంకుశమైన, కఠినమైన చర్యలు తీసుకోవడం అత్యవసరం. మన భావితరాల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలంటే… భూగర్భ జలాల పరిరక్షణే నేటి ప్రథమ కర్తవ్యం కావాలి!

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.